భద్రతే ప్రధానం..


Thu,February 14, 2019 02:04 AM

-విజయవంతంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు
- నేటితో ముగింపు
మంచిర్యాల స్పోర్ట్స్ : జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించగా, తెలంగాణ ప్రభుత్వం మరో నాలుగు రోజులు అదనంగా కొనసాగించింది. భద్రతే ప్రధానంగా ప్రజలకు అవగాహన కల్పించింది. నేటితో వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు ముగియనున్నాయి. ఫిబ్రవరి 14ను యాక్సిడెంట్స్ ఫ్రీ డే గా చేయాలని, ఇందులో భాగంగానే అన్ని జిల్లాల కలెక్టర్లకు, పోలీస్ కమిషనర్లకు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో రోడ్డు భద్రత వారోత్సవాలు పండుగలా సాగాయి. ఈ నెల 4న ప్రారంభమైన వారోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల షెడ్యూల్ ప్రకారం మంచిర్యాల జిల్లా రవాణాశాఖధికారి కిష్టయ్య ఆధ్వర్యంలో సీనియర్ ఎంవీఐ వివేకానందరెడ్డి, ఏఎంవీఐలు శ్రీనివాస్,ప్రత్యూష ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

రోజుకో కార్యక్రమం..
జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను కలెక్టర్ భారతి హోళికేరి ప్రారంభించారు. ఈ సందర్భంగా రవాణాశాఖ అధికారులు తయారు చేయించిన రోడ్డు భద్రత అవగాహన ప్రత్యేక వాహనం, హెల్మెట్ ర్యాలీలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎఫ్‌సీపీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కరపత్రాలు,బ్యానర్లు విడుదల చేశారు. ఇదే రోజున సీనియర్ ఎంవీఐ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి కళాకారులతో యముడు,చిత్రగుప్తుడు వేషధారణతో రోడ్డుపై హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి, సీటు బెల్టు లేకుండా కార్లు డ్రైవింగ్ చేసే వారికి ,త్రిబుల్ రైడింగ్ చేసే వాళ్లకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించిన వారికి గులాబీలు అందించి అభినందనలు తెలిపారు. 5న ఓవర్ స్పీడ్, డ్రంకెన్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 6న గూడ్స్ తరలించే వాహనాల్లో ఓవర్ లోడ్, ప్రయాణికులను తరలించే వాహనాల్లో పరిమితికి మించి తరలించే వాహనాల ప్రత్యేక తనిఖీలు, 7న వాహనాలను నిబంధనలను అనుసరించి రిఫ్లెక్టెడ్ సిక్టర్స్ అతికించడం, సురక్షితంగా ప్రయాణించడంపై డ్రైవర్లకు అవగాహన, ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన, 8న విద్యార్థులకు, వాహనదారులకు, డ్రైవర్లకు రవాణా శాఖ కార్యాలయంలో జిల్లా జడ్జిలతో అవగాహన, 9న డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిపై, ఫిట్‌నెస్ లేకుండా డ్రైవింగ్ చేసే వాహనదారులపై ప్రత్యేక డ్రైవ్ చేసి కేసులు నమోదు చేశారు. 10న వాహనాలు నడిపించాలంటే కావాల్సిన లైసెన్స్, బీమా, ఫిట్‌నెస్ తదితర వాటిపై అవగాహన ప్రత్యేక తనిఖీలు, 11న మంచిర్యాల ఏఫ్‌సీఏ ఫంక్షన్ హాల్‌లో రక్తదాన శిబిరం, 12న విద్యార్థులతో ర్యాలీ 13న డీటివో కార్యాలయంలో డ్రైవింగ్ టెస్టుకు వచ్చే వారికి, వాహనాల ఫిట్‌నెస్ కోసం వచ్చే వారికి రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

నేడు యాక్సిడెంట్స్ ఫ్రీ డే..
నేడు రోడ్డు భద్రతా వారోత్సవాలు ముగియనున్నాయి. గురువారం రాష్ట్రంలో ఎక్కడ కూడా యాక్సిడెంట్స్ జరుగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకొని, ప్రత్యేక తనిఖీలు చేయాలని జిల్లా కలెక్టర్లకు, కమిషనర్ ఆఫ్ పోలీస్‌లకు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు భద్రత ప్రాముఖ్యను తెలియజేస్తూ మంచిర్యాల పట్టణంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి కిష్టయ్య తెలిపారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...