ఉప్పొంగిన కృష్ణవేణి


Tue,September 10, 2019 01:05 AM

-శ్రీశైలం డ్యాంకు 3.93 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
-ఆరు గేట్లు ఎత్తి 1.67 లక్షలు దిగువకు
-నెల రోజుల వ్యవధిలో రెండో సారి తెరుచుకున్న గేట్లు
జూరాలలో 4 గేట్ల ద్వారా 2.68 లక్షల క్యూసెక్కులు
-తుంగభద్రకూ కొనసాగుతున్న వరద
-28 గేట్ల ద్వారా దిగువకు నీళ్లు

నాగర్‌కర్నూల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు తిరిగి తెరుచుకున్నాయి. ఈ సీజన్‌లో రెండోసారి ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవడంతో ప్రాజెక్టుకు పర్యాటక కళ సంతరించుకోనున్నది. జూరాల ప్రాజెక్టుతో పాటు సుంకేశుల నుంచి పెద్ద ఎత్తున వరద జలాలు వస్తుండటంతో గత ఐదు రోజులుగా శ్రీశైలానికి ఇన్‌ఫ్లో పెరుగుతూ వస్తోంది. ఫలితంగా నీటి నిల్వ సామర్థ్యం ప్రాజెక్టు గరిష్ట మట్టాలకు చేరుకున్నది. జూరాల నుంచి 2,47,900 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 95,128 క్యూసెక్కుల నీళ్లు శ్రీశైలం వైపు పరుగులు పెడుతున్నాయి. దీనివల్ల ప్రాజెక్టు గరిష్ట మట్టం 885 అడుగులకు గానూ 884.60 అడుగులకు చేరుకున్నది. ఇక నీటి నిల్వ గరిష్ట సామర్థ్యం 215 టీఎంసీలకు గానూ 213.4011 టీఎంసీలకు చేరుకోవడం గమనార్హం. దీంతో అధికారులు సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో 4 గేట్లను పది అడుగుల మేర ఎత్తారు. దీనివల్ల నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1,11,564 క్యూసెక్కుల నీరు తరలి వెళ్తోంది.

అదే విధంగా ప్రాజెక్టు కుడి, ఎడమ గట్టు జలాశయాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కూడా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఎడమ గట్టు కేంద్రానికి 38,499 క్యూసెక్కులు, కుడిగట్టు జల విద్యుత్ కేంద్రానికి 30,332 క్యూసెక్కుల నీరు వెళ్తోంది. ఈ సీజన్‌లో భారీ ఎత్తున వరద నీళ్లు రావడంతో శ్రీశైలం నుంచి సాగర్‌కు దాదాపుగా 680 టీఎంసీల వరకు నీరు వెళ్లింది. కర్ణాటకలో ఆల్మట్టి నుంచి ఇంకా నీటి విడుదల కొనసాగుతుండటంతో ప్రాజెక్టుకు భారీగా నీరు వచ్చి చేరే అవకాశముంది. ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లోగా కూడా అదే స్థాయిలో నీళ్లు విడుదలవుతున్నాయి. ఎంజీకేఎల్‌ఐకి 2400 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 28,500 క్యూసెక్కుల నీళ్ల చొప్పున మొత్తం 2,69,103 క్యూసెక్కుల నీళ్లు బయటకు వెళ్తున్నాయి.

జూరాలకు పెరుగుతున్న వరద
జోగుళాంబ గద్వాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జూరాలకు నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుంది. ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్ట్‌లకు వరద ప్రభావం పెరగు తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తుంది. జూరాలకు సోమవారం సాయంత్రం ఇన్‌ఫ్లో 2,90,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 3,02,763 క్యూసెక్కులు నమోదైంది. వరద ప్రవాహం పెరగుతుండటంతో జూరాలలోని 24 గేట్లను ఎత్తి స్పిల్ వే ద్వారా 2,68,970 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం వరకు నిల్వచేసి అదనంగా వస్తున్న నీటిని మాత్రమే నదిలోకి విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్ల ఎత్తులో 9.657 టీఎంసీ లుండగా ప్రస్తుతం 318.510 మీటర్ల ఎత్తులో 9.645 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

కుడి కాలువ ద్వారా 752 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 900 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 650 క్యూసెక్కులు నీటిని అధికారులు కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. అలాగే పవర్ హజ్ ద్వారా 29,342 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. వీటితో పాటు నది నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్లకు నింపేందుకు నెట్టెంపాడు లిఫ్ట్‌లో ఒక మోటర్ ప్రారంభించి 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1 ద్వారా 650 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2 ద్వారా 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ద్వారా 630 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 1,71,740, అవుట్ ఫ్లో 2,28,407 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్ట్‌కు పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు ఉండగా 103.13టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 2,28,511 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 2,42,606 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 33.25 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...