బడి యాైళ్లెంది


Wed,June 12, 2019 02:52 AM

- నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు
- తోరణాలతో సుందరంగా భవనాల ముస్తాబు
- జిల్లాలో మొత్తం .. పాఠశాలలు
- ముందుగానే చేరిన పాఠ్యపుస్తకాలు
- విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా టీచర్లు
- ఈనెల 14 నుంచి 19 వరకు బడిబాట
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : సంతోషంగా సరదాగా వేసవి సెలవులు గడిపిన చిన్నారులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. వేసవి సెలవుల్లో మూగబోయిన బడిగంట ఇక మోగనుంది. పాఠశాలల బస్సులతో రోడ్లన్నీ రద్దీగా మారనున్నాయి. ఇప్పటికే పుస్తకాలు, దుస్తులు, బ్యాగుల కొనుగోళ్లతో దుకాణాలన్నీ కిక్కిరిస్తున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. సర్కారు బడులు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. తోరణాలతో ముస్తాబైన సర్కారు బడులు విద్యార్థులను ప్రేమగా ఆహ్వానిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు గాను ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.

తోరణాలతో ఆకట్టుకుంటున్న పాఠశాలలు
సర్కారు బడుల్లో క్రమంగా వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న సర్కారు విద్యార్థులను ఆకట్టుకునేలా వారికి స్వాగతం కూడా చెప్పేందుకు రెడీ అయ్యింది. వేసవి సెలవుల అనంతరం బడికి వచ్చే విద్యార్థులకు ఇవాళ పచ్చని తోరణాలు స్వాగతం పలుకనున్నాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తోరణాలు ఏర్పాటు చేశారు. తరగతి గదులకు పెయింటింగ్ వేయిస్తున్నారు. చిన్నారులను ఆకట్టుకునేలా వివిధ రాకల బొమ్మలను చిత్రీకరిస్తున్నారు. వివిధ రకాలుగా పాఠాశాలలను ముస్తాబు చేసి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు మంగళవారం నుంచే పాఠశాలల వద్ద ముస్తాబు పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీవీబీలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, అన్ని సర్కారు బడులు విద్యార్థుల కోసం అందంగా ముస్తాబయ్యాయి. స్వాగత తోరణాలతో పాఠశాలల వద్ద పండుగ వాతావరణం నెలకొన్నది.

పాఠశాలలకు చేరిన పుస్తకాలు
జిల్లాలో మొత్తం 1867 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,358 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ఇందులో 1,37,856 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇక 490కిపైగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 1,09,085 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 2,46,941 మంది విద్యార్థులు చదువుతున్నారు.

పాఠ్యపుస్తకాలు సిద్ధం
ప్రభుత్వ పాఠశాలల్లో చదవే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే పుస్తకాలను సిద్ధం చేశారు. జిల్లాకు 9,21,934 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా.. 8,88,380 పాఠ్యపుస్తకాలు ఇప్పటికే అన్ని పాఠశాలలకు చేరుకున్నాయి. విద్యార్థులకు అందించే పాఠ్యపుస్తకాలను విద్యార్థుల ఆధార్ సంఖ్య ఆధారంగా విడుదల చేశారు. దీనికి సంబంధించి మండలాల నుంచి సైతం ఆధార్ ఆధారంగానే ఇండెంట్ తీసుకుని సరఫరా చేశారు. పాఠ్యపుస్తకాల సరఫరాను జిల్లా విద్యాధికారి రాజేశ్ పరిశీలించారు. వీటితో పాటు అందరు విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు అందిస్తున్నారు.

