ఉప్పొంగిన కృష్ణమ్మ


Sat,September 14, 2019 03:20 AM

-శ్రీశైలానికి భారీగా వరద
-2.89 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
-10 గేట్ల ద్వారా సాగర్‌కు నీటివిడుదల
-నిరంతరం విద్యుదుత్పత్తి

నాగర్‌కర్నూల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : శ్రీశైలం మరోసారి నిండుకుండలా మారింది. ఎగువన జూరాల నుంచి భారీ ఎత్తున వస్తున్న ఇన్‌ఫ్లోతో ఈ సీజన్‌లోనే రెండోసారి 10గేట్లు తెరుచుకొన్నాయి. దీనివల్ల ప్రాజెక్టు కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇలా వస్తున్న వరద జలాలతో నాగార్జున సాగర్‌కు సైతం 2.78లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తుండటం విశేషం.

10గేట్ల ద్వారా సాగర్‌కు కృష్ణమ్మ
శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణమ్మ రాకతో నురగలు కక్కుతోంది. జూరాల నుంచి భారీ ఎత్తున వస్తున్న వరద జలాలతో ప్రాజెక్టు గరిష్ట మట్టానికి నీళ్లు చేరుకున్నాయి. మొత్తం 885 అడుగులకు గానూ 884.50 అడుగులకు నీరు చేరింది. అలాగే 215 టీఎంసీలకు గానూ 212.91 టీఎంసీలకు చేరుకున్నది. దీంతో పాటుగా జూరాల నుంచి 2.58 లక్షల క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 30వేల 653 క్యూసెక్కుల నీటి ప్రవాహం కలిపి 2,89,550 క్యూసెక్కుల నీళ్లు శ్రీశైలానికి ఇన్‌ఫ్లో రూపంలో వచ్చి చేరుతున్నాయి. ఇలా భారీ ఎత్తున వస్తున్న వరద జలాల దృష్ట్యా అధికారులు శుక్రవారం ఉదయం 10గంటల సమయంలో 8 గేట్లను ఎత్తారు. ప్రస్తుతం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీనివల్ల నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 3,47,893 క్యూసెక్కుల నీరు వెళ్తున్నది. ఇక శ్రీశైలం నుంచి ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టుకు 2,400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 28,500 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,026 క్యూసెక్కులతో పాటుగా కుడిగట్టు జల విద్యుత్ కేంద్రానికి 29,240 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రానికి 40,387 క్యూసెక్కుల చొ ప్పున 3,80,885 క్యూసెక్కుల నీళ్లు ఔట్ ఫ్లోగా తరలి వెళ్తున్నాయి. గత నెలలో ప్రాజెక్టు ద్వారా పది గేట్లు తెరుచుకోగా తిరిగి మరోసారి ఈ సీజన్‌లోనే రెండోసారి రిజర్వాయర్ పరిసరాల్లో పర్యాటక సందడి నెలకొంది. రెండో శనివారంతో పాటుగా ఆదివారాలు వారాంతపు సెలవులు రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున ప్రాజెక్టు అందాలను తిలకించే అవకాశం ఉంది.

జూరాలకు వరద
జోగుళాంబ గద్వాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరుగుతుంది. ఒక రోజు వ్యవధిలోనే దాదాపు 1లక్ష క్యూసెక్కుల వరద అదనంగా జూరాలకు వచ్చి చేరుతుంది. శుక్రవారం రాత్రి వరకు ఇన్‌ఫ్లో 2,53,000 క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్టు నదిలోకి విడుదల చేస్తుండటంతో అవుట్ ఫ్లో 2,64,566 క్యూసెక్కులు నమోదైంది. వరద ప్రవాహానికి అనుగుణంగా 20 గేట్లను ఎత్తి 2,27,481 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుల చేస్తున్నన్నారు. జూరాల ప్రాజెక్ట్ సామర్థ్యం 1045 అడుగుల ఎత్తులో 9.657టీఎంసీలుండగా ప్రస్తుతం 1044.7 అడుగుల ఎత్తులో 9.521 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి కాలువ ద్వారా 815 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 1,100 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 650 క్యూసెక్కులు నీటిని అధికారులు కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. విద్యుత్పుత్తి కోసం పవర్‌హౌజ్‌కు 31,597 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి 6 టర్బైన్లను ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.

