దేశాశకే ఆదర్శం


Tue,June 18, 2019 01:35 AM

-చదువుతోనే ఉన్నత స్థానానికి చేరొచ్చు
-తెలంగాణ గురుకుల పాఠశాలలు దేశానికి ఆదర్శం
-రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
మహబూబ్‌నగర్‌ తెలంగాణ చౌరస్తా : కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్‌ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం మండలంలోని ధర్మాపూర్‌ గ్రామంలో మన్యంకొండ బీసీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చదువుతోనే ఉన్నత స్థానానికి వెళ్లవచ్చన్నారు. మహిళల చదువులకు మూల కారణం జ్యోతిబాయి పూలేనన్నారు. మొట్టమొదట ఉపాధ్యాయురాలిగా ఆమె మహిళలకు అక్షరాలు నేర్పించారని, ఆమెను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు కష్టపడి చదివి తమ తల్లిదండ్రులను, గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఒకప్పుడు హాస్టళ్లలో చదవాలంటే పిల్లలు పారిపోయే వారని, హాస్టళ్లలో వసతులు లేక చాలీచాలని తిండితో గతిలేక హాస్టళ్లలో ఉండి చదువుకునే వారన్నారు. ఇంటి దగ్గర చదివించే స్థోమత లేని విద్యార్థులు కష్టపడి చదువుకునే వారని గుర్తు చేశారు. నేడు తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు స్వయంగా తామే హాస్టల్‌ విద్యా ర్థులకు ఎలాంటి భోజనం అందించాలని మెనూను తయారు చేశారన్నారు. నెలకు రెండు సార్లు మేక మాంసం, నాలుగుసార్లు కోడి మాంసం, రోజు గుడ్డు, పప్పు, సాంబర్‌, ఉదయం అల్పాహారం, పండ్లు, రాగి జావా వంటి ఎంతో నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. నేడు ఉన్నత కులాల పిల్లలు చదివే హాస్టళ్లకంటే మెరుగ్గా ప్రభుత్వ గురుకులాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నార న్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, కేజీ టు పీజీ వరకు విద్యను అందిస్తున్నారన్నారు. నేడు రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలను ప్రారంభించడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. విద్యార్థులు గురుకులాలను ఉపయోగించుకొని ఉన్నత చదువులు చదివి ప్రతి ఒక్కరూ ఒక శాస్తవేత్తగా, డాక్టర్స్‌గా, కలెక్టర్లుగా తయారు కావాలని సూచించారు. చదువుతోపాటు స్పోర్ట్స్‌లో కూడా విద్యార్థులకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో గురుకుల విద్యార్థులు ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని సూచించారు. పాలమూరు జిల్లాను చదువుల జిల్లాగా తీర్చిదిద్దడానికి రాత్రి, పగలు కష్టపడి జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే పాలమూరు జిల్లాను రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు, ఎంపీపీ సావిత్రి, సుధాశ్రీ, జెడ్పీటీసీ శ్రీదేవి, జెడ్పీ కోఆప్షన్‌ మెంబరు అల్లావుద్దీన్‌, రైతు సమన్వయ సమితి డైరెక్టర్‌ మల్లు నర్సింహారెడ్డి, ఎంపీటీసీలు, మణెమ్మ, రవీందర్‌రెడ్డి, బీసీ గురుకుల ప్రిన్సిపల్‌ కృష్ణకుమార్‌, కోఆర్డినేటర్‌, సర్పంచులు యుగంధర్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, శ్రీకాంత్‌ గౌడ్‌, ఆంజనేయులు, నాయకులు రవీందర్‌ రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...