బాధ్యతగా ఉండండి


Thu,May 23, 2019 01:20 AM

-నేడే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు
-41రోజుల నిరీక్షణకు నేటితో తెర
-వెలువడనున్న ఎంపీ అభ్యర్థుల భవిత
-ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం
-ప్రతి అసెంబ్లీకి 14టేబుళ్లు 19రౌండ్లు
-రెండు కేంద్రాల్లో కొనసాగనున్న లెక్కింపు
-విజయంపై ధీమాగా ఉన్న టీఆర్‌ఎస్
-పోటీలో 11మంది అభ్యర్థులు..
-మొత్తం ఓటర్లు 15,87,281మంది..
-పోలైనవి 9,92,226 ఉత్కంఠకు నేటితో తెర
నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. పార్లమెంట్ పరిధిలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, గద్వాల, అలంపూర్, వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్లలోని 1871పోలింగ్ కేంద్రాల పరిధిలోని 15,87,281మంది ఓటర్లకు గాను ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో 62.51శాతం చొప్పున 9,92,226మంది ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఎన్నికల కోసం దాదాపు 10వేల మంది ఉద్యోగులు పని చేయగా 2,419బ్యాలెట్ యూనిట్లు, 2230కంట్రోల్ యూనిట్లు, 2336వీవీ ప్యాట్లను ఉపయోగించారు.

గోదాముల్లో ఈవీఎంలు
పోలింగ్ అనంతరం ఈవీఎం, వీవీప్యాట్, తదితర యంత్రాలను నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ మోడర్న్ బిఈడీ కళాశాల(ప్రధాన కేంద్రం), నెల్లికొండ మార్కెట్ గోదాంలకు తరలించారు. నెల్లికొండ కేంద్రం నుంచే అధికారికంగా ఫలితాలను అధికారులు వెల్లడిస్తారు. ఇక పోలింగ్ పూర్తైనప్పటి నుంచి ఈవీఎంలకు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు 14టేబుళ్లు
ఎన్నికల ఫలితాలను లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. కౌంటింగ్ కోసం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు 14టేబుళ్ల చొప్పున 351మంది సిబ్బందితో పాటుగా సహాయ సిబ్బంది, పోలీసులు కలిపి 1800మంది వరకు భాగం కానున్నారు. ఉద యం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తారు.

ఇంట్లో నుంచే ఫలితాలు
రౌండ్ల వారీగా అభ్యర్థులు సాధించిన ఓట్లను ఆర్‌వో, ఏఆర్‌వోల ద్వారా పరిశీలకులు ధ్రువీకరించాక ఎన్నికల నోడల్ అధికారి, నాగర్‌కర్నూల్ కలెక్టర్ శ్రీధర్ ధ్రువీకరణ చేశాక సువిధ అప్లికేషన్‌లో నమోదు చేస్తారు. ఇందులో నివేదించిన వెంటనే స్మార్ట్‌ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటిలో ఉండి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. సిబ్బందికి మాక్ కౌంటింగ్‌పై శిక్షణ ఇచ్చారు. రెండు స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ కెమెరాలు, బారికేడింగ్‌లు, 100మీటర్లలోపు హద్దులు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి సైతం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ప్రత్యేక రంగులతో కూడిన గుర్తింపు కార్డులను జారీ చేశారు. వైద్య సదుపాయాలను సైతం కల్పించారు. ఇక గద్వాల, వనపర్తి కలెక్టర్లు శశాంక, శ్వేతా మహంతితో పాటుగా ఎస్పీ లు సైతం ఏర్పాట్లలో భాగమయ్యారు.

తేలనున్న 11 మంది భవితవ్యం
నాగర్‌కర్నూల్ పార్లమెంట్(ఎస్సీ) స్థానానికి గాను మార్చి 18న నోటిఫికేషన్ వెలువడింది. దీంతో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటుగా పలువురు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 15మంది నామినేషన్లు వేయగా ఉపసంహరణ తర్వాత 11మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోతుగంటి రాములు, కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవి, బీజేపీ అభ్యర్థిగా బంగారు శృతితో పాటుగా పలువురు అభ్యర్థులు నామినేషన్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు.

ప్రచారం సాగిందిలా..
ఇక ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. ప్రధానంగా టీఆర్‌ఎస్ ప్రచారం పండుగలా జరిగింది. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటుగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలు, మాజీ మంత్రులు సహా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మార్కెట్, విండో, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లంతా టీఆర్‌ఎస్ అభ్యర్థి రాములు తరపున ఉధృత ప్రచారం చేపట్టారు. సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ సైతం వనపర్తిలో జరిగిన సభల్లో పాల్గొని టీఆర్‌ఎస్‌లో జోష్ తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీజేపీల ప్రచారం మాత్రం నిరుత్సాహంతో సాగింది. ఆయా పార్టీలకు క్యాడర్ లేక రాష్ట్ర స్థాయి నాయకులు సైతం పట్టించుకోకపోగా వచ్చిన కొందరి నేతల సభలు వెలవెలబోయాయి.

గెలుపుపై టీఆర్‌ఎస్ ధీమా
టీఆర్‌ఎస్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగగా ఇతర పార్టీల ప్రచారాలు వెలవెలబోయాయి. ప్రజలు కూడా సీఎం కేసీఆర్‌పై ఉన్న నమ్మకంతో అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల తరహాలో టీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతుగా నిలిచినట్లుగా పార్టీ శ్రేణుల్లో సంతోషాలు కనిపించాయి. ఈ ప్రచారంతో గురువారం వెలువడబోయే ఫలితాలు ఏకపక్షంగా మారనున్నాయనే ధీమా టీఆర్‌ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇక 41రోజుల సుదీర్ఘ విరామం తరువాత ఫలితాలు వెలువడనుండటంతో ఆయా అభ్యర్థులందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పోలైన ఓటింగ్ శాతం ప్రకారం తమ విజయావకాశాలపై అంచనాలు వేసుకొన్నారు.

ఈ ఫలితాల కోసం రాజకీయ వర్గాలతో పాటుగా ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. గ్రామాలు, పట్టణాల్లోనూ బెట్టింగ్‌లకు సైతం పాల్పడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద గురువారం నాడు ఫలితాలు వెలువడుతుండటంతో అభ్యర్థులతో పాటుగా నాయకులు, ప్రజలు, అధికార వర్గాలంతా కౌంటింగ్‌పై దృష్టి సారించారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...