వీటితో పాటు నది నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్లకు నింపేందుకు నెట్టెంపాడు లిఫ్ట్‌లో 2 మోటర్లను ప్రారంభించి 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1 ద్వారా 650 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2 ద్వారా 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ద్వారా 630 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎగువనున్న కర్ణాటకాలో భారీగా వర్షపాతం నమోదవుతుండటంతో అక్కడి ప్రాజెక్ట్‌లకు వరద నీరు క్రమ క్రమంగా పెరుగతూ చేరుతుంది. ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 2,06,366 క్యూసెక్కులు కొనసాగుతుండటంతో వచ్చిన నీటని వచ్చినట్టు అదే స్థాయిలో 2,06,366 క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 129.72 టీఎంసీలుండగా ప్రాజెక్ట్ అధికారులు నదిలో 121.05 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. నారాయణపుర ప్రాజెక్ట్‌లో ఇన్‌ఫ్లో 2,03,513 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 2,06,443 క్యూసెక్కులు నమోదైంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీల నీటి నిల్వ ఉండగా ప్రాజెక్ట్‌లో 34.99 టీఎంసీల నీటిని నిల్వ చేసుకొని వచ్చిన నీటిని వచ్చినట్టుగా నదిలోకి విడుదల చేస్తున్నారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు కొనసాగుతున్న వరద
అయిజ : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. టీబీ డ్యాం నుంచి 22,900 క్యూసెక్కుల వరద విడుదల చేస్తుండటంతో ఆర్డీఎస్ ఆనకట్టకు వరద నీరు స్థిరంగా చేరుతోంది. శుక్రవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 48,370 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, ఆనకట్టపై 53,250 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో ఉంది. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి ఆయకట్టుకు 610 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆర్డీఎస్ డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 11 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు డీఈఈ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని సింధనూరు హెడ్‌రెగ్యులేటర్ సమీపంలో 282 క్యూసెక్కులు ఆయకట్టుకు చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సుంకేసులకు కొనసాగింపు..
రాజోళి : సుంకేసుల బ్యారేజీకి ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతున్నది. శుక్రవారం ఎగువ నుంచి సుంకేసులకు 46,600 ఇన్‌ఫ్లో రాగా, 43700 ఔట్ ఫ్లో కొనసాగింది. ఈ నీటి విడుదలకు అధికారులు 10 గేట్లను తెరచి నీటిని శ్రీశైలానికి విడుదల చేశారు. కేసీ కెనాల్‌కు 2,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డ్యాం పూర్తి స్థాయి సామర్థ్యం 1.2 టీఎంసీ కాగా, ప్రస్తుతం 0.8 టీఎంసీ నీటి నిల్వ ఉన్నట్లు ఏఈ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
తుంగభద్ర డ్యాంకు కొనసాగుతున్న ్రప్రవాహం
అయిజ : కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర నదికి వరద కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు అప్పర్ తుంగ, భద్ర నదులకు వరద స్థిరంగా కొనసాగుతుండటంతో అప్పర్ తుంగ, భద్ర ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువన ఉన్న తుంగభద్ర జలాశయానికి విడుదల చేస్తున్నారు. శుక్రవారం తుంగభద్ర జలాశయానికి 32,116 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో 22,900 క్యూసెక్కులు నమోదైంది. 10 స్పిల్‌వే గేట్ల ద్వారా 22,900 క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నారు. కర్ణాటక, ఏపీ రాష్ర్టాలకు చెందిన కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. 100.855 టీఎంసీల నీటి నిల్వకు గానూ ప్రస్తుతం 100.855 టీఎంసీలను నిల్వ ఉంచినట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ తెలిపారు. 1633 అడుగుల నీటి మట్టానికి గానూ 1633 అడుగుల నీటి నిల్వ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో టీబీ డ్యాంకు వరద మరి కొన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...