కలవర పరుస్తున్న దోపిడీలు


Mon,March 18, 2019 12:38 AM

మంచిర్యాలటౌన్, నమస్తే తెలంగాణ: మంచిర్యాల సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న దోపిడీ దొంగతనాలు ప్రజలను కలవరపరుస్తున్నాయి. ఇండ్లలోకి ముఠాలు నేరుగా చొరబడి మారణాయుధాలతో బెదిరిస్తూ , ఇంట్లో ఉన్న నగలు, నగదును దోచుకువెళ్తున్న సంఘటనలు గడిచిన 15 రోజుల వ్యవధిలో రెండు జరిగాయి. ఫిబ్రవరి 21న లక్షెట్టిపేట మండలం అంకతిపల్లిలో ముగ్గు రు దొంగలు ముసుగులు ధరించి అరిగెల చందు అనే వ్యక్తి ఇంట్లోకిదూరి కుటుంబ సభ్యులందరినీ మారణాయుధాలతో బెదిరించారు. వారిని గదిలో బంధించి ఇంట్లో ఉన్న మూడు తులాల బంగారంతో పాటు రూ. వెయ్యి నగదు, మోటార్ బైక్ ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలాన్ని మంచిర్యాల ఏసీపీ గౌస్‌బాబాతో పాటు లక్షెట్టిపేట సీఐ శ్రీనివాస్ పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్ స్కాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. తాజాగా ఈ నెల 5న మంచిర్యాల పట్టణం నడిబొడ్డున ఉన్న డీఎఫ్‌ఓ కార్యాలయం పక్కన గోవింద్ ప్రసాద్ మానియా భార్య సీతాదేవితో సీతాదేవి ఒక్కరే ఇంట్లో ఉన్నారు.

ఉదయం 11.30 గంటల సమయంలో మూతికి గుడ్డ కట్టుకుని ఉన్న ఆగంతకుడు ఇంటి ముందు భాగంలో గడియ పెట్టి వెనక భాగం నుంచి ఇంట్లోకి దూకి, సీతాదేవిని కత్తితో పొడుస్తానంటూ బెదిరించి, ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకుంటే కత్తితో పొడిచి చంపుతానని బెదిరించడంతో దిక్కుతోచని పరిస్థితిలో సీతాదేవి తన ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, రెండు ఉంగరాలు తీసి దొంగకు అప్పజెప్పింది. అవి తీసుకున్న తరువాత ఆగంతకుడు వెనక ఉన్న తలుపులు వేసి బయటకు వెళ్లి పోయాడు. విషయం తెలియగానే భర్త గోవింద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీసీపీ రక్షిత కే మూర్తి సంఘటన స్థలానికి వెళ్లి ఇంటిని పరిశీలించారు. ఇలా ఒకే తరహాకు చెందిన రెండు సంఘటనలు ఇటీవలి కాలంలో జరుగడంతో ఇతర రాష్ర్టాలకు చెందిన దోపిడీ దొంగల ముఠాలు ఏమైనా ఈ ప్రాంతానికి వచ్చాయా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ కేసుల్లో లోతైన దర్యాప్తు జరిపి దొంగతనాలకు పాల్పడే వ్యక్తులను అరెస్టుచేసి శిక్షపడేలా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...