వేటు తప్పదు..


Fri,May 17, 2019 01:43 AM

రాజాపూర్‌ : గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మా ణ లక్ష్యాన్ని పూర్తి చేయకపోతే సంబంధిత అధికారు లు, సిబ్బందిపై వేటు తప్పదని మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ హెచ్చరించారు. మండలంలో మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతి, మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరా, నర్సరీల నిర్వహణపై గురువారం రాజాపూర్‌ మండల కేంద్రంలో సర్పంచులు, మిషన్‌ భగీరథ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడా రు. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలు గా తీర్చిదిద్దేందుకు వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టాలన్నారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు సరఫరాపై అలసత్వం వహించొద్దని సూచించారు. కాగా, మండలంలో ఇప్పటి వరకు ఏ ఒక్క గ్రామంలో కూడా వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంపై అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మాణంతోపాటు ఇంకుడుగుంతలు నిర్మించుకునేలా చూడాలన్నారు.

మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు స్థలం లేని వారికి గ్రామ కంఠం నుంచి 3 మీటర్ల స్థలం కేటాయించి మరుగుదొడ్డి నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే, మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా గత మూడేళ్లుగా వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణం పూర్తి కాకపోవడం, ఇంటింటికి నల్లా కలెక్షన్‌ ఏర్పాటు చేయకపోవడంపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో మిషన్‌ భగీరథ ట్యాంక్‌ నిర్మాణాలు పూర్తి చేయని కాంట్రాక్టర్లను తొలగించి, నిర్మాణ పనులను సర్పంచులే పూర్తి చేసేందుకు ముందుకు రావాలని కోరారు. అలాగే, ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయం, అంగన్‌వాడీ, మసీదు, దేవాలయం, ప్రభుత్వ పాఠశాలలకు నలా కనెక్షన్‌ ఇవ్వాలని సూచించారు. వేసవిలో నర్సరీల్లోని మొక్కలు ఎండిపోకుండా సంరక్షించాలని తెలిపారు. నర్సరీలలో నీటి సమస్య ఉంటే ట్యాంకర్లతో నీటి సరఫరా చేసుకోవాలని, రైతులు కోరిన అల్లనేరెడు, మేడి, సపోట తదితర మొక్కలు అందించేందుకు అధికారులు సిద్ధం కావాలన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులతో కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ సమావేశమై భూ సమస్యలపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న భూసమస్యలను సత్వరమే పరిష్కరించి రైతులకు నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు పుట్టా వెంకట్‌రెడ్డి, డీఈ రవి చంద్రన్‌, తహసీల్దార్‌ నర్సింగ్‌రావు, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఈవోపీఆర్డీ ధనుంజయగౌడ్‌, డిప్యూటీ తహసీల్దార్‌ కృష్ణ, ఏపీవో రాజాశేఖర్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...