జూరాల @ 2.07 టీఎంసీలు


Thu,May 16, 2019 01:30 AM

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: మరో రెండు రోజుల్లో తాగునీటి అవసరాల కోసం జూరాల ప్రాజెక్టు నుంచి రామన్‌పాడుకు నీటి విడుదలకు మార్గం సుగమమవుతోంది. జూరాల ప్రాజెక్టుకు పైనుంచి వస్తున్న ఇన్‌ఫ్లోతో నీటి నిల్వ 2 టీఎంసీల మార్కును దాటడంతో ఎడమ కాల్వ ద్వారా నీటిని వదిలేందుకు అవకాశం కనిపిస్తోంది. నారాయణపుర ప్రాజెక్టు నుంచి గూగల్‌, గిరిజాపూర్‌ బ్యారేజీలకు.. అక్కడినుంచి జూరాల ప్రాజెక్టుకు కృష్ణా జలాలు మంగళవారం అర్ధరాత్రి చేరుకోగా.. ప్రస్తుతం ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతోంది. బుధవారం జూరాలకు 2900 ఇన్‌ఫ్లో నమోదు కాగా.. సాయంత్రం వరకు పై నుంచి వచ్చిన జలాలతో సుమారు 0.220 టీఎంసీల సామర్థ్యం పెరిగినట్లు జూరాల ప్రాజెక్టు ఈఈ హెచ్‌టీ శ్రీధర్‌ తెలిపారు. జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 313 మీటర్ల స్థాయిలో నీటి మట్టం చేరుకుంది. ఇంకో 0.4 టీఎంసీల నీళ్లు వచ్చి జూరాల ప్రాజెక్టు నీటి మట్టం 313.5 మీటర్లకు చేరుతుంది.

ఆ స్థాయిలో జూరాల ప్రాజెక్టు నుంచి రామన్‌పాడు రిజర్వాయర్‌కు నీటిని వదిలేందుకు మెరుగైన అవకాశాలుంటాయని ఆయన తెలిపారు. ఎగువ నుంచి బుధవారం ఉదయం 6 గంటలకు 0.1టీఎంసీల నీళ్లు రాగా.. సాయంత్రానికి 0.22 టీఎంసీల నీళ్లు వచ్చి చేరాయి. మంగళవారం 1.853 టీఎంసీల సామర్ధ్యంతో ఉన్న జూరాల ప్రాజెక్టు.. బుధవారం ఉదయానికి 1.95 టీఎంసీలకు.. సాయంత్రానికి 2.07టీఎంసీలకు చేరుకుంది. రాబోయే రెండు రోజుల్లో మరో 0.4టీఎంసీల మేర ఇన్‌ఫ్లో వచ్చినా.. రామన్‌పాడుకు వెంటనే నీటి విడుదల చేయనున్నారు. ప్రస్తుతం గూగల్‌ బ్యారేజి నుంచి 1500 క్యూసెక్కుల నీటిని జూరాల వైపు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో కొంత నెమ్మదిగా వస్తున్న పరిస్థితి మాత్రం ఆశాజనకంగానే ఉందని అధికారులు అంటున్నారు. మరోవైపు జూరాలకు ఇన్‌ఫ్లో వస్తుండటంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు తాగునీటి పథకాలకు నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మండు వేసవిలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న వేళ కర్ణాటక ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ వినతి మేరకు 2.5 టీఎంసీల నీటిని జూరాల ప్రాజెక్టుకు వదిలేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వస్తున్న ఇన్‌ఫ్లోతో ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు ప్రజలు తమ దాహార్తి తీరుతుందని భావిస్తున్నారు.

రామన్‌పాడులో 35.582 మెట్రిక్‌ క్యూబిక్‌ ఫీట్లు
రామన్‌పాడు రిజర్వాయర్‌ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 299.471మెట్రిక్‌ క్యూబిక్‌ ఫీట్లు. అయితే ప్రస్తుతం మాత్రం దారుణమైన పరిస్థితి ఉంది. కేవలం 35.582 మెట్రిక్‌ క్యూబిక్‌ ఫీట్ల నీటి నిల్వ మాత్రమే అందుబాటులో ఉంది. మహబూబ్‌నగర్‌ పట్టణంతో పాటు జడ్చర్ల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, దేవరకద్ర తదితర పట్టణాలకు ఇక్కడి నుంచి తాగునీరు అందుతుంది. నీటి నిల్వలు అడుగంటడంతో క్రమం తప్పకుండా నీటిని అందించే పరిస్థితి లేకుండా పోయింది. ఉన్న నీటిని క్రమంతప్పకుండా వాడుతున్నారు. ఇప్పుడు నారాయణపుర నుంచి కృష్ణా జలాలు అందకపోయి ఉంటే రామన్‌పాడు రిజర్వాయర్‌ నుంచి ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలకు తాగునీటి విడుదల అత్యంత కష్టంగా మారేది. సరైన సమయంలో తాగునీటి కోసం సీఎం కేసీఆర్‌ నెరపిన దౌత్యం ఫలించింది. అధికారులు జూరాల నుంచి అన్ని ఏర్పాట్లు చేసి సాధ్యమైనంత త్వరగా రామన్‌పాడుకు తాగునీటిని విడుదల చేయాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...