బడిగంట మోగిన వేళ


Thu,June 13, 2019 01:50 AM

- పండుగ వాతావరణలో
పాఠశాలలు పునఃప్రారంభం
- తోరణాలతో అందంగా ముస్తాబు
- పూలు, చాక్లెట్లు ఇచ్చి విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు
స్టేషన్ మహబూబ్‌నగర్ : మోగిన బడిగంట.. బడి బాట పట్టిన విద్యార్థులు.. వేసవి సెలవుల్లో ఆడుతూ.. పాడిన.. విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమయ్యారు. బుధవారం విద్యార్థులు పాఠశాలలకు రావటంతో రోడ్లు కళకళలాడాయి. కొందరు బస్సుల్లో వస్తే.., మరి కొందరు విద్యార్థులను వారి తల్లిదండ్రులు వాహనల్లో తీసుకవచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను అందగా ముస్తాబు చేశారు. మామిడి తోరణులు, కొబ్బరి మట్టలు, అరటి కొమ్మలతో అలంకరించారు. పాఠశాలల్లో విద్యార్థులకు పూలు, చాక్లెట్లు ఇచ్చి ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. మరో పక్క ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయులు బడిబాటపై దృష్టి సారించారు. పట్టణంతో పాటు గ్రామల్లో బడిబాటకు సంబంధించి బ్యానర్లు ముద్రించి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు ప్రజానిధులు భాగస్వాములు చేయడంతో బడిబాట కార్యక్రమం పండుగ కొనసాగుతుంది. విద్యాశాఖ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించింది.

జిల్లాలో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో మొత్తం 1,867 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,358 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ఇందులో 1,37,856 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. 500లకుపైగా ప్రైవేటు పాఠశాలల్లో 1,09,085 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే పుస్తకాలను సిద్ధం చేశారు. జిల్లాకు 9,21,934 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా 8,88,380 పాఠ్యపుస్తకాలు ఇప్పటికే అన్ని పాఠశాలలకు చేరుకున్నాయి. పాఠ్యపుస్తకాల సరఫరాను జిల్లా విద్యాధికారి రాజేశ్ పరిశీలించారు. వీటితో పాటు అందరు విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు అందిస్తున్నారు.

హోరెత్తనున్న బడిబాట
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు భారీగా నిధులు సమకూర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను గాడిలో పెట్టేందుకు అదే స్థాయిలో దృష్టి సారిస్తున్నారు. అన్ని పాఠశాలలు బడిబాటపై ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నాయి. ప్రతి గ్రామంలోనూ బడిబాటకు సంబంధించి బ్యానర్ ముద్రించి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అన్ని గ్రామాల్లోనూ ప్రజా ప్రతినిధులను సైతం భాగస్వామ్యం చేయడంతో బడిబాట కార్యక్రమం పండుగలా సాగనున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల ఉచిత యూనిఫారం, వారానికి 3 గుడ్లు, సన్న బియ్యంతో అందించే నాణ్యమైన మధ్యాహ్న భోజనం, అవసరమైన చోట ఆంగ్ల మాధ్యమంలో విద్య, అత్యంత నాణ్యమైన విద్యా బోధన, అర్హులైన ఉపాధ్యాయులు.. ఈ వివరాలన్నింటినీ వివరిస్తూ విద్యార్థులను పెద్ద ఎత్తున ప్రభుత్వ బడుల్లో చేర్చేందుకు ప్రచారం సాగనున్నది. ఐదు రోజులపాటు ఈ బడిబాట కార్యక్రమాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తారు.
పాఠశాలలపై దృష్టి సారించాలి
పట్టణ కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని పలువురు కోరారు. మంచి బోధన అందిస్తేనే విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది?

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...