గురుకులం భవిష్యత్‌కు సోపానం


Sun,June 16, 2019 02:24 AM

-రేపు జిల్లాలో నూతనంగా మూడు బీసీ గురుకులాల ప్రారంభం
-సరికొత్త అలోచనలతో గురుకుల పాఠశాలల పెంపు
-5,6,7 తరగతుల నూతన గురుకులాలు ఆరంభం...తరగతికి 80 సీట్లు
-ప్రత్యేక శిక్షణలు తీసుకుంటు గురుకులాల సీట్ల కోసం విద్యార్థుల పోటీ
-ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసుకుంటు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : నిరుపేద విద్యార్థులకు గురుకుల పాఠశాలలు విద్యాకుసుమాలుగా మారాయి. మా బిడ్డకు గురుకుల సీటు వస్తే చాలు.. మా బిడ్డకు ఉద్యోగం తప్పనిసరి.. అనే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం విశ్వప్రయాత్నాలు చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పేద విద్యార్థుల జీవితాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అణతికాలంలో తీసుకువచ్చిన గురుకులాల పాఠశాలల విద్యార్థుల తలరాతను మార్చే దివ్య ఔషధంలా మారాయి. అందుకే తల్లిదండ్రులు తమ బిడ్డకు గురుకులాల సీటు తమకు కావాలనే విధంగా గురుకులాల కార్యాలయాల చుట్టూ అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా బీసీ గురుకులాలు విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోదనతో అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 119 బీసీ గురుకుల పాఠశాలలు సోమవారం ఆరంభించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా పక్కా ప్రణాళికలతో విద్యార్థులకు విద్యా బోధన చేసేందుకు అధికారులు అవసరమైన ప్రణాళికలతో అడుగులు వేస్తున్నారు.

జిల్లాలో మూడు ప్రాంతాల్లో గురుకులాలు
బీసీ గురుకులాల పాఠశాలలు సోమవారం జిల్లాలో మూడు ప్రారంభంకానున్నాయి. సీసీ కుంటకు మంజూరైన బీసీ గురుకుల పాఠశాల మంజూరైనా అక్కడ అనువైన భవనం, స్థలం లేకపోవడంతో దేవరకద్ర పట్టణ కేంద్రంలోనే ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే నవాబ్‌పేట మండల కేంద్రానికి బీసీ గురుకులం మంజురైనా వివిధ కారాణాలతో జడ్చర్లలో.., మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం మన్యంకొండ గురుకుల పాఠశాల పేరుతో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో అవసరాలను ప్రత్యేకంగా పరిశీలించి విద్యార్థులకు పూర్తిస్థాయిలో మేలు జరిగే విధంగా అనుకూలమైన భవనాలను అద్దెకు తీసుకుని నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు.

తరగతిలో 80 సీట్లు
నూతనంగా ప్రారంభంకానున్న బీసీ గురుకులాల పాఠశాలలో సోమవారం 5,6,7 తరగతులు ఆరంభం కానున్నాయి. ఈ క్రమంలో ఒక్క తరగతిలో 80 సీట్లు ఉంటాయి. ఒక్కో గురుకులాల పాఠశాలలో 240 మంది విద్యార్థులు గురుకులాలలో విద్యాభ్యాసం చేయనున్నారు. ఈ క్రమంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు సౌకర్యవంతమైన భవనాలను, అన్ని వసతులను ఇప్పటికే అధికారులు కల్పించారు. అనువుగా ఉన్న భవనాలను అద్దెకు తీసుకున్నారు. రెండేళ్ల కిందట బీసీ గురుకుల పాఠశాల నియోజకవర్గంలో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అక్కడ విజయవంతంగా కొనసాగుతుండటంతో మరికొన్ని చోట్ల ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

గురుకులాల హవా
మండలం, జిల్లా, కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గురుకులాలు ఏర్పాటవుతూ వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకులాల పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. కార్పొరేట్‌ స్థాయిలో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన, వసతులు కల్పిస్తున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో ఈ డిమాండ్‌ను మరింత విద్యార్థులకు చేరువ చేసేందుకుగాను తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తోంది. భవిష్యత్తులో మరిన్ని గురుకుల పాఠశాలలు రావాలి.. మరింత నిరుపేద విద్యార్థులకు ఈ గురుకుల పాఠశాలలు చేయూతనివ్వాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

బీసీ గురుకులాల ఏర్పాటుకు సిద్ధం
నూతనంగా సోమవారం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 గురుకుల పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. ఒక్క గురుకుల పాఠశాల రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మూడు గురుకులాలు ఏర్పాటు కానున్నాయి. అయితే గురుకులాలు మంజూరైన ప్రాంతాల్లో అనువుగా భవనాలు, స్థలాలు లేకపోవడంతో ప్రస్తుతానికి నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యవంతంగా ఉండే విధంగా భవనాలను అద్దెకు తీసుకున్నాం. ప్రతి గురుకుల పాఠశాలను మరింత ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్వహిస్తాం.
- లింగయ్య, బీసీ గురుకుల రీజియన్‌ కోఆర్డినేటర్‌, మహబూబ్‌నగర్‌

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...