వివాహాల నమోదు తప్పనిసరి


Wed,June 19, 2019 02:19 AM

-డీడబ్ల్యూవో శంకరాచారి
మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : వివాహాలను తప్పనిసరిగా దంపతులు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డీడబ్ల్యువో శంకరాచారి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో వివాహాల తప్పనిసరి నమోదు చట్టం-2002పై శిక్షణ, అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, మహబూబ్‌నగర్‌ జిల్లా వారి ఆధ్వర్యంలో ఎంపీడీఓలు, తాసిలార్లు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్‌ పరిధిలో మున్సిపల్‌ కమిషనర్‌, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు రిజిస్ట్రేషన్‌ అధికారులుగా ఉంటారని, వివాహం జరిగిన తేదీ నుంచి 30 రోజులలోపు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని, అధికారులు ఒక రిజిసర్‌ ఏర్పాటు చేసి అందులో వరుడు, వధువులకు సంబంధించిన పూర్తి సమాచారం నమోదు చేయాల్సి ఉంటుందని అన్నారు. వరుడు, వధువు పేరు, తండ్రి పేరు, విద్యార్హతలు, కులం, పుట్టిన తేది, స్థలం వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ వివాహ చట్టంపై పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోని వారికి పూర్తి అవగాహన కల్పించాలని వివాహం రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే ప్రభుత్వం చేపట్టిన పథకాలు పొందుటకు అవకాశం కలుగుతుందని స్పష్టం చేశారు. ఈ చట్టం ద్వారా మహిళలకు వ్యక్తిగత భద్రత లభిస్తుందని, బహుభార్యత్వాన్ని నిలువరించడానికి విడాకులు పొందకుండా రెండో వివాహం చేసుకునేందుకు ఎవరిని మోసగించుటకు అవకాశం లేకుండా అవుతుందని పేర్కొన్నారు. ఆ శాఖ కోఆర్డినేటర్‌ అరుణ మాట్లాడుతూ వివాహం రిజిస్ట్రేషన్‌ చేయించుకునేటప్పుడు నిర్లక్ష్య ధోరణితో, ఉద్దేశ పూర్వకంగా, మోసపూరితంగా తప్పుడు సమాచారం అందిస్తే వారికి రూ.వెయ్యి జరిమానా, ఏడాది జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. మ్యారేజీ రిజిస్ట్రేషన్‌ నిమిత్తం దరఖాస్తు వచ్చిన తర్వాత అధికారులు నిర్లక్ష్యం వహిస్తే రూ.వెయ్యి జరిమానా, 3 నెలల జైలుశిక్ష విధించడం జరుగుతుందనే విషయాన్ని గమనించాలన్నారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చిన దరఖాస్తులపై పంచాయతీ కార్యదర్శులు వారిస్థాయిలో ప్రాథమిక విచారణ జరిపించాలన్నారు. జిల్లా, మండల స్థాయిలో మానిటరింగ్‌ కమిటీలు ఉంటాయని తెలిపారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...