కారు జోరు


Wed,September 12, 2018 01:10 AM

-ప్రచారంలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ముందడుగు
-ఇంటింటా ప్రచారం.. సమావేశాలతో బిజీ బిజీ..
-సంక్షేమ పథకాలతో పల్లెల్లోకి గులాబీ అభ్యర్థులు
-టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఊరూ వాడా నీరాజనం
-తేలని పొత్తులతో కాంగ్రెస్ నాయకుల బేజారు
-క్షేత్రస్థాయిలో టీడీపీ-కాంగ్రెస్ సమన్వయం కష్టమే..
నిర్మల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కారు జోరు మీదుంది. గులాబీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. విపక్షాలకు అందనంత దూరంలో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పల్లెల్లోకి వెళ్తుండగా.. ఇప్పటికే పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కుల, యువజన సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తుండగా.. ఇంటింటా ప్రచారంతో ముందడుగు వేశారు.. గులాబీ పార్టీ అభ్యర్థులకు ఊరూవాడా నీరాజనం పలు కుతున్నారు. విపక్ష పార్టీల మధ్య పొత్తుల పంచా యతీ నడుస్తుండగా.. తేలని పొత్తులతో కాంగ్రె స్ నాయకులు బేజారవుతున్నారు. ఇప్పటికీ అభ్యర్థులెవరో తేలకపోగా.. గ్రూపు తగాదాలతో క్యాడర్‌లో గందరగోళం నెలకొంది.. క్షేత్రస్థాయిలో టీడీపీ-కాంగ్రెస్ పొత్తుపై క్యాడర్‌లో సమన్వయం కష్టంగా మారింది.

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా.. తొమ్మిది నియోజకవర్గాల్లో సిట్టింగులకే టికెట్లు దక్కాయి. చెన్నూర్ నియోజకవర్గం మినహా.. మిగతా అన్ని నియోజకవర్గాల్లో పాత కాపులకే టికెట్లు వచ్చాయి. చెన్నూర్‌లో మాత్రం ఎంపీ బాల్క సుమన్ పోటీ చేయనున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు పార్టీ, ప్రభుత్వ పరంగా సముచిత స్థానం కల్పిస్తామని.. రెండు, మూడు రోజుల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పార్టీ ముఖ్యుల వద్దకు తీసుకెళ్లనున్నారు. పది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే మండలాలు, నియోజకవర్గాలవారీగా సమావేశాలు నిర్వహిస్తుండగా.. ప్రభుత్వ పథకాలతో పల్లెల్లోకి వెళ్తున్నారు. లబ్ధిదారుల కుటుంబాలతో స్వయంగా మాట్లాడుతున్నారు. కుల, యువజన సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఊరూ వాడా తేడా లేకుండా కలియతిరుగుతున్నారు. గులాబీ పార్టీ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పలుకుతున్నారు.

నియోజకవర్గాల్లో మంత్రులు, తాజా మాజీ ఎమ్మెల్యేల మకాం..
మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో మకాం వేశారు. ఈనెల 7న అభ్యర్థులను ప్రకటించగా.. 8న తమ సొంత నియోజకవర్గాలకు చేరుకున్నారు. వీరికి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. విపక్షాల ఊహకు కూడా అందని విధంగా టీఆర్‌ఎస్ పార్టీ 83 మంది సిట్టింగ్‌లనే అభ్యర్థులను ప్రకటించింది. మండలాలు, గ్రామాలవారీగా షెడ్యూల్ ఖరారు చేసుకుని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. వివిధ పథకాల ద్వారా వ్యక్తిగతంగా జరిగిన లబ్ధి పొందిన వారి జాబితాను సిద్ధంగా ఉంచుకున్నారు. గ్రామాలవారీగా ప్రచారానికి వెళ్లినప్పుడు సంబంధిత మండలం, గ్రామంతోపాటు వ్యక్తిగతంగా జరిగిన లబ్ధిని వివరిస్తున్నారు. నేరుగా వెళ్లి మండల, గ్రామస్థాయి నాయకులను కలుస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులు పలు గ్రామాల్లో పర్యటించి ప్రచారంలో ముందు వరుసలో ఉన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని పెద్దంపేట, రాంపూర్, పడ్తన్‌పల్లి గ్రామాల్లో మంచిర్యాల టీఆర్‌ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ వీధిలో మంగళవారం టీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ శాసన సభ్యురాలు అజ్మీరా రేఖానాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలనీలో ఉన్న బీసీ కులాల మహిళలను ఇంటింటికి వెళ్లి కలిసారు. మహిళల మద్దతు ఇవ్వాలని కోరారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప ప్రచారంలో భాగంగా మంగళవారం కాగజ్‌నగర్ మండలం ఈజ్‌గాం శివమల్లన్న ఆలయంలో మండల స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నిరంతరం ప్రజా సేవకే అంకితమవుతాననీ, టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. చింతలమానేపల్లి మండల కేంద్రంలోని చిలకలభీమన్న ఆలయం వద్ద మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి, టీఆర్‌ఎస్ గెలుపుకోసం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా 100 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు.

గ్రూపులతో హస్తవ్యస్తం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కల్లోలం నెలకొంది. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా మారింది హస్తం పార్టీ. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలుండగా.. ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా.. అన్ని చోట్ల వర్గపోరు నెలకొంది. ప్రతి నియోజకవర్గంలో ఎవరికి వారే తమకు టికెట్ వస్తుందంటే.. తమకు వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్ కోసం రాష్ట్ర, ఢిల్లీ స్థాయిలోని ముఖ్య నాయకులతో ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారం కోల్పోయి నాలుగున్నరేళ్లు గడిచినా.. ఇంకా సమన్వయం కుదరలేదు. నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరికి వారు.. గ్రూపులుగా విడిపోయారు. ఆదిలాబాద్, ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల్లో మూడు గ్రూపులు, ముథోల్, సిర్పూర్(టి), చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో రెండు గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ విడిపోయింది. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, ఇప్పటికే ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా నాయకులు ఉండటంతో క్యాడర్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒకరికి టికెట్టు వస్తే మరొక వర్గం పని చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటివరకు పొత్తుల పంచాయతీలు తేలలేదు. పొత్తుల్లో భాగంగా ఎవరికి ఏ స్థానాలు కేటాయిస్తారనేది గందరగోళంగా మారింది. అభ్యర్థులు ఎవరనేది తేలకపోగా.. అంతా అయోమయంలో ఉన్నారు. ఇక క్షేత్రస్థాయిలో కాంగ్రెస్-టీడీపీ క్యాడర్ సమన్వయంతో పని చేయటం అసాధ్యంగానే ఉంది. ఈ పొత్తులతో తమకు పెద్దగా లాభం లేదని కాంగ్రెస్.. తమకు టికెట్లు రావని టీడీపీ నాయకులు పెదవి విరుస్తున్నారు. తెలంగాణ వ్యతిరేక పార్టీ టీడీపీతో జత కడితే ప్రజల్లోకి ఎలా వెళ్తామంటూ కాంగ్రెస్ నాయకులే పేర్కొంటున్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...