పల్లెగూటికి పండుగ


Sun,January 13, 2019 02:01 AM

నిర్మల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : బతుకమ్మ, దసరా తర్వాత బాగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఇది మూడు రోజుల వేడుక. సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే ముందు రోజు వచ్చేదే భోగి. మరుసటి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు గనుక, ఈ శుభదినం మకర సంక్రాంతి. ఆ తర్వాత కనుము. మంగళవారం సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఉపాధి కోసం పట్టణాలు, నగరాల్లో ఉండే వారంతా, ఇప్పుడు పల్లె బాట పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు శుక్రవారం నుంచే సెలవులు ప్రకటించగా, పిల్లాపాపలతో ఇళ్లకు చేరుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడం, సోమవారం భోగి, మంగళవారం సంక్రాంతి కావడంతో ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు కూడా శనివారం సాయంత్రం నుంచే పయనమయ్యారు. ఆర్టీసీ బస్ శుక్రవారం ఉదయం నుంచే రద్దీగా మారాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని బస్టాండ్లన్నీ కిక్కిరిసి కనిపించాయి. పల్లెకు వెళ్లే ఏ రోడ్డు చూసినా ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలతో బిజీగా ఉంటున్నాయి. నిన్నామొన్నటి దాకా బోసిపోయి కనిపించిన గ్రామాలన్నీ శుక్రవారం నుంచే కళకళలాడుతున్నాయి. దూరం నుంచి వచ్చిన కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు వారి పిల్లలతో సందడిగా మారాయి. వారిని చూసిన తల్లిదండ్రుల్లో కొత్త నవ్వులు విరబూస్తున్నాయి. ఏ ఇంట చూసినా పిండి వంటల ఘుమఘుమలు ఇస్తున్నాయి. నాలుగైదు రోజుల ముందు నుంచే సకినాలు, గారెలు, అరిసెలు, మురుకులు, కారప్పూస చేస్తున్నారు. ఎక్కడెక్కిడి నుంచో వచ్చిన తమ పిల్లలకు రుచి చూపిస్తున్నారు.

పల్లెపల్లెనా సందళ్లు..
ఎక్కడెక్కడి నుంచో చేరిన పిల్లాపాపలు, చుట్టాలతో పల్లెల్లో సందడి కనిపిస్తున్నది. ప్రతి ఇంటా ఉత్సాహం వెల్లివిరిస్తున్నది. ప్రతి వాకిలీ ఓ పూదోటను తలపిస్తుంది. పట్టణాల నుంచి చేరిన ఆడబిడ్డలు, తమ ఇళ్ల ముందు రంగు రంగుల రంగవల్లులు వేసేందుకు పోటీ పడుతున్నారు. ఉదయాన్నే లేచి ముత్యాల్లాంటి ముగ్గులతో నింపేస్తున్నారు. కొందరైతే యూట్యూబ్ చూస్తూ.. మరికొందరూ మార్కెట్లో దొరికే ముగ్గుల డిజైన్ల బుక్కులు తెచ్చుకొని మరీ ఓపికతో రంగవల్లులు వేస్తున్నారు. ఇటు పిల్లలు, పెద్దలు రంగురంగుల కైట్స్ పట్టుకొని వీధులకు చేరుతున్నారు. ఖాళీ ప్రదేశాలతోపాటు బిల్డింగ్ చేరి పతంగులు ఏగరేస్తున్నారు. సందడి చేస్తున్నారు. మరోవైపు గంగిరెద్దుల వాళ్లు ఊళ్లకు చేరి, బసవన్నలతో ప్రదర్శనలు ఇస్తున్నారు. నాలుగైదు రోజుల ముందు నుంచే ఇల్లిళ్లూ తిరుగతూ, భిక్ష స్వీకరిస్తున్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...