టీఆర్‌ఎస్ దూకుడు


Sun,September 9, 2018 02:04 AM

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ :రెండు రోజుల క్రితం కేసీఆర్ మంత్రి వర్గ సమావేశం నిర్వహించడం, ఏకవ్యాఖ్య తీర్మాణం చేయ డం, ప్రతిని గవర్నర్ నరసింహన్‌కు అందించడం, ప్రభుత్వం రద్దు కావడం చకచకా సాగిపోయాయి. ఆ వెంటనే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. ఇందులో దాదాపు సిట్టింగ్‌లకే అవకాశం ఇవ్వడం సంతోషకరమైన విషయం. అభ్యర్థుల ప్రకటనలతో జిల్లాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. టపాసులు కాల్చి. మిఠాయిలు తినిపించుకుని టీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు సం బరాలు జరుపుకున్నారు. వెంటనే మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గ అభ్యర్థులు కేంద్రాలకు చే రుకున్నారు. వీరికి అభిమానులు, కార్యకర్తలు సాద ర స్వాగతం పలికారు. ఇక శనివారం అభ్యర్థులు ప్రచార పర్వంలోకి దూకారు. వీరికి మద్దతుగా టీబీజీకేఎస్ నాయకులు, ద్వితీయ శ్రేణి నేతలు ఇంటింటికి తిరుగుతూ టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని, మళ్లీ కేసీఆర్‌కే పట్టం కట్టాలని అభ్యర్థిస్తున్నారు.

రంగంలోకి గులాబీ శ్రేణులు
ముఖ్యమంత్రి సమరశంఖం పూరించిన నేపథ్యంలో ఇప్పటికే టీఆర్‌ఎస్ శ్రేణులు రంగంలోకి దిగాయి. ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ చేసిన పథకాలు, పనులను ప్రచారం చేస్తున్నా రు. ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధి ఫొటోలతో సహా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే కొన్నిచోట్ల ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. అదేవిధంగా సభ లు, సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ప్రజల వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుని విజయానికి ఏం చేయాలనే విషయంలో ముందుకు సాగుతున్నారు. ఇతర పార్టీలు అభ్యర్థులను ప్రకటించేలోపునే ఒక రౌండ్ ప్రచారం పూర్తి చేయాలని టీఆర్‌ఎస్ నేతలు ప్రణాళికలు ముందుకు సాగుతున్నారు. శుక్రవారం జిల్లాకు చేరుకున్న అభ్యర్థులు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యకు టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. వేలాది మంది కార్యకర్తలు వారికి మద్దతుగా బైక్ ర్యాలీలు నిర్వహించారు.

ప్రచారంలోకి అభ్యర్థులు
మంచిర్యాలలో ఎంఎల్‌ఏ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు ప్రచారం ప్రారంభించారు. ప్రజా ఆశీర్వాదయాత్ర పేరిట మంచిర్యాల పట్టణంతోపాటు దండేపల్లి, సీసీసీ నస్పూర్‌లలో ప్రజలు, కార్యకర్తలను కలుస్తూ ముందుకు సాగారు. నాలుగున్నరేళ్లపాటు నీతి, నిజాయితీతో కూడిన పాలన అందించాననీ, మరోసారి తనకు అవకాశమివ్వాలని కోరుతూ ముందుకు సాగరు. శనివారం ఐబీ నుంచి ఏసీసీ వరకు ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా దారి పొడవునా ఉన్న దుకాణాలు, ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాల్లో ప్రచారం చేశారు. దండేపల్లి మండలంలోని రఘుగూడ, మామిడిపెల్లి, సామగూడ, నర్సాపూర్ గ్రా మాల్లో కూడా పర్యటించారు. ఆయనకు మహిళలు బొట్టు పెట్టి ఆశీర్వదించారు. మా మద్దతు మీకే ఉంటుందని తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మరోసారి రంగలోకి వచ్చినందుకు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను క్రైస్తవులు సన్మానించారు. శనివారం బెల్లంపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చి పాస్టర్స్ అసోసియేషన్ తరుఫున క్రైస్తవ పాస్టర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు మరోసారి అశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని, కేసిఅర్ నాయకత్వాన్ని బలపరచాలని టీఆర్‌ఎస్ అభ్యర్థి అజ్మీర రేఖానాయక్ అభ్యర్థించారు.

శనివారం టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్తిగా ప్రకటించిన తరువాత మొదటిసారిగా జన్నారం మండలానికి వచ్చిన ఆమెకు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులకు కార్మికులు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించుకోవాలని గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ కోరారు. శనివారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6గనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కార్మికులకు పూర్తి న్యాయం చేసే సత్తా కేసీఆర్‌కే ఉందని పేర్కొన్నారు.

పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ రెండు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసి నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. శుక్రవారం కొందరు నేతలతో మంతనాలు జరిపిన ఆయన శనివారం మందమర్రికి చెందిన బండి సదానందం యాదవ్‌తో కలసి చర్చలు జరిపారు. రెండు మూడు రోజుల్లో జిల్లాకు చేరుకొని చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. చెన్నూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సుమన్‌ను ప్రకటించిన నేపథ్యంలో జిల్లాకు వస్తున్న సుమన్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధం అవుతున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుండటంతో ప్రతిపక్షాలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...