గెలిచి తీరుతాం..


Sun,March 24, 2019 12:08 AM

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పెద్దపల్లి పార్లమెంట్ సీటు సాధించి తీరుతామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చే శారు. ఆయన శనివారం జిల్లాకేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశం లో, విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎన్నోసార్లు కిందపడ్డా, ఉత్సాహంతో ముందుకు సాగి విజయాలు సాధించామని చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తదితర పథకాలు అమలుచేసి ముఖ్యమంత్రి పేదల సంక్షేమానికి పాటుపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో 16 మందిని గెలిపించుకుంటే అద్భుతమైన అభివృద్ధి సాధించవచ్చని స్పష్టం చేశారు. గతంలో ఈ ప్రాంత అభివృద్ధి విసర్మించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సైతం తెలంగాణకు అన్యా యం చేసిందన్నారు. రాష్ట్రం నుంచి రూ.50వేల కోట్లు కేంద్రానికి వెళ్తే మనకు కేవలం రూ.24 వేల కోట్లే ఇచ్చారన్నారు.

డబ్బులు ఉన్నాయనే అహంభావం..
మాజీ ఎంపీ వివేక్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయకుండా గ్రూపులు పెట్టారనీ.. నలుగురు, ఐదుగురు ఎమ్మెల్యేలు ఓడిపోతే వాళ్లను తీసుకుని వేరే పార్టీలోకి వెళ్లాలని అనుకున్నది నిజం కాదా? అని మంత్రి ప్రశ్నించారు. అతడు ప్రజల గురించే ఆలోచించే నాయకుడు కాదనీ.. పక్కా వ్యాపారవేత్త అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఉన్నాయనే అహంభావంతో కోట్లాది రూపాయ లు ఖర్చు చేసిన వ్యక్తికి టిక్కెట్ ఎందుకు ఇవ్వాల ని ప్రశ్నించారు. ఒకవేళ టిక్కెట్ ఇస్తే ఎంపీగా గెలి చి మరికొందరిని తీసుకొని మరో పార్టీకి వెళ్తావనే సమాచారం ఉండడం వల్లే అధిష్ఠానం అవకాశమివ్వలేదని స్పష్టంచేశారు. వివేక్ చవకబారు ఆరోపణలు మానుకోవాలని సూచించారు. కేసీఆర్ అం దరినీ కూడగట్టి తెలంగాణ తెచ్చి, ఇదే రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ చేయాలని ముందుకు సాగుతున్న తరుణంలో పార్టీని ఇబ్బంది పెట్టే ఇలాంటి వ్యక్తులను ఏ అధిష్ఠానం కూడా సమర్థించదని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పెద్దపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు రేవతిరావు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, ఐసీడీఎస్ ఆర్గనైజర్ అత్తి సరోజ, మంచిర్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ మామిడిశెట్టి వసుంధర, జడ్పీటీసీ ఆశాలత, కందుల సంధ్యారాణి పాల్గొన్నారు.

వీ అంటే వంచన, విద్రోహం, విద్వేషం
- బాల్క సుమన్, ఎమ్మెల్యే, చెన్నూర్
విభిన్న ధ్రువాల కలయిక టీఆర్‌ఎస్. అందరూ పార్టీ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తారు. ఉద్యమాల గడ్డ అయిన ఇలాంటి ప్రాంతం నుంచి కొందరు జంప్ జిలానీలు రావడం దురదృష్టకరం. వివేక్ ఎప్పుడూ వీ చూపిస్తారు. వీ అంటే వినయం, విధేయత, వివేకం అనుకునేవాణ్ణి. కానీ, వీ అంటే వెన్నుపోటు, విద్రోహం, వంచన అని నిరూపించారు. ఆయన తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం. మీరు పార్టీ నుంచి వెళ్లిపోయి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి నీ మీద ఉన్న గౌరవంతో సముచితమైన పదవి ఇచ్చారు. పార్టీ అభ్యర్థులను ఓడించాలనుకున్న నువ్వు ద్రోహివా..? నీకు పదవులు ఇచ్చిన మేం ద్రోహులమా..? టాంక్‌బండ్ మీద అంబేద్కర్ విగ్రహం పెట్టాల్సిన చోట మీ నాన్న వెంకటస్వామి విగ్రహం పెట్టేందుకు ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారు. ఇంతకు మించి ఏం కావాలి. దళితులకు అన్యాయం చేశారని వివేక్ అంటున్నడు. పార్టీలో నువ్వు ఒక్కడివే దళితుడివా..? నేను, దుర్గం చిన్నయ్య, కొప్పుల ఈశ్వర్ అందరం దళితులమే. మరి మాకు పార్టీలో న్యాయం జరిగింది కదా. నువ్వు దొంగవు, ద్రోహివి. నీ దగ్గర పైసలు ఉంటే... మా దగ్గర ప్రజాబలం ఉంది. చీకటి, చాటు మాటు రాజకీయాలు ప్రజలు సహించరు. వివేక్ నీకు దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీలు ఉన్నయ్. ఇక్కడ ఓట్లు వేసిన ప్రజల కోసం ఒక్క ఫ్యాక్టరీ అయినా పెట్టినవా..? ఒక్కరికి అయినా ఉద్యోగం ఇచ్చావా.. చెప్పు.

