నేడే ఆఖరు


Mon,March 25, 2019 01:40 AM

- ఇవాళ్టితో ముగియనున్న లోక్‌సభ నామినేషన్ల గడువు
- నామినేషన్ వేయనున్న టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటేశ్ నేత

కలెక్టరేట్(పెద్దపల్లి జిల్లా) : మొదటి విడత లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వం చివరి దశకు చేరుకుంది. మార్చి 18న స్వీకరణ మొదలుకాగా.. సోమవారంతో ముగియనుం ది. ఇప్పటివరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ తరఫున నామినేషన్ వేయించారు. నేడు భారీ జన సమీకరణతో నామినేషన్ వేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులుగా టీఆర్‌ఎస్ నుంచి బోర్లకుంట వెంకటేశ్ నేత, కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ ఆగమ చంద్రశేఖర్, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బాల కల్యాణ్ పంజా, బీజేపీ నుంచి ఎస్. కుమార్‌లను అభ్యర్థులుగా ప్రకటిస్తూ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బోర్లకుంట వెంకటేశ్ నేతను ప్రకటించడంతో ఆయన తరుఫున ఈనెల 22న పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌లు మొదటి సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఆగమ చంద్రశేఖర్‌ను ఆ పార్టీ ప్రకటించడంతో ఈ నెల 20న పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్యతో కలిసి పత్రాలు సమర్పించారు.

ఇప్పటి వరకు 12 నామినేషన్లు దాఖలు
ఇప్పటివరకు పెద్దపల్లి పార్లమెంట్‌కు స్థానానికి తాడెం రాజేశ్(ఇండియా ప్రజాబంధు పార్టీ), ఇరుగురాల భాగ్యలక్ష్మి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), కొయ్యడ స్వామి(స్వతంత్ర), దుర్గం రాజ్‌కుమార్(స్వతంత్ర), అంబాల మహేందర్(స్వతంత్ర), గద్దల వినయ్‌కుమార్(స్వతంత్ర), గొడిశెల నాగమణి(స్వతంత్ర), ఆశ్రం అశోక్(స్వతంత్ర), బోర్లకుంట వెంకటేశ్ నేత(టీఆర్‌ఎస్), కుంటల నర్సయ్య(స్వతంత్ర), ఎక్రికిళ్ల రాజేశ్(స్వతంత్ర), బాల కల్యాణ్ పంజా(బీఎస్పీ) నామినేషన్లు దాఖలు చేశారు. నేడు బీజేపీ అభ్యర్థి ఎస్.కుమార్‌ను నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరితోపాటు మరికొంత మంది కూడా పత్రాల సమర్పణకు సిద్ధమవుతున్నారు.

నేడు నామినేషన్ వేయనున్న టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటేశ్ నేత
పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ పార్టీ తరుఫున బోర్లకుంట వెంకటేశ్ నేతను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆయన తన మద్దతుదారులతో పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు, కార్యకర్తలను భారీ ఎత్తున సమీకరించి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. నామినేషన్‌ను చివరి రోజు అట్టహాసంగా వేయాలన్న ఉద్దేశంతో జన సమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బోర్లకుంట వెంకటేశ్ నేతను రాష్ట్రంలోనే రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, బాల్క సుమన్‌లతోపాటు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌లు గట్టి పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. వీరితోపాటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...