వర్షం.. రైతన్నల హర్షం


Thu,July 18, 2019 04:14 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ప్రతి రోజూ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం పలుకస్తున్నది. సాయంత్రం కాగానే మేఘాలు కమ్ముకొని భారీ వర్షాల కురిసే అవకాశం ఉందనే లోపే మేఘాలు చెల్లాచెదురావడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షంగా కురిసినా అధిక భాగంలో చిన్నపాటి వర్షాలతో మురిపించడం జరుగుతున్నది. భారీ వర్షాలు కురిస్తే రెండు పంటలకు ఎంతో మేలు జరుగుతుందని రైతులు భావిస్తున్నా రు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా భారీగానే మొక్క, కంది, జొన్న, తదితర పంటలను సాగు చేశారు. ఈ పంటల సాగు జరిపే సమయంలో వర్షం దూరంగా ఉన్న విషయం విధితమే. ఈ క్రమంలో గత మూడు రోజులుగా ప్రతి రోజు జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. అయినప్పటికీ ఆరుతడి పంటలకు మేలు ఉన్నా.. భారీ వర్షం కురిసి చెరువులు, కుంటలు నిండితే సాగునీరుతోపాటు పశువులకు తాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయని రైతులు భావిస్తున్నారు. బుధవారం జిల్లాలో 1.6 ఎంఎం వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

మక్తల్ మండలంలో భారీ వర్షం
మక్తల్ రూరల్ : మక్తల్ పట్టణంతో పాటు మండలంలోని ఖానాపూర్, కర్ని, పంచలింగాల, చిట్యాల, బొందల్‌కుంట, కాచ్‌వార్, టేకులపల్లి గ్రామాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మక్తల్ పట్టణంలో దాదాపు గంటపాటు వర్షం కురవగా, ఖానాపూర్, కర్ని గ్రామాల్లో రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. దాదాపు నెలరోజులుగా భారీ వర్షం కరువై పంటల సాగులో మక్తల్ ప్రాంత రైతులు నిరాశగా ఉన్న త రుణంలో భారీ వర్షం కురవడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేసిన పంటలకు ఈ వర్షం జీవం పోయగా, కొన్ని గ్రామాల్లోని రైతులు పదును కోసం అదును చూసిన తరుణంలో వర్షం రావడంతో విత్తనాలు వేసేందుకు సమాయత్తం అవుతున్నారు. చెరువులు, కుంటల్లో కొద్దిపాటి నీరు చేరడంతో అక్కడక్కడా జలకళ సంతరించుకుంది.

జడ్చర్లలో ఓ మోస్తరు వర్షం
జడ్చర్లటౌన్ : జడ్చర్ల పట్టణంలో బుధవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. దాదాపు గంట పాటు కురిసిన వర్షం కారణంగా పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో జలమయంగా మారాయి. చైతన్యనగర్ కాలనీలో రైల్వే వంతెన కింద వర్షం నీరు చేరింది. దీంతో వాహనదారులు, పాదాచారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజీవ్‌నగర్‌కాలనీ, వెంకటేశ్వరకాలనీ, సాయినగర్ కాలనీల్లోని లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. పట్టణంలోని మురికికాలువలు వర్షపు నీటితో నిండి ప్రవహించాయి. అదే విధంగా మండలంలోని బూరెడ్డిపల్లి, పోలేపల్లి, వల్లూర్, ఉదండాపూర్, కొత్తతండా,పెద్దపల్లి, చిన్నపల్లి, బండమీదిపల్లి ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...