మరుగుదొడ్ల నిర్మాణంలో వేగం పెంచండి


Fri,May 17, 2019 01:43 AM

-ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలి
-నారాయణపేట కలెక్టర్‌ వెంకట్రావు
నారాయణపేట, నమస్తే తెలంగాణ : స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా చేపడుతున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో పురోగతిని పెంచాలని నారాయణపేట కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని శీలా గార్డెన్స్‌ ఆవరణలో గురువారం జిల్లాలోని ఎస్‌బీఎం ఐహెచ్‌హెచ్‌ఎల్‌ఎస్‌లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. నారాయణపేట జిల్లా పరిధిలో 68,772 మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. మిగతా మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, సిబ్బందికి సూచించారు. మండల, గ్రామ స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించి, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ప్రజలలో చైతన్యం తీసుకురావాలన్నారు. ఎస్‌బీఎంలు డాటా ఎంట్రీలను వెబ్‌సైట్‌లలో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే, గ్రామాల్లో నీటి సమస్య ఏర్పడకుండా చూడాలన్నారు. హర్టికల్చర్‌లో భాగంగా రైతులకు పండ్ల తోటలు, పూల తోటలు, కూరగాయలు, వేప, చందనం వంటి మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్‌, డీఆర్డీవో రఘువీరారెడ్డి, డిప్యూటీ సీఈవో కాళిందినిరావు తదితరులు ఉన్నారు.

బడి బయటి పిల్లలను బడిలో చేర్పించాలి
ఐదేళ్లు నిండిన బడి బయటి పిల్లలను తప్పని సరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్‌ వెంకట్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో ఎంఈవోలు, పంచాయతీరాజ్‌ డీఈ, ఏఈలు, ఐసీడీఎస్‌, ఐసీపీఎస్‌లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జూన్‌ 1వ తేదీ నుంచి పాఠశాలలు పునర్‌ ప్రారంభమవుతాయని, జూన్‌ 2, 3 తేదీలలో విద్యార్థులకు పుస్తకాలను అందజేయాలని ఎంఈవోలకు సూచించారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని మండలాల వారిగా అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి సరిపడే స్థలాలను పరిలశీలించి రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలన్నారు. పంచాయతీరాజ్‌ డీఈలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు సమన్వయంతో పని చేసి అంగన్‌వాడీ భవనాల నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతుందో వివరణ ఇవ్వాలన్నారు. మావేశంలో శిశు సంక్షేమ శాఖ ఇన్‌చార్జి ప్రాజెక్టు డైరెక్టర్‌ జైపాల్‌రెడ్డి, ఈఈ నర్సింగ్‌రావు, ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ ఖాజాహుస్సేన్‌ తదితరులు ఉన్నారు.
కౌంటింగ్‌ ఏర్పాట్లపై సమావేశం
ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నిర్వహించనున్న కౌంటింగ్‌ ఏర్పాట్లపై కలెక్టర్‌ వెంకట్రావు ఎన్నికల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్‌ పక్కాగా జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...