నేడే ఆఖరు


Wed,October 16, 2019 02:32 AM

నాగర్‌కర్నూల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నాగర్‌కర్నూల్ జిల్లాలో నూతన మద్యం టెండర్ల దాఖలు గడువు బుధవారంతో ముగియనుంది. ఈనెల 9వ తేదీన జిల్లాలోని ఐదు ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలోని 45దుకాణాలకు టెండర్ల స్వీకరణ ప్రారంభమైంది. అయిదే దసరా మరుసటి రోజే ఉండటంతో తొలిరోజు ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. రెండో రోజైన ఈనెల 10న 19టెండర్లు, 11వ తేదీన 20టెండర్లు, 12వ తేదీన 34టెండర్లు, 14వ తేదీన 109టెండర్లు దాఖలయ్యాయి. ఇందులో ఆదివారం మినహాయిస్తే చివరి రోజు నాటికి కేవలం ఏడు రోజులే టెండర్లకు గడువుగా ఉంది. ఇదిలా ఉంటే మంగళవారం మాత్రం వారం రోజుల్లోనే అత్యధికంగా 163టెండర్లు దాఖలవ్వడం గమనార్హం. జిల్లా పరిధిలోని ఐదు సర్కిళ్లకు గాను కల్వకుర్తి సర్కిల్‌లో అత్యధికంగా 157దరఖాస్తులు రాగా అచ్చంపేటలో అత్యల్పంగా 36టెండర్లు దాఖలయ్యాయి.

గత రెండేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం వచ్చిన టెండర్లు చాలా తక్కువగా ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు సమయం కావడంతో 2017-19సంవత్సరానికి గాను వేయికిపైగా టెండర్లు దాఖలయ్యాయి. అలాగే టెండరు ఫీజు రూ.1లక్ష మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు ఎన్నికలు లేకపోవడం, నాన్ రీఫండబుల్ ఫీజు రూ.2లక్షలకు పెంచడంతో టెండర్లపై ఆ ప్రభావం కనపడిందనే చర్చ జరుగుతోంది. టెండర్లు దాఖలు చేసిన వారిలో అత్యధికులు సుదీర్ఘ కాలంగా మద్యం వ్యాపారంలో ఉన్న వ్యక్తులే కావడం గమనార్హం. టెండరు ఫీజు రూ.2లక్షలు పెంచడంతో పలువురు ఆశావహులు సిండికేట్లుగా మారి టెండర్లు దాఖలు చేస్తున్నారు. తక్కువ సంఖ్యలో టెండర్లు దాఖలైన దుకాణాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. చివరి రోజైన బుధవారం ఇలా వ్యాపారులు తమ టెండర్లను భారీగా వేయవచ్చని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏయే దుకాణాలకు టెండర్లు అధికంగా వచ్చాయోననే ఆరా తీస్తున్నారు. దీన్ని బట్టి టెండర్ల దాఖలుపై వ్యాపారులు అంచనాకు రానున్నారు. అయితే ఇప్పటి వరకు 356టెండర్లు రాగా మరో 500కుపైగా టెండర్లు చివరి రోజు రావచ్చని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. దాదాపు వేయికి కాస్త అటు ఇటుగా మొత్తం టెండర్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈనెల 18న టెండర్ల ఖరారు జరగనుంది. జిల్లా కేంద్రంలోని సుఖజీవన్ రెడ్డి గార్డెన్స్‌లో కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో దుకాణాల టెండర్లను ఖరారు చేయనున్నారు. ఇప్పటి వరకు దాఖలైన టెండర్ల ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.7కోట్ల ఆదాయం సమకూరడం విశేషం.

ఒక్కో దుకాణానికి రూ.2లక్షల చొప్పున నాన్ రీఫండబుల్ ఫీజుగా వచ్చిన ఈ ఆదాయం ఎక్సైజ్ శాఖ ఆదాయంలోనే జమ చేయబడుతుంది. అచ్చంపేటలో ఇప్పట్లో మున్సిపల్ ఎన్నికలు లేకపోవడంతో అక్కడ పది దుకాణాలు ఉన్నా కేవలం 36టెండర్లే దాఖలయ్యాయి. జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్‌లో త్వరలోనే మున్సిపాల్టీ ఎన్నికలు జరగనున్నందున ఈ ప్రాంతాల్లో టెండర్లకు వ్యాపారులు ఆసక్తి చూపిస్తున్నారు. మంగళవారం టెండర్ల ప్రక్రియను ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ధనుంజయరెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డిలు పరిశీలించారు. ఐదు సర్కిళ్ల పరిధిలోని దుకాణాలకు గాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐదు కౌంటర్ కేంద్రాల ద్వారా జరిగిన టెండర్ల దాఖలును ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ గంగారాంను అడిగి తెలుసుకున్నారు. మొత్తం మీద మరో మూడు రోజుల్లో నూతన మద్యం పాలసీ ప్రకారం రాబోయే 2021వరకు లైసెన్సు జారీ ప్రక్రియ పూర్తి కానుంది.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...