చినుకు తడే తరువాయి


Tue,May 21, 2019 03:54 AM

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : రానున్న వానకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 14 మండలాల్లో ఉన్న 1,20,000 హెక్టార్లలో పలు రకాల పంటలను సాగు చేసేందుకు అధికారులు అవసరమైన ప్రణాళికలను రూపొందించి ప్రతిపాదనలను రాష్ట్ర అధికారులకు పంపారు. జిల్లాలో పలు రకాల పంటల సాగుకోసం 15,977 క్వింటాళ్ల విత్తనాలు, 1,35,322 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమవుతాయని గుర్తించిన అధికారులు వీటన్నింటినీ అందుబాటులో ఉంచేందుకు అవసరమైన చర్యలను తీసుకున్నారు. జూన్‌ మొదటి వారంలోపు విత్తనాలు, ఎరువులు అన్నివిధాలుగా రైతులకు అందుబాటులో ఉండేలా పక్కా ప్రణాళికలతో వ్యవసాయ శాఖాధికారులు ముందుకు సాగుతున్నారు.

1.20 హెక్టార్లలో సాగుకు సిద్ధం
జిల్లాలోని 14 మండలాల్లో సాగుకు సిద్ధంగా ఉన్న పొలాలలో 1,20,000 హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేసేందుకు వ్యవసాయ అధికారులు ప్రణాళికలను రూపొందించారు. ఈ సంవత్సరం కూడా రైతులు అధికంగా పత్తి, కంది, మొక్కజొన్న, జొన్న పంటలకు ప్రాధాన్యత ఇస్తారని భావించి ప్రణాళికలను సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 30,000 హెక్టార్లలో పత్తి, 12,000 హెక్టార్లలో కంది పంట సాగు కావచ్చని అంచనా.. 25,200 హెక్టార్లలో వరి, 9,500 హెక్టార్లలో జొన్న, 35,000 హెక్టార్లలో మొక్కజొన్న, పెసర, మినుములతోపాటు ఇతర పంటలు 5,000 హెక్టార్లలో సాగవుతాయని అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు.

అవసరమైన విత్తనాల వివరాలు
జిల్లాలో 1,20,000 హెక్టార్లలో సాగు కోసం 15,977 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయ ని వ్యవసాయ అధికారులు ఆయా కంపెనీలకు వివరాలు తెలిపారు. వరి 10,475 క్వింటాళ్లు, జీ లుగ 50 క్వింటాళ్లు, మొక్కజొన్న 4,000 క్విం టాళ్లు, కంది 400 క్వింటాళ్లు, పెసర, సన్‌ఫ్లవర్‌ ఇతర పంటలకు కలిపి 4,598 క్వింటాళ్లు, వేరుశనగ 50 క్వింటాళ్లు, ఆముదం 250 క్వింటాళ్ల చొ ప్పున అవసరమవుతాయని అంచనా వేశారు.

జిల్లాకు 1,35,322
మెట్రిక్‌ టన్నుల ఎరువులు
జిల్లాలో వానకాలం పంట సాగు కాలానికిగాను 1,35,322 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అధికారులు ప్రణాళికలను రూపొందించారు. యూరియా 61,342 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 25,206 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 48,774 మెట్రిక్‌ టన్నులు అవసరమవుతాయని అంచనా వేశారు.

మట్టి నమూనాల సేకరణలో బిజీబిజీ
జిల్లాలో ఆయా పొలాల సామర్థ్యాన్ని, పంటల సాగుకు అనుకూలమైన పరిస్థితులను అంచనా వేసేందుకు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా సమీక్షలు, సమావేశాలు జరుగుతున్నాయి. గ్రామ గ్రామాలలో రైతులకు అవగాహన కల్పిస్తుండడంతో అందుకు అనుగుణంగా రైతులు మట్టి నమూనాలను సేకరించి వ్యవసాయ శాఖ అధికారులకు అందజేసి భూసార పరీక్షలను చేయిస్తున్నారు. భూసార పరీక్షల ఫలితాల ప్రకారం ఆయా పొలాల్లో సాగు చేయాల్సిన పంటలను గురించి అధికారులు రైతులకు వివరిస్తున్నారు.

పంట పొలాల్లోకి ఒండ్రుమట్టి
సాగు చేస్తున్న పంటలు మరింత నాణ్యతగా దిగుబడి వచ్చేందుకు రైతన్నలు చెరువులు, కుంటల్లో పేరుకుపోయిన ఒండ్రుమట్టిని తమ తమ పంటపొలాల్లోకి తరలిస్తున్నారు. తరలించిన ఒండ్రుమట్టిని పంట పొలం అంత చల్లే పనిలో నిమగ్నమయ్యారు. ఇలా చేయడం వల్ల పొలం మరింత సారవంతంగా ఉంటూ పంట దిగుబడి అధికంగా వస్తుంది. ఈ క్రమంలో ఒండ్రుమట్టికి రైతన్నలు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ తమ తమ పంట పొలాలను ఒండ్రుమట్టితో మరింత బలోపేతం చేయడం చేస్తున్నారు.

నకిలీ విత్తనాలపై కొరడా..
నకిలీ విత్తనాల మార్కెట్‌ విస్తరించేందుకు ఇది సరైన సమయం. ఈ క్రమంలో నకిలీ విత్తనాల మూఠా రైతన్న పాలిట దశబ్దాల తరబడి శాపంగా మారిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం నకిలీ విత్తనాల విక్రయ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచింది. టాస్క్‌ఫోర్స్‌ అధికారులతోపాటు వ్యవసాయ అధికారులు ప్రత్యేకంగా నాసిరకం విత్తనాలు విక్రయించకుండా దృష్టి పెట్టారు. రైతులకు నాణ్యమైన విత్తనాలే అందేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

సబ్సిడీపై విత్తనాలు
సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేసేందుకు వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రధాన ఆహార పంటలతో పాటు వ్యాపార పంటలపై సైతం 50 నుంచి 65 శాతం వరకు సబ్సిడీని అందజేయనున్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...