గాలివాన బీభత్సం


Thu,April 18, 2019 12:06 AM

చెన్నూర్, నమస్తే తెలంగాణ: చెన్నూర్‌లో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పగలంతా ఎండ ఉండగా ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొచ్చాయి. భారీ ఈదురు గాలులు వీచాయి. అనంతరం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు విరిగి పడ్డాయి. రోడ్లపై చెట్లు విరిగి పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇండ్లపై ఉన్న రేకులు గాలులకు లేచిపోయాయి. బిల్డింగ్‌లపై ఉన్న వాటర్ ట్యాంకులు కొట్టుకుపోయాయి. పట్టణంలోని మారెమ్మవాడలోని ఇంటి రేకులు కొట్టుక పోయి ఇంట్లో ఉన్న బోగే స్వప్నపై పడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఎక్కడిక్కడ విద్యుత్ స్తంభాలు విరిగి పడగా, వైర్లు తెగిపోయాయి. విద్యుత్ వ్యవస్థను సరిచేసే సరికి రెండు రోజుల పట్టే పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షానికి రోడ్లపై ఎక్కడిక్కడ వర్షం నీరు నిలిచింది. గెర్రకాలనీలోని మామిడి తోటల్లో కాయలు నేల రాలాయి. చేతికందే సమయానికి అకాల వర్షానికి మామిడి కాయలు నేలరాలడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షంతో అన్ని రకాలుగా తీవ్ర నష్టం వాటిల్లింది.

చెన్నూర్ రూరల్: మండలంలో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. మామిడి చెట్లు నేరకొరిగాయి. కాయలు నేల రాలాయి. పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బావురావుపేట, దుగ్నెపల్లిలో పలువురి ఇంటి కప్పు, రేకులు గాలికి కొట్టుకు పోయాయి. పంటలు సైతం దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కల్లాల్లో ఉంచిన ధాన్యం తడిచింది.

జైపూర్: అకాల వర్షానికి మండలంలోని జైపూర్, కిష్టాపూర్, పౌనూర్ గ్రామాల్లోని మామిడితోటలకు నష్టం వాటిల్లింది. కాయలు నేలరాలడంతో పాటు చెట్లు విరిగి పడ్డాయి. శివ్వారంలో చెట్లు విరిగి కరెంటు తీగలపై పడడంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. శివ్వారం, పౌనూర్‌లోని కొనుగోలు కేంద్రాల్లోని వరిధాన్యం తడిసి పోయింది. వ్యవసాయాధికారులు నష్టాన్ని సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

భీమారం: మండలంలో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం కారణంగా నష్టం వాటిల్లింది. కొత్తపల్లిలో సుమారుగా 10 నుంచి 20 రేకుల ఇండ్ల పైకప్పులు ఎగిరి పోయాయి. ఎల్‌బీ పేటలో పలు విద్యుత్ స్తంభాలతో ట్రాన్స్‌ఫార్మర్ నేలకొరిగింది. మద్దికల్ శివారులోని మామిడి చెట్లు విరిగి పోగా మామిడి కాయలు నేలరాలాయి. పలు ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...