కేంద్రంలో మనమే చక్రం తిప్పుదాం
- నడిపెల్లి దివాకర్‌రావు, ఎమ్మెల్యే, మంచిర్యాల
16 మంది ఎంపీలు గెలిస్తే కచ్చితంగా కేంద్రంలో మనమే చక్రం తిప్పుతాం. ప్రస్తుతం దేశంలో ఏ పార్టీకి పెద్దగా మెజారిటీ వచ్చే అవకాశం లేదు. దీంతో మనం కీలకం అవుతాం. ఈ నేపథ్యంలో 16మందితో అనుకున్నది సాధించుకోవచ్చు. వెంకటేశ్ నేత అధికారిగా ఉండి కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 20 ఏండ్లు పట్టినయ్. కానీ, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేండ్లలోనే పూర్తి అయ్యాయి. అందరు గెలిస్తే మనకు ఎక్కువ నిధులు వస్తాయి. అభివృద్ది వేగం అందుకుంటుంది.

ఇక్కడ ఉన్నది వెంకటేశ్ నేత కాదు కేసీఆర్
- కోరుకంటి చందర్, ఎమ్మెల్యే, రామగుండం
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసులు పెట్టినా ఆగలేదు. అందరం కష్టపడి పనిచేసినం. కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ముందుకువెళ్లాం. బంగారు తెలంగాణ కోసం మహా యజ్ఞం జరుగుతోంది. తనకు ద్రోహం జరిగిందని వివేక్ అంటున్నడు. టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లి మళ్లీ టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన అతన్ని గౌరవించి సలహాదారుగా తీసుకున్నారు. ఇంతకుమించి ఆయనకు గౌరవం ఏం కావాలి. నువ్వే ఎంపీ అని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా గ్రూపులు తయారు చేశాడు. ఎంపీగా వివేక్‌కు టిక్కెట్ ఇవ్వడం కోసం కేసీఆర్.. ఎంపీగా ఉన్న సుమన్‌కు ఎమ్మెల్యే పదవి ఇచ్చిండు. పార్టీకి ఎవరు అన్యాయం చేసినా సహించేది లేదని వివేక్‌కు టికెట్ ఇవ్వలేదు. ఇవ్వాళ్టి నుంచే మన కార్యాచరణ ప్రారంభం కావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరి గుండె ల్లో గులాబీ జెండా ఉంది. ఇక్కడ ఉన్నది వెంకటేశ్ నేత కాదు.. కేసీఆర్ అనుకుని పనిచేయాలి.

పెద్దపల్లి సీటు టీఆర్‌ఎస్‌దే
- దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్యే, బెల్లంపల్లి
పెద్దపల్లి సీటు కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితిదే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అన్ని కులాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే సంకల్పంతో బోర్లకుంట వెంకటేశ్ నేతకు ముఖ్యమంత్రి టిక్కెట్ ఇచ్చారు. అందరి ఆమోదం మేరకే జరిగిన నిర్ణయం ఇది. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు మేం క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పనిచేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వెంకటేశ్ నేత గెలుపు కోసం కృషి చేస్తాం. కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ కష్టపడి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషిచేయాలి. అప్పుడే విజయం సులభమవుతుంది.

16 గెలిస్తే తెలంగాణ ప్రజలకు మేలు
- గడ్డం అరవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే
టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించనప్పుడు ఈ జెండా ఏ పార్టీది అని అడిగేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి గుండెల్లో ఈ జెండా ఉంది. 16 మంది ఎంపీలను గెలిపించుకుంటే రాష్ర్టానికి తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ముందుకు సాగుతున్నారు. అన్ని పథకాలు పేద ప్రజల సంక్షేమం కోసమే. అందుకే ప్రతి ఒక్కరు కేసీఆర్ వెంటనే నడుస్తున్నారు. పల్లె, పట్నం తేడా లేకుండా టీఆర్‌ఎస్‌కు ఒటేస్తారు. మంచిర్యాలలో వెంకటేశ్ నేతకు లక్ష మెజారిటీ వచ్చేలా కృషి చేస్తాం.

వెంకటేశ్ నేతను ఆశీర్వదించండి
- నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్సీ
వెంకటేశ్ నేత విద్యావంతుడు. ఉద్యమనేత కూడా. ఆయన గెలిస్తే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంతో మేలు జరగుతుంది. గతంలో కేవలం రెండు సీట్లు సాధించాం. అయినా తెలంగాణఱ సాధించాం. మరి 16 సీట్లు వస్తే ఏం చేస్తామో ? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ సంఖ్య ముఖ్యం కాదు. స్ట్రాటజీ ముఖ్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ అందరి మెడలు వంచి తెలంగాణ తెచ్చిండు. అదేస్థాయిలో కేంద్రం నుంచి నిధులు సైతం తీసుకువస్తడు. అందుకే అందరినీ గెలిపించి పార్లమెంట్‌కు పంపాలే.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...