పెట్రో భగభగలు


Tue,September 11, 2018 12:48 AM

మంచిర్యాలటౌన్, నమస్తే తెలంగాణ : పెట్రో ధరలు మండిపోతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆరునెలల కాలంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. దీంతో వాహనదారులపై పెను ఆర్థికభారం పడుతోంది. తప్పనిసరైన పరిస్థితుల్లో మాత్రమే వాహనాలను బయటకు తీసే పరిస్థితి నెలకొంది. సోమవారం మంచిర్యాలలో లీటరు పెట్రోలు ధర రూ. 86.34 లు ఉండగా, లీటరు డీజిల్ ధర రూ. 79.90 లు ఉంది. గడిచిన 25 రోజుల కాలంలో పెట్రోలుపై రూ. 4.15లు పెరుగగా, డీజిల్‌పై రూ. 4.52లు పెరిగింది. డాలర్ మారకం విలువ రూ.71.12కు చేరుకున్న నేపధ్యంలో ఆదివారం రోజున గతంలో ఎన్నడూ లేనంతగా గరిష్ట స్థాయికి పెట్రోలు,డీజిల్ ధరలు పెరిగాయి. రూపాయి మారకం విలువ పెరుగడంతో పాటు ముడి చమురు ధర కూడా భారీగా పెరగడం కూడా ఇందుకు కారణాలుగా కనిస్తున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 42 పెట్రోలు బంకులు ఉన్నాయి. వీటిలో ఆయా ఆయిల్ కంపెనీలకు చెందిన బంకులు ఉన్నాయి. నెలలో దాదాపుగా జల్లా మొత్తంమీద 1000 కిలోలీటర్ల పెట్రోల్, 2500 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి. గతంలో పెట్రోలు, డీజిల్ ధరలపై నెలరోజులకోసారి సమీక్ష నిర్వహించేవారు. ధరల పెంపు, తగ్గింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఎక్కువగానే ఉండేది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోలు, డీజిల్ ధరల పెంపు బాధ్యతలను చమురు కంపెనీలకే అప్పగించారు. దీంతో క్రూడాయిల్, బ్యారెల్, ముడి చమురు ధరలుపెరుగుతున్నాయని రోజురోజుకూ అర్థరాత్రి పెట్రోలు, డీజిల్ ధరలను పెంచేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రో ధరలు తగ్గుతాయనీ, జీఎస్టీతో దాదాపుగా రూ. 50కే లీటరు పెట్రోలు లభిస్తుందని ప్రజలు ఆశగా ఎదురు చూశారు. కానీ అనుకోని రీతిలో వీటి ధరలు పెరుగుతుండడం, కేంద్రం ఏమాత్రం పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం పట్ల సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...