ప్రైవేటు పాఠశాలలు సైతం
జిల్లాలోని సుమారు 490 ప్రైవేటు పాఠశాలల్లో 1,09,085 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది దాదాపు అన్ని ప్రైవేటు పాఠశాలలు సైతం ప్రభుత్వం ఆదేశించిన మేరకు బుధవారం నుంచే పాఠశాలలను తెరుస్తున్నాయి. పుస్తకాలు, నోట్ పుస్తకాలు అంటూ విద్యార్థులు దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. దుస్తులు, బ్యాగుల కొనుగోళ్లతో దుకాణాలన్నీ కిక్కిరిస్తున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ వారికి అడ్మిషన్లు ఇస్తున్నాయి. బడులకు వెళ్లే విద్యార్థులతో ప్రైవేటు పాఠశాలల వద్ద సైతం సందడి ప్రారంభం కానున్నది. క్యూలో నిలబడి ఫీజులు కట్టేందుకు తల్లిదండ్రులు సిద్ధం అవుతున్నారు. ఫీజులు భారంగా మారుతున్నప్పటికీ ప్రైవేటు విద్య కోసం పలువురు తల్లితండ్రులు భారాన్ని మోస్తున్నారు.

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేటడంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను 14 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే బడిబాటలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుల భాగస్వామ్యంతో నిర్వహిస్తారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 14న మన ఊరు మన బడి, 15న బాలికా విద్య, 17న సామూహిక అక్షరాభ్యాసం, 18న స్వచ్ఛ పాఠశాల, 19న పాఠశాల యాజమాన్య కమిటీ, బాలకార్మికుల విముక్తి అనే అంశాలు ప్రధానంగా బడిబాట కార్యక్రమం కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, బడి బయట పిల్లలు లేకుండా చూడటం, విద్యా హక్కు చట్టం ప్రకారం అందరికీ సమాన, నాణ్యమైన విద్య అందించడం, విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడం. ఈ కార్యక్రమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. జిల్లా అధికారులు సైతం ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నారు.

హోరెత్తనున్న బడిబాట
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు భారీగా నిధులు సమకూర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రభుత్వ పాఠశాలలను గాడిలో పెట్టేందుకు అదే స్థాయిలో దృష్టి సారిస్తున్నారు. అన్ని పాఠశాలలు బడిబాటపై ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నాయి. ప్రతి గ్రామంలోనూ బడిబాటకు సంబంధించి బ్యానర్ ముద్రించి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అన్ని గ్రామాల్లోనూ ప్రజా ప్రతినిధులను సైతం భాగస్వామ్యం చేయడంతో బడిబాట కార్యక్రమం పండుగలా సాగనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల ఉచిత యూనిఫారం, వారానికి 3 గుడ్లు, సన్న బియ్యంతో అందించే నాణ్యమైన మధ్యాహ్న భోజనం, అవసరమైన చోట ఆంగ్ల మాధ్యమంలో విద్య, అత్యంత నాణ్యమైన విద్యా బోధన, అర్హులైన ఉపాధ్యాయులు.. ఈ వివరాలన్నింటినీ వివరిస్తూ విద్యార్థులను పెద్ద ఎత్తున ప్రభుత్వ బడుల్లో చేర్చేందుకు ప్రచారం సాగనున్నది. 5 రోజుల పాటు ఈ బడిబాట కార్యక్రమాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తారు.

అత్యుత్తమ విద్యను అందిస్తున్నాం
- జి.రాజవర్దన్, హెచ్‌ఎం, బోయపల్లి పీఎస్, మహబూబ్‌నగర్
ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరుతున్నారు. అందుకోసం మా వంతుగా కృషి చేస్తున్నాం. ఉచిత పుస్తకాలు, ఉచితంగా స్కూల్ యూనిఫారం, వారానికి 3 గుడ్లతో నాణ్యమైన భోజనం, చక్కని లైబ్రరీని విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తోంది. ప్రస్తుతం మా పాఠశాలలో 337 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది మరో 70 మంది విద్యార్థులు వస్తారని భావిస్తున్నాం. బడిబాట కార్యక్రమం ద్వారా మరింత మంది విద్యార్థులు వచ్చేలా కృషి చేస్తాం. విద్యార్థులకు రెగ్యులర్‌గా చెప్పే పాఠాలతో పాటు గురుకుల విద్యాలయాల్లో చేర్చేందుకు గాను పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం. చాలా మందికి సీట్లు వస్తున్నాయి. అందుకే కొత్తగా ప్రైవేటు నుంచి కూడా విద్యార్థులు మా బడికి వస్తున్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...