జీవనోపాధి కల్పిస్తాం


Fri,July 12, 2019 03:11 AM

హన్వాడ : చెంచులకు జీవనోపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తెలిపారు. మండలంలోని ఇబ్రహీంబాద్, నాయినోనిపల్లి గ్రామాలకు చెందిన చెంచులు కొనగట్టుపల్లి, ఇబ్రహీంబాద్ సమీపంలోని అటవీ భూములను సాగు చేసుకుంటున్నారు. ఈ భూమిని తమకు పంపిణీ చేయాలని పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ గురువారం కొనగట్టుపల్లి సమీపంలోని సర్వేనెంబర్ 77, ఇబ్రహీంబాద్ శివారులోని సర్వేనెంబర్ 403లలోగల అటవీ భూమిని సందర్శించి పరిశీలించారు. అటవీ భూమిని ఎన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారని సమీప పొలాల రైతులతో వివరాలను సేకరించారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో ఆయా గ్రామాల చెంచులు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. చట్ట ప్రకారం అటవీ భూమిని చెంచులకు పంపిణీ చేయలేమన్నారు. చెంచుల ఉపాధి కోసం ప్రతి ఇంటికీ రెండు పాడి గేదెలను పంపిణీ చేస్తామన్నారు. ఇండ్లు నిర్మించుకునేందుకు స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో వన సేవకులుగా పని కూడా కల్పిస్తామన్నారు. ఎవరైన భూములు విక్రయించినా, ఎక్కడైన ప్రభుత్వ భూమి ఉంటే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చెంచులకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ రుణాలను అర్హులందరికీ అందిస్తామన్నారు. ఎవరైన నిబంధనలకు విరుద్ధంగా అటవీ భూములను సాగు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో గంగారెడ్డి, తాసిల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఐటీడీఏ పీవో వెంకటయ్య, ఎంపీడీవో నటరాజ్, ఎంపీపీ బాల్‌రాజ్, సర్పంచ్ చిన్న చెన్నయ్య, టీఆర్‌ఎస్ నాయకులు రమణారెడ్డి, బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...