శరవేగంగా!


Sun,August 25, 2019 01:22 AM

-యుద్ధప్రాతిపదికన పాలమూరు ప్రాజెక్టు పనులు
-అత్యధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
-వచ్చే వానకాలానికి సాగునీరు ఇవ్వాని సీఎం ఆదేశం
-పంప్‌హౌజ్‌ల నిర్మాణానికి పీఎఫ్‌సీ నుంచి రూ.10 వేల కోట్లు
-త్వరలో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
-సీఎం చొరవతో హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

మహబూబ్‌నగర్ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ : కాళేశ్వరం ప్రాజెక్టు.. కేవలం మూడేళ్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం. 18 లక్షలకుపైగా కొత్త ఆయకట్టుకు, అంతే స్థాయిలో పాత ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేందుకు నిర్మించిన మహా అద్భుత ప్రాజెక్టు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు పూర్తయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన దృష్టిని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపైకి మళ్లించారు. కాళేశ్వరం తరహాలోనే ఈ ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. శుక్రవారం ప్రాజెక్టు పనులపై ఈఎన్‌సీ, సీఈతో హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది వానకాలం నాటికి పాలమూరు ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించాలనే లక్ష్యాన్ని ఇరిగేషన్‌కు నిర్దేశించారు. ఇందుకోసం రాత్రింబవళ్లు 3 షిఫ్టుల్లో పనిచేయాలన్నారు. గత వారమే పాలమూరు పనులపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వారం రోజుల్లోనే మరోసారి సమీక్ష నిర్వహించడం గమనార్హం. ఈ ప్రాజెక్టు పనుల నిర్వహణకు ఇప్పటికే నుంచి రూ.10 వేల కోట్ల రుణం మంజూరైన విషయం తెలిసిందే. అయితే మిగతా పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి పనులను వేగంగా పూర్తి చేసేందుకు నిర్ణయించింది. త్వరలో పాలమూరు ఎత్తిపోతల పనులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు సీఎం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఉమ్మడి జిల్లాకు పెద్దగా నీటి వినియోగం లేని పరిస్థితుల్లో పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే ఇక్కడ రైతులకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది.

పాలమూరుపై ప్రత్యేక దృష్టి...
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం కావడంతో అందరి దృష్టి ఇక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పడింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలో సుమారు 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. పాలమూరును సస్యశ్యామలం చేయాలంటే ఈ ప్రాజెక్టుతోనే సాధ్యమని సీఎం కేసీఆర్ భావించారు. అందుకే రూ.35200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు పనులకు 2015 జూన్ 11వ తేదీన సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. పనులు బాగా సాగుతున్నాయని భావిస్తున్న తరుణంలో వన్యప్రాణుల మనుగడకు ఈ ప్రాజెక్టు వల్ల ముప్పు పొంచి ఉందని కోర్టుల్లో పలువురు వేసిన కేసులతో పనులు నిలిచిపోయాయి. అయితే సర్కారు మాత్రం ఎక్కడా తగ్గలేదు. అనుమతులు రానిచోట పనులు ఆపేసి.. ఆటంకాలేవీ లేని చోట పనులు కొనసాగించింది. అయితే క్రమంగా ఒక్కో కేసు కొలిక్కి రావడం.. పర్యావరణ, అటవీ అనుమతులు వచ్చాయి.

కొనసాగుతున్న పనులు
పాలమూరు ప్రాజెక్టును 18 ప్యాకేజీలుగా విభజించారు. ఈ ప్యాకేజీలలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏదుల రిజర్వాయర్ పనులు దాదాపు పూర్తి కాగా.. నార్లాపూర్, కరివెన (కురమూర్తిరాయ) రిజర్వాయర్ పనులు 60 శాతం పూర్తయ్యాయి. వట్టెం రిజర్వాయర్ పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లు భూసేకరణ సమస్యలతో ఆలస్యమైన ఉదండాపూర్ రిజర్వాయర్ పనుల్లో కూగా వేగం పంజుకున్నది. టన్నెల్, సర్జ్‌పూల్, పంప్ హౌజ్, పనులు నిర్మాన ఉన్నాయి. సీఎం కేసీఆర్ చొరవతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయనే నమ్మకం రైతుల్లో ఏర్పడుతున్నది. ఏదుల పంప్‌హౌజ్ పనులు 70 శాతం మేర పూర్తయ్యాయి. నార్లాపూర్, వట్టెం పనులు 50 శాతం మేర పూర్తయ్యాయి. ఉదండాపూర్ పనులు ఇప్పుడిప్పుడే పుంజుకున్నాయి. సుమారు రూ.14 వేల కోట్ల పనులకు ఇప్పటి వరకు పంప్ హౌజ్‌కు సంబంధించి సుమారు రూ.4 వేల కోట్ల పనులు పూర్తయ్యాయి. నాలుగు పంప్ హౌజ్‌లకు నిధుల విడుదలతో పనులు మరింత వేగవంతమయ్యే అవకాశం ఏర్పడింది.

పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ నిధులు రావడంతో....
ప్రాలమూరు ప్రాజెక్టు పనులకు గుండెకాయ వంటి ఎలక్ట్రో మెకానికల్ పనుల కోసం రూ.10 వేల కోట్లను విడుదల చేశారు. ఎలక్ట్రో మెకానికల్ పనులు, సబ్ స్టేషన్ల నిర్మాణం, భారీ పంపుల కొనుగోలు, పంప్ హౌజ్‌ల నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. ఇప్పటికే నార్లాపూర్, ఏదుల, వట్టెం, ఉదండాపూర్ రిజర్వాయర్ల పరిధిలోని పంప్‌హౌజ్, టన్నెల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

త్వరలో పాలమూరుకు సీఎం కేసీఆర్
పాలమూరు ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం త్వరలో ఆయన ఉమ్మడి జిల్లాలో పర్యటించి ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నార్లాపూర్ పంప్ హౌజ్ మొదలుకొని ఉదండాపూర్ రిజర్వాయర్ పనుల వరకు సీఎం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేయనున్నట్లు సమాచారం. ఒక్కసారి సీఎం ప్రాజెక్టు సందర్శనకు వస్తే ఇక పనులు పరుగులు పెట్టే అవకాశం ఉంది.

పాలమూరు పూర్తయితే..
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా సీమకుసుమారు 50 వేల క్యూసెక్కులను తీసుకెళ్తున్నారు. ఓ నదిని దాదాపుగా తమ వైపునకు మళ్లించినట్లు పోతిరెడ్డిపాడు దర్శనమిస్తుంది. అదీ గాక హంద్రీనీవా సుజల స్రవంతి, ముచ్చుమర్రి కేసీ కెనాల్ లింక్ ద్వారా సైతం శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను రాయలసీమకు తరలిస్తారు. అయితే ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తి నీటిమట్టం (205.2 టీఎంసీలు) ఉంది. ఇందులో నుంచి ఉమ్మడి పాలమూరుకు వినియోగిస్తున్నది కేవలం 2400 క్యూసెక్కులు మాత్రమే. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు జూరాల నుంచి శ్రీశైలానికి 23 రోజుల్లో 785 టీఎంసీల వరద జలాలు వచ్చి చేరాయి. ఈ లెక్కలన్నీ పాలమూరు ఎత్తిపోతల పథకం విజయవంతంగా పనిచేస్తుంది అని చెప్పేందుకు పనికివస్తాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాజెక్టులు కలుపుకుని సుమారు 10 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లా ఆయకట్టు 20 లక్షల ఎకరాలను దాటిపోనుంది. దీంతో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం కానున్నది.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...