కాంగ్రెస్ కోటకు బీటలు


Mon,March 18, 2019 12:36 AM

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఈ నియోజకవర్గానికి 14 సార్లు ఎన్నికలు జరగగా.. తొమ్మిది సార్లు కాంగ్రెస్ పార్టీనే విజయబావుటా ఎగురవేసింది. టీడీపీ మూడు సార్లు, తెలంగాణ ప్రజా సమితి ఒక మారు, టీఆర్‌ఎస్ పార్టీ ఒక సారి గెలుపొందాయి. ఈ లోక్‌సభ స్థానం 1962లో ఏర్పడింది. రెండు మార్లు ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎంఆర్ కృష్ణ గెలుపొందారు. 1971లో వీ.తులసీరామ్ తెలంగాణ ప్రజా సమితి నుంచి, ఆ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

ఇక 1980లో కోదాటి రాజమల్లు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 1984లో జరిగిన ఎన్నికల్లో జీ.భూపతి టీడీపీ నుంచి 1989, 1991, 1996లో జరిగిన ఎన్నికల్లో వరుసగా జీ.వెంకటస్వామి విజయం సాధించారు. ఆ తర్వాత 1998లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెలిమల సుగుణకుమారి చేతిలో ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో ఆమె చేతిలోనే కాకా ఓడిపోయారు. ఆ తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటస్వామి విజయం సాధించారు. 2009లో ఆయన తనయుడు వివేక్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి, విద్యార్థి ఉద్యమ నేత బాల్క సుమన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.

ఎన్నో రికార్డులు నియోజకవర్గం సొంతం
పెద్దపల్లి లోక్‌సభ స్థానం రికార్డులను తన అమ్ము ల పొదిలో దాచుకుంది. ఇందిరాగాంధీకి సన్నిహితుడు, కాంగ్రెస్ కురువృద్ధుడు దివంగత వెంకటస్వామి(కాకా) ఇక్కడి నుంచే వరుసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ వీరుడిగా నిలిచాడు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి ఆయన నాలుగుసార్లు ఎంపీ పీఠాన్ని అధిరోహించిన ఏకైక వ్యక్తి. కేంద్ర మంత్రిగా, ఏఐసీసీ స్థాయిలో కూడా పని చేశారు. కాకా కొడుకు వివేక్ కూడా ఈ నియోజకవర్గం నుంచి ఒకసారి ఎంపీగా గెలుపొందారు. ఇన్ని రికార్డులు సొంతం చేసుకున్న వెంకటస్వామి రెండుసార్లు టీడీపీ అభ్యర్థి చెలిమిల సుగుణకుమారి చేతి లో 1998 ఉప ఎన్నికల్లో, 1999 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ గెలుపుతో ఉత్తర తెలంగాణలోనే తొలి పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డు సృష్టించారు. ఇక ఉద్యమ నేత బాల్క సుమన్ 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి రికార్డు స్థాయిలో విజయం సాధించారు.

ఇంటి పార్టీ వెంటే ప్రజలు
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఇంటి పార్టీ వెంటనే ప్రజలు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చిత్తుగా ఓడించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బాల్క సుమన్‌కు 4,65,496 ఓట్లు అంటే 45.53 శాతం మంది టీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వివేక్‌కు కేవలం 1,74,338 ఓట్లు అంటే 17.55 శాతం మాత్రమే రావడం గమనార్హం. మిగతా అభ్యర్థులు అంతా డిపాజిట్లు కోల్పోయారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేత డాక్టర్ జానపాటి శరత్‌బాబుకు కేవలం 63,334 ఓట్లు (6.2శాతం) ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇలా తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలు పెద్ద ఎత్తున అండగా నిలబడటంతో బాల్క సుమన్ అఖండ మెజారిటీ విజయం సాధించారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన పార్టీ వైపే ఉంటామని ఆ ఎన్నికల ద్వారా జనం స్పష్టం చేశా రు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో తాము కారు వైపే ఉంటామని చెబుతున్నారు. తెలంగాణ ఉద్య మ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనుల వల్ల తమకు ఎంతో మేలు కలుగుతోందని సబ్బండ వర్ణాల ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం నల్లేరు మీద నడకలా మారనుంది.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...