గులాబీ హోరు.. సభ్యత్వాల జోరు


Tue,July 9, 2019 01:47 AM

మహబూబ్ నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి :సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. గులాబీ హోరు.. సభ్యత్వాల జోరు అన్న రీతిలో కార్యక్రమాన్ని పార్టీ నేతలు ముందుకు తీసుకుపోతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో సుమారు 50వేలకు తగ్గకుండా సభ్యత్వాలు చేయించాలని అధిష్ఠానం నిర్ణయించింది. గత 27న తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ్యత్వ నమోదును లాంఛనంగా ప్రారంభించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా చేపట్టేందుకు పార్టీ ప్రతి రెండు నియోజకవర్గాలకు ఓ ఇన్‌చార్జిని నియమించింది. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను 7 మంది ఇన్‌చార్జులు ఇప్పటికే సభ్యత్వ నమోదు విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలను సమన్వయం చేసుకుంటూ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని గడపగడపకు తీసుకుపోతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 70 శాతం సభ్యత్వాల నమోదు కార్యక్రమం పూర్తయినట్లు ఇన్‌చార్జులు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వాలు తీసుకుంటున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇచ్చిన టార్గెట్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. కార్యకర్తలు, నేతలు ఇంటింటికి తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని నిర్ణయించారు. సభ్యత్వాలన్నింటినీ ఆన్‌లైన్ చేసేందుకు ప్రతి జిల్లా కేంద్రంలోనూ కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ. 2లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని అందిస్తున్నారు. టీఆర్‌ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూసి అనేక మంది స్వచ్ఛందంగా సభ్యత్వాలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు.

విస్తృతంగా సాగుతున్న సభ్యత్వ నమోదు...
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని 14 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది. 7 మంది ఇన్‌చార్జులు సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొంటున్నారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, ఇతర ముఖ్య నేతలు పార్టీ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటికే పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలు గ్రామాలు, వార్డులకు చేరుకున్నాయి. సుమారు 70శాతం వరకు సభ్యత్వ నమోదు పూర్తయింది. మరో రెండు మూడు రోజుల్లో లక్ష్యాన్ని చేరుకుంటారు. ప్రతి సభ్యత్వ నమోదు పుస్తకంలోనూ కనీసం 35 క్రియాశీల సభ్యత్వాలు ఉండేలా చూస్తున్నారు. 65 శాతం సాధారణ సభ్యత్వాలు నమోదు చేస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సభ్యత్వాలు నమోదు చేయిస్తున్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు ఆధారంగా వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ సైతం తీసుకుంటున్నారు. సభ్యత్వం తీసుకున్న వారి ఫోన్ నెంబర్ సైతం తీసుకుని ఈ వివరాలన్నింటిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ఇప్పటికే ప్రతి జిల్లాకు 5 చొప్పున కంప్యూటర్లను పార్టీ అధిష్ఠానం ఏర్పాటు చేసింది.

తొలిసారి అన్‌లైన్ సభ్యత్వ నమోదు..
గతంలోనూ టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించారు. ప్రతిసారి ఇచ్చిన టార్గెట్‌ను మించి సభ్యత్వాలు నమోదయ్యేవి. ఈసారి కూడా ఇచ్చిన టార్గెట్లను మించి సభ్యత్వాలు చేసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేస్తున్నారు. అయితే గతంలో లేని ప్రత్యేకత ఈసారి కనిపిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు నమోదైన సభ్యత్వాలన్నింటినీ ఈసారి ఆన్‌లైన్ చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి సభ్యుని ఆధార్, మొబైల్ నెంబర్‌తో సభ్యత్వాన్ని ఆన్‌లైన్ చేస్తున్నారు. దీనివల్ల పార్టీ సభ్యత్వాలు అన్ని ఆన్‌లైన్‌లో ఉంటాయి. జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు వివరాలన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. పార్టీ జారీ చేసే సందేశాలు ప్రతి సభ్యునికి నేరుగా చేరుకునేందుకు అవకాశం ఏర్పడింది. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందేశాలు సైతం కార్యకర్తలందరికీ నేరుగా పంపించే అవకాశం ఉంది. దీనివల్ల పార్టీ మరింత బలంగా మారేందుకు అవకాశం ఏర్పడుతుంది. సభ్యత్వాల నమోదులో యువత పాత్ర కీలకంగా మారుతోంది. పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు, రైతుల కోసం తీసుకొచ్చిన రైతు బంధు, రైతుబీమా పథకాలు, మిషన్ కాకతీయ గ్రామీణ యువతను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ పార్టీకి అండగా ఉండేందుకు యువత ఉత్సాహంగా కదులుతోంది.

రూ. 2 లక్షల ప్రమాద బీమా...
పార్టీ సభ్యత్వం తీసుకునే ప్రతి ఒక్కరికీ రూ.2లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలందరి కుటుంబాలకు భరోసానిచ్చేందుకు బీమా సౌకర్యం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని పార్టీ ఎల్లవేళలా కంటికిరెప్పలా చూసుకుంటుందనే సందేశం ఇచ్చేందుకు బీమా సౌకర్యం కూడా ఓ కారణంగా పేర్కొనవచ్చు. ప్రతి నియోజకవర్గం నుంచి 50వేలకు తగ్గకుండా సభ్యత్వాలను నమోదు చేయించేందుకు ఇన్‌చార్జులు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలను సమన్వయం చేసుకుంటూ అధిష్ఠానం నిర్దేశించిన లక్ష్యాలను నియోజకవర్గాల బాధ్యులు చేపడుతున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 65శాతం సాధారణ, 35 శాతం క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేస్తున్నారు. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త ఉండాలనే లక్ష్యంతో పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించేందుకు బలమైన కార్యకర్తల అండ ఉండాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...