వైద్యశిబిరాన్ని వినియోగించుకోండి


Wed,May 15, 2019 01:56 AM

అడ్డాకుల: రాచాల గ్రామంలోని ప్రతి ఒక్కరు ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ సూచించారు. మంగళవారం అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో సత్యయోగి సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హాజరై వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైద్యం కోసం జిల్లా కేంద్రానికి కిలోమీటర్ల దూరం వెళ్లి వైద్యం చేసుకోలేని నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని వివరించారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన సత్యయోగి సేవా ట్రస్ట్‌ సభ్యులను కలెక్టర్‌ అభినందించారు. సేవా ట్రస్ట్‌ అధ్యక్షుడు రామచంద్ర మూర్తి మాట్లాడుతూ.. మా ట్రస్ట్‌ ద్వారా కష్ణా జిల్లాలోని జగ్గయ్య పేట మండలంలోని ముత్యాలలో ఉచిత వేద పాఠశాలను నిర్వహిస్తున్నామని, ప్రతినెలకు ఒక రోజు మారుమూల ఉన్నటువంటి గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుంటామని పేర్కొన్నారు. వైద్య శిబిరంలో డెంటల్‌, ఈఎన్‌టీ, జనరల్‌ చెకప్‌లపై పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వటం జరుగుతుందని, ఆపరేషన్‌ అవసరమున్న వారిని మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లోని దవాఖాణాల్లో చేర్పించి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. సేవే పరమావధిగా పనిచేస్తున్న మా ట్రస్ట్‌ సభ్యులను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.

కలెక్టర్‌కు సమస్యల వెల్లువ..
వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి వచ్చిన కలెక్టర్‌కు రాచాల గ్రామస్తులు వినతులు అందజేశారు. వ్యవసాయ భూములకు సంబంధించి విరాసత్‌, కొత్త పాసుపుస్తకాల గురించి రైతులు మొరపెట్టుకున్నారు. ప్రభుత్వ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలోని తరగతి గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరి ఎప్పుడు కింద పడుతాయో తెలియని పరిస్థితి నెలకొందని సర్పంచ్‌ తిరుపతయ్య యాదవ్‌ కలెక్టర్‌కు వివరించారు. కొంతమంది వృద్ధులు తమకు పింఛన్లు రావటం లేదని కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. త్వరలోనే పాఠశాల అదనపు గదులు, పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తహసీల్దార్‌ రవీంద్రనాథ్‌, ఎంపీడీవో ప్రభాకర్‌, డీటీ కిషోర్‌, ట్రస్ట్‌ సభ్యులు జగదీష్‌, సూర్యనారాయణ, రామలింగం, నిరంజన్‌ సింగ్‌, ఈశ్వర్‌, డాక్టర్‌ అపర్ణ, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...