టార్గెట్ జడ్పీ


Wed,April 17, 2019 01:20 AM

-జిల్లా పరిషత్ పీఠమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ కసరత్తు
ఎంపీటీసీ,జడ్‌పీటీసీ టికెట్ల కోసం ప్రయత్నాలు
-నేతల చుట్టూ ఆశావహులు ప్రదిక్షణలు
-ప్రతిపక్షాల్లో వీడని నైరాశ్యం
మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(జడ్‌పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) ఎన్నికల సందడి మొదలైంది. వారం రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో ఆశావహులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. నెల రోజుల క్రితమే రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. అధికారులు కూడా పోలింగ్ బూత్‌లు, శిక్షణలు పూర్తి చేశారు. ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వెంటనే రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారు. రెండు రోజుల క్రితమే జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. దీంతో పల్లెల్లో కోలాహలం షురూవైంది. ఈ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతుండటంతో టీఆర్‌ఎస్ టికెట్ల కోసం భారీగా పోటీ ఉంది.

ఒక్కో టికెట్ కోసం దాదాపు ఐదు నుంచి పది మందికిపైగా పోటీపడుతున్నారు. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో విజయఢంకా మోగించడం, లోక్‌సభ ఎన్నికల్లో కూడా భారీగా సీట్లు వచ్చే అవకాశం ఉండటంతో గులాబీ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమని భావిస్తున్నారు. టికెట్ల బాధ్యతలు స్థానిక ఎమ్మెల్యే, మంత్రికి అప్పగించారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు పరుగులు పెడుతున్నారు. తమ మనోభావాలను తెలుపుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిన నాయకుల నుంచి తాజా మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, గ్రామ, మండల అధ్యక్షులు రిజర్వేషన్లు కలిసివచ్చిన చోట పోటీ చేసేందుకు సై అంటున్నారు. మహిళలకు రిజర్వ్ అయిన చోట తమ భార్యలను, కుటుంబ సభ్యులను బరిలోకి నిలిపి రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

జడ్పీ ఎస్సీ మహిళకు రిజర్వుడ్
2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. రొటేషన్ పద్ధతిలో కాకుండా, మొదటి నుంచి రిజర్వేషన్లు కేటాయించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ జిల్లా స్థాయిలోనే చేశారు. ఎంపీపీ రిజర్వేషన్లు రాష్ట్రస్థాయిలో కేటాయించారు. జిల్లా జనాభా యూనిట్‌గా తీసుకుని జడ్పీటీసీ రిజర్వేషన్ స్థానాలు కేటాయించగా, మండ ల జనాభాను పరిగణలోకి తీసుకుని ఎంపీటీసీ స్థానాలను కేటాయించారు. జిల్లా జడ్పీ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించారు. జైపూర్, కోటపల్లి స్థానాలు ఎస్పీ మహిళకు కేటాయించారు. ఈ రెండు ఎస్సీ మహిళకు కేటాయించడంతో అక్కడ గెలిచిన వారు జడ్పీ స్థానం కైవసం చేసుకునే అవకాశం ఉంది. మందమర్రి స్థానం ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తన సతీమణిని బరిలోకి దించాలని భావిస్తున్నారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కోసం ఆయన తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అన్ రిజర్వ్‌డ్ మహిళా స్థానాలు ఉన్నాయి. అక్కడ నుంచి కూడా ఎస్సీ మహిళను గెలిపించుకుని జిల్లాలో చక్రం తిప్పాలని పలువురు నేతలు భావిస్తున్నారు.

క్లీన్‌స్వీప్ చేసేందుకు టీఆర్‌ఎస్..
అసెంబ్లీ ఎన్నికల్లో మూడు నియోజకవర్గాలను క్వీన్‌స్వీప్ చేసింది. పంచాయతీ ఎన్నికల్లో కూడా 90 శాతం గులాబీ మద్దతుదారులు గెలుపొందారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓటర్లు మద్దతుగా నిలిచారని టీఆర్‌ఎస్ అధిష్టానం భావిస్తున్న ది. ఈ క్రమంలో మరోమారు గెలిచి గ్రామాల్లో తమ పట్టు నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలను కోలుకోలేని విధంగా దెబ్బ తీశామని, ఇక ప్రాదేశిక ఎన్నికల్లో విజయం సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు నేతలకు దిశానిర్దేశం చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

నియోజకవర్గాల్లో గెలిపించుకునే బాధ్యతను ఎమ్మెల్యేలపైన పెట్టారు. జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకోవడానికి ఎమ్మెల్యేలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నేతలందరూ ప్రస్తుతం హైదరాబాద్‌లో మకాం వేశారు. బుధ, గురువారాల్లో అంతా జిల్లాకు రానున్నారు. వచ్చిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీల ఖరారు విషయంలో ఒక కొలిక్కి రానుంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయించడంతో ఆ స్థానాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నారు. అదే సమయంలో మిగతా చోట్ల అన్‌రిజర్వుడు స్థానాలు ఒకటి రెండు చోట్ల నుంచి ఎస్సీ మహిళలను నిలబెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. మొట్టమొదటి సారిగా ఏర్పాటైన జడ్పీ పీఠంపై గులాబీ జెండా ఎగురవేసేందుకు అందరూ సిద్ధం అవుతున్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...