అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు


Thu,December 5, 2019 02:45 AM

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : ఉపాధి హామీ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని డీఆర్డీవో పీడీ క్రాంతి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌ రెవెన్యూ సమావేశ మందిరంలో బాలానగర్‌ మండలానికి సంబంధించిన ఉపాధి హామీ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా హరితహారం, నర్సరీల ఏర్పాటుపై సిబ్బంది చెప్పిన సమాధానాలకు, రికార్డులకు పొంతన లేకపోవడంతో వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారంలో ఖచ్చితంగా ప్రతి గ్రామానికి ఒక నర్సరీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ప్రతి పంచాయతీ నర్సరీలో 40వేల మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే, ఉపాధి పనుల ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటికలను నిర్మించాలన్నారు. కూలీలకు చెల్లించాల్సిన బిల్లులను పెండింగ్‌లో ఉంచవద్దని, ఎప్పటికప్పుడు చెల్లించాలని ఆదేశించారు. సమావేశంలో ఏపీవో రాజశేఖర్‌, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉన్నారు.


పనుల్లో అలసత్వం వద్దు
గండీడ్‌ : గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ, ఇంకుడు గుంతలు, శ్మశానవాటిక, నర్సరీల నిర్వహణపై అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని జిల్లా ప్రత్యేకాధికారి, డీఆర్డీవో పీడీ క్రాంతి అన్నారు. గండీడ్‌ మండలంలోని మహ్మదాబాద్‌, నంచర్ల, మన్సూర్‌పల్లి తండాలలో చేపట్టిన పనులను పరిశీలించారు. అనంతరం మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మొక్కల సంరక్షణకు కేటాయించిన సిబ్బందికి డబ్బులు ఎందుకు రాలేదని ఉపాధి హామీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సరీల్లో మొక్కలు ఎన్ని నాటారు, వచ్చే సంవత్సరంలో ఎన్ని మొక్కలు పెట్టేందుకు ఎన్ని సిద్ధం చేశారని పంచాయతీ కార్యదర్శులను, ఫీల్డ్‌ అసిస్టెంట్లను అడిగి తెలుసుకున్నారు. పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమ ఉద్యోగాలను వదులుకోవాలని, మీ పనులు చేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మండలంలో చేపట్టిన రూర్బన్‌ పథకంలో డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటికలకు సంబంధించి స్థల సమస్యను త్వరగా వాటిని పరిష్కరించి పనులు ప్రారంభించాలని తెలిపారు. కొన్ని గ్రామాల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం ప్రారంభమయ్యాయని, మిగితా వాటిని త్వరగా ప్రారంభించాలని తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్‌, ఏపీడీ సరళ, తాసిల్దార్‌ జ్యో తి, ఎంపీడీవో సీతారావమ్మ తదితరులు ఉన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...