తొలి రోజు రెండు


Tue,March 19, 2019 12:18 AM

-పెద్దపల్లి లోక్‌సభకు మొదలైన నామినేషన్లు
-బీజేపీ నుంచి ఒక్కరు.. ప్రజాబంధు నుంచి ఒక్కరు..
-25వ తేదీ వరకు పత్రాల స్వీకరణ
పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల నగారా మోగింది. సోమవారం ఉదయం 10:30 గంటలకు పెద్దపల్లి లోక్‌సభ ఎన్నికల రిటర్నిం గ్ అధికారి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ వెంటే నామినేషన్ల పర్వం మొదలు కాగా, తొలి రోజున రెండు నామినేషన్లు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఈ నెల 10న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా, రాష్ట్రంలోని 17 స్థానాలకు తొలి విడతలోనే జరుపుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికలకు సంబంధించి సోమవారం నోటిఫికేషన్ విడుదల కాగా, ఈనెల 25వ తేదీ దాకా ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా నామినేషన్లు స్వీకరించనున్నారు. అయి తే నామినేషన్లు స్వీకరణ కేంద్ర ప్రభుత్వ పనిదినాల్లో మాత్రమే ఉంటుందనీ, ఈ నెల 21న హోళీ, 23న నాలుగో శనివారం, ఆ మరునాడు ఆదివారం కావడంతో తీసుకోబోమనీ, అభ్యర్థులు గమనించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూచించారు.

తొలి రోజు రెండు దరఖాస్తులు..
పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి సంబంధించి జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తుండగా, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోనే నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నామినేషన్ల పర్వం మొదలైన తొలిరోజు సోమవారం రెండు నామినేషన్లు వచ్చాయి. బీజేపీ తరపున రామగుండం మండలం గోదావరిఖనికి చెందిన కొయ్యడ స్వామి, ఇండియా ప్రజాబంధు పార్టీ తరపున మంచిర్యాల జిల్లాకు చెందిన తాడెం రాజ్‌ప్రకాశ్ తమ నామినేషన్లు వేశారు. కాగా, ఎన్నికల సంఘం కొత్త నిబంధనల ప్రకారం ఆ ఇద్దరు అభ్యర్థులతో రిటర్నింగ్ అధికారి శ్రీదేవసేన ప్రమాణ స్వీకారం చేయించారు.

ఆ సెగ్మెంట్లలో నాలుగింటి వరకే పోలింగ్..
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని నాలుగు సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని రిటర్నింగ్ అధికారి శ్రీదేవసేన తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పెద్దపల్లి, ధర్మపురి, మంథని, రామగుండం, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి సెగ్మెంట్లు ఉన్నాయి. ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహిస్తుండగా, ఇందులో మావోయిస్టుల ప్రాభల్యం ఉన్న నాలుగు సెగ్మెంట్లు మంథని, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి పరిధిలో సాయంత్రం ఉదయం 7 గంటల నుంచి 4గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. మిగతా చోట్ల యథావిధిగా సాయంత్రం 5గంటల వరకు జరుగుతుందన్నారు.

నామినేషన్ సెంటర్ వద్ద భారీ బందోబస్తు
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బం దోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌ డ్, పెద్దపల్లి ఏసీపీ వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో మూడంచెల భద్రత కల్పించారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద మొదటి అంచె భద్రత, కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాకా వెళ్లేందుకు బారికేడ్లతో రెండంచెల భద్రత కల్పించగా, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లేందుకు మూడో అంచె భద్రత కల్పించారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు నలుగురికి అవకాశం కల్పిస్తున్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...