పరిషత్ లెక్కింపు వాయిదా


Sat,May 25, 2019 02:05 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి: పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27న కౌంటింగ్‌ను నిర్వహించాలని ఏర్పాట్లు పూర్తి చేసిన సంగతి విధితమే. అయితే, కౌంటింగ్ అనంతరం ఎంపీపీలను ఎన్నుకునేందుకు దాదాపు నెల రోజులు గడువున్నందునా ఇబ్బందులు ఉంటాయని భావించిన ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. దీనిపై పరిషత్ కౌటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కౌంటింగ్ తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామన్నది తర్వాత ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దీంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. మూడు విడతల్లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 71 జెడ్పీటీసీ స్థానాలకు 294 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అదేవిధంగా 709 ఎంపీటీసీ స్థానాలకు 2,352 మంది పోటీ చేశారు. పరిషత్ ఎన్నికల్లో 2,646 మంది పోటీ పడ్డారు. మరో రెండు రోజుల్లో ఫలితాలు వెలువడతాయన్న క్రమంలో పోటీదారుల్లో ఫలితాలపై ఉత్కంఠత ఉన్నా.. ఎన్నికల కమిషనర్ నిర్ణయంతో ఆశలు నిరాశయ్యాయి. ఇదిలా ఉండగా బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంల్లో మరిన్ని రోజులపాటు భద్రం చేయాల్సి వస్తుంది. ఇప్పటికే ఆయా కేంద్రాల వద్ద అవసరమైన బారికేడ్లు, టేబుళ్ల ఏర్పాటు పనులను దాదాపు పూర్తి చేశారు. అదేవిధంగా పరిషత్ ఎన్నికల లెక్కింపునకు అధికారులు, సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేసి కౌంటింగ్‌కు సిద్ధమైన వేళ వాయిదా పడటం అందరిని విస్మయానికి గురి చేసింది.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...