కోయిల్‌సాగర్ కాలువల్లో కృష్ణమ్మ పరుగులు


Fri,August 23, 2019 02:18 AM

-ఆయకట్టుకు నీటిని విడుదల చేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
-రైతులు సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలి
-రిజర్వాయర్ ఎత్తు పెంచేందుకు కృషి చేస్తామని హామీ

దేవరకద్ర, నమస్తే తెలంగాణ : కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నీటిని కేవలం సాగుకే ఉపయోగించడంతోపాటు ప్రాజెక్టు ఎత్తును పెంచేందుకు కృషి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. గురువారం కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి మంత్రి సాగునీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల వద్ద జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డిలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి తూము గేట్లు తెరిచి నీటిని విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమల కాలువల నీటిని రైతులు వృథా చేయకుండా పంటల సాగుకు ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు. ఈ ప్రాజెక్టు వర్షాధారంగా నిర్మించిన ప్రాజెక్టు అని, అయితే వర్షాలు రాకపోయినా జూరాల బ్యాక్ వాటర్ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలు ప్రాజెక్టుకు చేరుతున్నాయన్నారు.

గత వారంలో ప్రాజెక్టులో చేపలను వదిలేందుకు ఇక్కడికి వచ్చినప్పుడు కొంత మంది రైతులు కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తే పంటలను సాగు చేసుకునేందుకు ఆవకాశం ఉంటుందని కోరడంతో ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులతో చర్చిస్తే ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటిని విడుదల చేస్తే ప్రాజెక్టు నుంచి 460 గ్రామాలకు తాగునీటిని అందించడం ఇబ్బందికరం అవుతుందని తెలపడంతో దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలతో చర్చించిన వెంటనే ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లాం. స్పందించిన సీఎం కేసీఆర్ కోయిల్‌సాగర్ నీటిని కేవలం ఆయకట్టు సాగుకు మాత్రమే ఉపయోగించాలని ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 460 గ్రామాలకు అందిస్తున్న తాగునీటిని శ్రీశైలం ద్వారా అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఇరిగేషన్ అధికారులు నేడు సర్వే చేశారని, మూడు నెలల్లో పైప్‌లైన్ వేసిన అనంతరం కోయిల్‌సాగర్ నీటిని కేవలం సాగు కోసమే ఉపయోగిస్తామన్నారు. అలాగే కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి కూడా నీటిని తరలించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉంటూ మంచి పనులు చేస్తున్నా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదచల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 32 అడుగులకు ఉందని దీంతో ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తు పేంచేందుకు కృషి చేస్తుందని ప్రాజెక్టు ఎత్తు పెంచితే ఎన్ని గ్రామాలకు నష్టం జరుగుతుందో అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. అనంతరం ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డిలు మాట్లాడుతూ దేవరకద్ర, చిన్నచింతకుంట, మరికల్, ధన్వాడ మండలంలోని ఆయా గ్రామాల రైతులు నీటిని ఎట్టి పరిస్థితిలో వృథా చేయాకుండా సాగు కోసం ఉపయోగించుకోవాలని, జూరాల నుంచి వరద ప్రవాహాన్ని బట్టి వివిధ గ్రామాల చెరువులు నింపేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రాజెక్టుల సీఈ కృపాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, ఎంపీపీ రమ, మార్కెట్ చైర్మన్ దొబ్బలి ఆంజనేయులు, కోయిల్‌సాగర్ ఆయకట్టు చైర్మన్ ఉమామహేశ్వర్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్‌యాదవ్, నాయకులు కరణం రాజు, కొండా శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

157
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...