పాలమూరులో హ్యాట్రిక్


Fri,May 24, 2019 04:35 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: మహబూబ్‌నగర్ ఎంపీగా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన డీకే అరుణపై 77,829 ఓట్ల భారీ తేడాతో విజయదుందుబీ మోగించారు. ఎంపీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన మన్నె కనీ విని ఎరుగని రీతిలో భారీగా ఓట్లు సాధించారు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న మాజీ మంత్రి డీకే అరుణపై మన్నె విజయం సాధించడంపై టీఆర్‌ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పాలమూరు పార్లమెంట్ స్థానంలో వరుసగా టీఆర్‌ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించింది. సర్జికల్ ైస్ట్రెక్ పేరిట ఎన్నికల ముందు హంగామ చేసి ఆ అంశాన్ని సైతం రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ దేశవ్యాప్తంగా చక్కని ఫలితాలను సాధించినా.. మహబూబ్‌నగర్‌లో మాత్రం పప్పులుడకలేదు. ఎంపీగా గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి రొనాల్డ్‌రోస్ నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్న వెంటనే మన్నె శ్రీనివాస్‌రెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. మన్నె శ్రీనివాస్‌రెడ్డికి పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి 4,11,402 ఓట్లు రాగా.. సమీప బీజేపీ ప్రత్యర్థి డీకే అరుణకు 3,33,573 ఓట్లు వచ్చాయి.

కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న వంశీచంద్‌రెడ్డి 1,93,631 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఈ విజయంతో గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మహబూబ్‌నగర్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్ పార్టీ వరుస విజయాలను నమోదు చేస్తోంది. గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్ ప్రస్తుతం గెలుపు సాధించడంతో ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించినట్లు అయింది. ఎంపీగా గెలిచిన మన్నె శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి, ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి సహా పార్టీ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. తొలిసారి ఎంపీగా పోటీ చేసిన మన్నె స్థానికుడు కావడం, సౌమ్యుడిగా పేరొందడం, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి.. అన్నీ కలిసి ఆయన గెలుపునకు దోహదం చేశాయని పార్టీ నేతలు పేర్కొన్నారు.

కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ పార్టీ ఆధిక్యంలో నిలిచింది. తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి 24,178 ఓట్లు రాగా, సమీప బీజేపీ ప్రత్యర్థి డీకే అరుణకు 17,228 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ వంశీచంద్‌రెడ్డికి 8,765 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. రెండో రౌండ్‌లోనూ ఇదే ఒరవడి కొనసాగింది. టీఆర్‌ఎస్ అభ్యర్థికి 23,194 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 18,398 ఓట్లు పోలయ్యాయి. ఇలా ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి దూసుకుపోయారు. పోస్టల్ బ్యాలెట్‌లోనూ కారు దూసుకుపోయింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి 902 ఓట్లు సాధించగా బీజేపీ అభ్యర్థికి 458 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 764 ఓట్లు రావడం విశేషం. 21, 22 రౌండ్లలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించగా ఆ రౌండ్లలోనూ తమకు ఆధిక్యం రాకపోవడం బీజేపీ శ్రేణులకు నిరాశ మిగిల్చింది.

మెజార్టీ రికార్డు సృష్టించిన మన్నె శ్రీనివాస్‌రెడ్డి
నారాయణపేట నమస్తే తెలంగాణ ప్రతినిధి: మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రంగంలో నిలిచిన మన్నె శ్రీనివాస్‌రెడ్డి రికార్డు సృష్టించారు. గురువారం వెలువడిన ఫలితాలలో తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై 78,120 భారీ మెజార్టీతో విజయం సాధించారు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత మెజార్టీతో ఎంపీగా ఎవరూ గెలువలేదు. 20 రౌండ్ల పాటు జరిగిన కౌంటింగ్‌లో ప్రతి రౌండ్‌లోనూ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఆధిక్యతను కనబరుస్తూ వచ్చారు. కాగా బీజేపీ అభ్యర్థికి 3,33,121 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి 1,93,513 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మిగిలిన స్వతంత్ర అభ్యర్థులు ఎవరూ చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లను సాధించలేక చతికిల పడిపోయారు.

2014 ఎన్నికల్లో తక్కువ మెజార్టీ నమోదు
2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఏపీ జితేందర్‌రెడ్డి 2,590 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జితేందర్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా నాగం జనార్దన్‌రెడ్డితోపాటు మరో ఆరుగురు పోటీ చేశారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డారు. మొదట్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తారని, ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందుతారని అంచనా వేశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జితేందర్‌రెడ్డి విజయం సాధించారు. జితేందర్‌రెడ్డికి 3,34,228 ఓట్లు రాగా, జైపాల్‌రెడ్డికి 3,31,638 ఓట్లు, నాగం జనార్దన్‌రెడ్డికి 2,72,791 ఓట్లు, పిరమిడ్ పార్టీ అభ్యర్థికి 30,388 ఓట్లు, బీఎస్పీకి 9,105 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థులు సయ్యద్ ఇబ్రహీం, చంద్రశేఖర్, శివశంకర్ ఒక్కొక్కరికీ 4వేలకు పైగా ఓట్లను సాధించారు.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...