శాంతించిన కృష్ణమ్మ


Thu,September 12, 2019 03:44 AM

-జూరాలకు తగ్గుతున్న వరద
-ఇన్‌ఫ్లో 1,20,000, అవుట్ ఫ్లో 1,14,585 క్యూసెక్కులు
-జూరాలలో 6గేట్ల ద్వారా దిగువకు జలాలు
-తుంగభద్ర కు నిలకడగా వరద
-28 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల

జోగుళాంబ గద్వాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జూరాలకు వరద కొనసాగుతుంది. బుధవారం సాయంత్రం జూరాల ఇన్‌ఫ్లో 1,20,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 1,14,585 క్యూసెక్కులు నమోదైంది. వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుండటంతో 6గేట్లను ఎత్తి స్పిల్ వే ద్వారా 71,157 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516మీటర్ల ఎత్తులో 9.657టీఎంసీలుండగా ప్రస్తుతం 318.190 మీటర్ల ఎత్తులో 8.989టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి కాలువ ద్వారా 752 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 900 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 650క్యూసెక్కులు నీటిని అధికారులు కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. వీటితో పాటు నది నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్లను నింపేందుకు నెట్టెంపాడు లిఫ్ట్‌లో రెండు మోటార్లను ప్రారంభించి 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1 ద్వారా 650 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2 ద్వారా 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ద్వారా 630 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 2,23,777, అవుట్ ఫ్లో 71,741 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్ట్‌కు పూర్తి సామర్థ్యం 129.72టీఎంసీలు ఉండగా 113.68టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. నారాయణపుర ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 80వేల క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,15,960 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 37.17 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఆర్డీఎస్ ఆనకట్టకు..
అయిజ : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తోడు టీబీ డ్యాం నుంచి విడుదలవుతున్న వరదతో ఆర్డీఎస్ ఆనకట్టకు నీటి ప్రవాహం పరవళ్లుతొక్కుతున్నది. టీబీ డ్యాం నుంచి 72,728 క్యూసెక్కుల వరద విడుదల చేస్తుండటంతో ఆర్డీఎస్ ఆనకట్టకు వరద నీరు స్థిరంగా చేరుతోంది. బుధవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 68,805 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, ఆనకట్టపై 74,348 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో ఉంది. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి ఆయకట్టుకు 610 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆర్డీఎస్ డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 11.9 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు డీఈఈ పేర్కొన్నారు. రాష్ట్ర సరిహద్దులోని సింధనూరు హెడ్‌రెగ్యులేటర్ సమీపంలో 321 క్యూసెక్కులు ఆయకట్టుకు చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

తుంగభద్ర డ్యాంకు
కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర పరవళ్లు తొక్కుతోంది. కొన్ని రోజులుగా కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు అప్పర్ తుంగ, భద్ర నదులకు వరద స్థిరంగా కొనసాగుతుండటంతో అప్పర్ తుంగ, భద్ర ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువన ఉన్న తుంగభద్ర జలాశయానికి విడుదల చేస్తున్నారు. బుధవారం తుంగభద్ర జలాశయానికి 1,03,748 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 83,805 క్యూసెక్కులు నమోదైంది. 28 స్పిల్‌వే గేట్ల ద్వారా 71,728 క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నారు. కర్ణాటక, ఏపీ రాష్ర్టాలకు చెందిన కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. 100.855 టీఎంసీల నీటి నిల్వకు గాను ప్రస్తుతం 100.086 టీఎంసీలను నిల్వ ఉంచినట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ తెలిపారు. 1633 అడుగుల నీటి మట్టానికి గాను 1632.80 అడుగుల నీటి నిల్వ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సుంకేసులకు పెరిగిన ఇన్‌ఫ్లో
రాజోళి: సుంకేసుల బ్యారేజీకి బుధవారం ఇన్‌ఫ్లో పెరిగింది. ఎగువన ఉన్న కర్ణాటకలోని కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడి ప్రాజెక్టులు నిండగా. డ్యాం సామర్థ్యం మేర నీటిని నిల్వ ఉంచుకుని మిగతా నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో మంగళవారం కంటే బుధవారం కొద్ది మేర నీటి ప్రవాహం పెరిగింది. బుధవారం సాయంత్రానికి ఎగువ నుంచి 65 వేల క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లో రాగా, 15 గేట్లు తెరిచిన అధికారులు 62,500 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. కేసీ కెనాల్ కు 2,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జేఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...