ఆకాంక్షలు నెరవేరుస్తా..


Thu,February 21, 2019 03:13 AM

- ప్రజల కోరిక మేరకు నిరంతరం పనిచేస్తా..
- ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తా..
- రెండోసారి మంత్రిగా మరింత బాధ్యత పెరిగింది
- కలప స్మగ్లర్లు, వేటగాళ్లపై ఉక్కుపాదం మోపుతాం..
- అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక
- దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తాం..
- బాసర ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు
- నమస్తే ముఖాముఖిలో మంత్రి అల్లోల

నమస్తే : ప్రస్తుత శాఖలపై మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది?
అల్లోల : గతంలో గృహ నిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రిగా నాలుగేండ్లు పని చేశా. మూడు శాఖల్లో ఉత్తమ పనితీరు కనబరిచా. గోదావరి, కృష్ణా పుష్కరాలు, సమ్మక్క-సారలమ్మ జాతరల నిర్వహణ సక్సెస్ చేశాం. సీఎం కేసీఆర్ నేతృత్వంలో యాదాద్రితోపాటు ప్రముఖ దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నాం. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి పేదింటి కలను నెరవేర్చే ప్రయత్నం చేశాం. న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే హైకోర్టు విభజన జరగడం ఆనందంగా ఉంది. తాజాగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖలు ఇవ్వడంతో బాధ్యత పెరిగింది. వీటిని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తా.

నమస్తే : ఉమ్మడి జిల్లాను ఎలా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారు?
అల్లోల : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారంలో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు పర్యటించారు. స్థానిక పరిస్థితులను బట్టి హామీలిచ్చారు. వాటిని నెరవేర్చేందుకు కృషి చేస్తా. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజల సహకారం తీసుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. సమస్యల పరిష్కారంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతా. మరో వారం, పది రోజుల్లో ఎమ్మెల్యేలు అధికారులతో సమావేశమై ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై ప్రణాళిక రూపొందించి అమలు చేస్తా. ఇప్పటికే ప్రగతిలో ఉన్న పనులను పూర్తి చేస్తాం.

నమస్తే : అడవులు కాపాడేందుకు మీ చర్యలు ఏమిటీ?
అల్లోల : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు వెంటనే కార్యాచరణ రూపొందిస్తాం. జిల్లాలో మొక్కలను భారీ సంఖ్యలో పెంచేందుకు చర్యలు చేపడుతాం. జిల్లా, రాష్ట్రంలో 33 శాతం అడవులు పెంచేందుకు కృషి చేస్తాం. అటవీ చట్టాలను కఠినతరం చేస్తాం. చెట్లు నరకకుండా, పెంచేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. జిల్లాలో అటవీ సంరక్షణ, అడవుల విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తాం.

నమస్తే : స్మగ్లర్లు, వేటగాళ్లపై ఏం చర్యలు తీసుకుంటారు?
అల్లోల : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు. కలప స్మగ్లర్లపై పీడీ యాక్టులు నమోదు చేస్తాం. సామిళ్లుల్లో అక్రమాల నియంత్రణకు సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాం. గతంలో ఉన్న చెక్‌పోస్టులతోపాటు కొత్తగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ సీసీ కెమెరాలతోపాటు సాయుధ బలగాలు ఏర్పాటు చేశాం. వారం రోజుల్లో అటవీశాఖ అధికారులతో సమావేశమై అడవుల పరిరక్షణ, అక్రమ రవాణా, మొక్కల పెంపకం జాగ్రత్తలపై చర్చించి కార్యాచరణ రూపొందిస్తాం.

నమస్తే : హరితహారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు?
అల్లోల : రాష్ట్రంలో హరితహార కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేస్తాం. మొక్కల పెంపకంతోపాటు వాటి సంరక్షణ కోసం గ్రామ కార్యదర్శి, సర్పంచ్ సమష్టిగా బాధ్యతలు తీసుకునేలా చూస్తాం. వన సేవకులను ఏర్పాటు చేస్తాం. ప్రతి ఇంటి వారు ఆరు మొక్కలు కాపాడేలా చర్యలు తీసుకునేట్లు చూస్తాం.

నమస్తే : దేవాలయాల అభివృద్ధిపై ఎలాంటి దృష్టి పెడుతారు?
అల్లోల : గతంలో దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాతోపాటు రాష్ట్రంలోని దేవాలయాల మరమ్మతులు, పునరుద్ధరణ పనులు పెద్ద ఎత్తున చేపట్టాం. యాదాద్రితోపాటు ప్రముఖ దేవాలయాల అభివృద్ధి చేపట్టాం. బాసర దేవాలయ అభివృద్ధి కోసం రూ.50 కోట్లు మంజూరు చేయించాం. ఇప్పటికే మాస్టర్‌ప్లాన్ సిద్ధమైంది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. బాసరలో గతంలో వసంత పంచమికి 50 వేల మంది వస్తేనే ఇబ్బంది ఉండేది. ఇటీవల 1.50 లక్షల మంది భక్తులు వచ్చిన దర్శనం, అక్షరాభ్యాసం చేయించేలా ఏర్పాట్లు చేశాం. రానున్న రోజుల్లో బాసరతోపాటు జిల్లాలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం.

నమస్తే : నాలుగేండ్లు మంత్రిగా సంతృప్తికర పనితీరు కనబరిచారా?
అల్లోల : సీఎం కేసీఆర్ తొలి కేబినెట్‌లో మంత్రిగా అవకాశం దక్కడం అదృష్టంగా భావించా. కేసీఆర్ ఆశయాలు, ప్రజల ఆకాంక్ష మేరకు నాలుగేండ్లపాటు మంత్రిగా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం కృషి చేశా. అందుకే గత ఎన్నికల్లో మా పార్టీకి 88 స్థానాల్లో విజయం దక్కింది. ఉమ్మడి జిల్లాలోనూ పది స్థానాలకు 9 స్థానాల్లో విజయం సాధించాం. నిర్మల్ ప్రజలు నాకు అపూర్వమైన విజయాన్ని అందించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాం. మేనిఫెస్టోలో లేని వాటిని కూడా అమలు చేశాం. ప్రజలకు ఏమి అవసరమో అందుకనుగుణంగా పని చేశాం.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...