మయూరీ పార్కును అద్భుతంగా తీర్చిదిద్దుతాం


Thu,June 20, 2019 02:19 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని మయూరీ ఏకో పార్కును అనతికాలంలోనే మహాద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం మయూరీ ఏకో పార్కును అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం, ఎండీ మనోహర్, జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌లతో కలిసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మయూరీ పార్కులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై చర్చించారు. అదేవిధంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మయూరీ పార్కును మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఉన్నతాధికారులను ఇక్కడికి తీసుకురావడం జరిగిందన్నారు. ఎవరూ ఊహించని స్థాయిలో మయూరీ పార్కును అభివృద్ధి చేసి జిల్లాకు మరింత పేరుప్రఖ్యాతలు తీసుకొస్తామన్నారు. మన జిల్లానే కాదు ఇతర జిల్లాలతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి కూడా ప్రజలు మయూరీ పార్కును సందర్శించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. పార్కులో రెయిన్ ఫారెస్టు, వాటర్ ఫాల్స్, వ్యూ పాయింట్, బట్టర్ ైఫ్లె గార్డెన్, రాశి, నవగ్రహ, నక్షత్రా వనాలు, నైట్ క్యాంపింగ్ సౌకర్యం, బాల్ వాటర్ ఫౌంటెన్, అడ్వెంచర్స్ టూరిజం, సస్పెషన్ బ్రిడ్జి సఫారీ వాక్, మ్యూజికల్ లైవ్ ఎనిమల్స్ వాటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

అభివృద్ధి అంటే ఇదనేలా చేసి చూపిస్తాం..
ఉమ్మడి రాష్ట్రంలో నోటి మాటలకే అభివృద్ధి పనులు పరిమితమైన విషయం అందరికీ తెలిసిందేనని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్ వద్ద మినీ శిల్పారామం ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం, ఎండీ మనోహర్‌లతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలు పెట్టడానికి కూడా వీల్లేని స్థితిలో ఉన్న పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్ది ఈ ప్రాంతాన్ని ప్రతిరోజు ప్రజలు సందర్శించేలా అభివృద్ధి చేశామన్నారు. మున్ముందు మినీ ట్యాంక్‌బండ్ వద్ద మినీ శిల్పారామంను ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన వెంటనే పాలమూరు ఎత్తిపోతల పథకం పనులను మరింత వేగంగా చేసేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో గంగారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ కోరమోని వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...