అభివృద్ధిలో భాగస్వాములు కావాలి


Wed,June 12, 2019 02:48 AM

-జెడ్పీ చైర్ పర్సన్లతో సీఎం కేసీఆర్
-అగ్రగామి జెడ్పీలకు ప్రత్యేక నిధులు
-గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దండి
-ప్రజా సంక్షేమానికి కృషి చేయండి
-జిల్లా పరిషత్ చైర్ పర్సన్లకు సీఎం దిశానిర్దేశం
-ఆదర్శవంత పాలనకు సిద్ధమంటున్న పాలమూరు జెడ్పీ చైర్ పర్సన్లు
మహబూబ్ నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : నూతన జిల్లా పరిషత్ చైర్ పర్సన్లుగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆదర్శంగా ఉంటూ అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్ చైర్ పర్సన్లతో పాటు ఉమ్మడి పాలమూరుకు చెందిన 5 మంది చైర్‌పర్సన్లు సైతం సీఎం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. జెడ్పీ చైర్ పర్సన్లు అయ్యాక తొలిసారి సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో ఈ మేరకు సీఎం వారికి అభివృద్ధి నమూనాను వివరించారు. గ్రామాల వికాసానికి కృషి చేయడంలో అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్‌లకు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రత్యేక ప్రగతి నిధి నుంచి రూ.10 కోట్లు మంజూరు చేస్తామని వారికి వివరించారు. గంగిదేవిపల్లి, ముల్కనూరు, అంకాపూర్ వంటి ఆదర్శ గ్రామాలకు దీటుగా మిగతా అన్ని గ్రామాలు మారాలని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. పంచాయతీరాజ్ చట్టం వల్ల గ్రామాలు ఎక్కడికక్కడ అభివృద్ధి చెందుతాయని సీఎం జెడ్పీ చైర్ పర్సన్లకు వివరించారు. వివిధ అంశాలపై శిక్షణ తీసుకుని అయినా అవగాహన సాధించాలని సూచించారు. ఇకపై గ్రామాల్లో అత్భుతమైన రీతిలో పాలన కొనసాగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పదవిని బాధ్యతగా భావించాలని ముఖ్యమంత్రి సూచించారు. అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్‌తో తొలిసారి సమావేశం అయ్యేందుకు అవకాశం రావడంపై జెడ్పీ చైర్ పర్సన్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌తో సమావేశంలో పాల్గొన్న వీరికి మరుసటి రోజే సమావేశంలో పాల్గొనే అవకాశం లభించింది. కొత్తగా ఎంపికైన ప్రజా ప్రతినిధులు సరైన రీతిలో పాలన అందించేందుకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడనుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం..
కొత్తగా ఎంపికైన జెడ్పీ చైర్ పర్సన్లు స్వర్ణ సుధాకర్ రెడ్డి, వనజ, పద్మావతి, సరిత, లోక్‌నాథ్ రెడ్డి మొదట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. పార్టీ పరంగా ఆయన వారికి సూచనలు చేశారు. ఉమ్మడి జిల్లాలో అన్ని పదవుల్లోనూ టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులే ఉన్నారని... అందరూ కలిసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. రెండో రోజు సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశంలోనూ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్లు పాల్గొన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి పంచాయతీరాజ్ చట్టం అత్భుతంగా పనిచేస్తుందని, అందరూ ఈ చట్టాన్ని సద్వినియోగం చేస్తూ పల్లెల్లో అత్భుతాలు చేయాలని సీఎం సూచించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర రూపురేఖలు మార్చాలని, అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం తమకు సూచించినట్లు జెడ్పీ చైర్ పర్సన్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ సందేశం తమకు ఎంతో స్ఫూర్తిని రగిలించిందని తెలిపారు. ప్రభుత్వం సహకారంతో తమ జిల్లాల్లో ప్రగతిని పరుగులు పెట్టిస్తామంటున్నారు. అటు జిల్లాల్లో అభివృద్ధి పనులతో పాటు పార్టీ అభివృద్ధి కోసం సైతం పనిచేస్తామంటున్నారు. ముఖ్యమంత్రితో సమావేశం పరిపాలనలో తమకు ఎంతో ఉపయోగపడుతుందని చైర్ పర్సన్లు పేర్కొంటున్నారు.

తండ్రి తన పిల్లలకు జాగ్రత్తలు చెప్పినట్లుగా..
- స్వర్ణ సుధాకర్ రెడ్డి, నూతన జెడ్పీ చైర్మన్ మహబూబ్ నగర్
జెడ్పీ చైర్ పర్సన్‌గా ఎన్నికైన తర్వాత మొదటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశం అయ్యాయి. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యే అవకాశం లభించింది. రాష్ట్రంలోని 32 జిల్లాల నుంచి చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లు అంతా కలిసి సీఎంతో జరిగిన సమావేశంలో పాల్గొన్నాం. ఓ తండ్రి తన పిల్లలకు జాగ్రత్తలు చెప్పినట్లుగా పరిపాలన అంశాలపై ముఖ్యమంత్రి మాకు మార్గనిర్దేశం చేశారు. అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. ఏదైన పనుండి కార్యాలయానికి వచ్చే వారి సమస్యలను ఓపికగా వినాలని, సాధ్యమైనంత వరకు వారికి న్యాయం చేయాలని సీఎం సూచించారు. పంచాయతీరాజ్ చట్టం చరిత్రే మాకు పూర్తిగా వివరించారు. అధికారులు, సిబ్బంది నుంచి మంచి పనితనాన్ని వెలికి తీయాలన్నారు. అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి మాకు వివరించారు. మనం పనిచేసి మిగతా వారికి మార్గదర్శకంగా ఉండాలన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...