నిమజ్జన వేడుకలకు సిద్ధం


Wed,September 11, 2019 01:09 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: పాలమూరు పట్టణంలో కొలువుదీరిన గణనాథులను బుధవారం నిమజ్జనం చేయనున్నారు. 10 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న ఏకదంతుడికి వీడ్కోలు పలికేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎక్కడా నీరు లేకపోవడంతో చిన్న విగ్రహాలను హన్వాడ చెరువుకు తరలించగా, పెద్ద వాటిని బీచుపల్లికి తరలించేవారు. ఇప్పుడు హన్వాడతోపాటు చుట్టుపక్కల ఏ చెరువులోనూ నీళ్లు లేకపోవడంతో అన్ని విగ్రహాలను బీచుపల్లికి తరలించనున్నారు. పాలమూరు పట్టణంలో దాదాపు 300 విగ్రహాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే నిర్వాహకులకు వాహనాలను దారి మళ్లించేందుకు రూట్‌ మ్యాప్‌లు సిద్ధం చేసి ఉంచారు.

టీడీ గుట్ట, కోయిలకొండ ఎక్స్‌రోడ్‌ నుంచి వచ్చే వినాయక వాహనాలను కొత్త చెరువు చౌరస్తా, కలెక్టర్‌ బంగ్లా ైప్లె ఓవర్‌ మీదుగా జిల్లా కోర్టు నుంచి అంబేద్కర్‌ చౌరస్తా మీదుగా భూత్పూర్‌ దారిపైకి వెళ్లాలి.
- జడ్చర్ల వైపు నుంచి కోస్గి, కొడంగల్‌ వైపు వెళ్లేందుకు అంబేద్కర్‌ చౌరస్తా నుంచి దారి మళ్లించి తెలంగాణ చౌరస్తా, కలెక్టర్‌ బంగ్లా ఫ్లై ఓవర్‌ మీదుగా కొత్త చెరువు నుంచి వాహనాలను మళ్లిస్తారు.
-అశోక్‌ టాకీసు నుంచి కోయిలకొండ వైపు వెళ్లే వాహనాలను అంబేద్కర్‌ చౌరస్తా నుంచి మళ్లీస్తారు.

300 మంది పోలీసు బందోబస్తు
నిమజ్జనానికి 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ పోలీసులతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పోలీసులు బందోబస్తుకు రానున్నారు. అడిషనల్‌ ఎస్పీ, డీఎస్పీల ఆధ్వర్యంలో బందోబస్తును పర్యవేక్షిస్తారు. ఇప్పటికే ఎస్పీ రెమా రాజేశ్వరి పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించి బందోబస్తుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. ప్రార్థన మందిరాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

నారాయణపేట జిల్లాలో 1300 మంది
పదిరోజులపాటు పూజలందుకున్న గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. నారాయణపేట, మక్తల్‌, కోస్గి తదితర మండలాలలో ప్రతిష్ఠించిన విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. జిల్లా పోలీస్‌ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు శాంతిభద్రతలు, విగ్రహాల తరలింపు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం సాయంత్రం నుంచి ఆరంభమై గురువారం ఉదయం వరకు వేడుకలు జరుగనున్నాయి. నిమజ్జనంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుంగా ఎస్పీ చేతన ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు. డీఐజీ శివశంకర్‌రెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకొని పలు సూచనలు చేశారు. ఇద్దరు ఏఏస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 25మంది సీఐలు, 40మంది ఎస్సైలను నియమించారు. మరో 1300 మంది పోలీసులు శాంతి భద్రతల విధులు నిర్వహిస్తున్నారు. అవసరమైన చోట్ల సీసీకెమెరాలు ఏర్పాటు చేశారు. విగ్రహాలకు పూజలు చేసేందుకు పేటలో రెండు వేదికలను ఏర్పాటు చేశారు. నృత్య ప్రదర్శనలు, కోలాటాలు, భజనలతో వేడుకలు జరుగనున్నాయి. గురువారం తెల్లవారు జాముకు వాహనాలు ఒక్కొక్కటిగా పట్టణంలోని సత్యనారాయణ చౌరస్తాకు చేరుకుంటాయి. చిన్న చిన్న విగ్రహాలను కొంగారెడ్డిపల్లి చెరువుకు, పెద్ద విగ్రహాలను కృష్ణానదికి తరలించనున్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...