తుది విడుత నేడే


Tue,May 14, 2019 02:25 AM

-8 మండలాల్లో 61 ఎంపీటీసీ స్థానాలకు 3 ఏకగ్రీవం
-58 ఎంపీటీసీ స్థానాల్లో197 మంది అభ్యర్థుల పోటీ
-8 జెడ్పీటీసీ స్థానాలకు బరిలో 34 మంది అభ్యర్థులు
-2563 మంది పోలింగ్ సిబ్బంది నియామకం
-356 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
-ఓటు హక్కును వినియోగించుకోనున్న 1,67,514, మంది ఓటర్లు
-కలెక్టర్ ధర్మారెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటు పూర్తి

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మూడో విడుత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల పోలింగ్ మంగళవారం 8 మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్నది. ఈ ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ ధర్మారెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలు జరుగనున్న తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, మెదక్, మండలాల్లో అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. 8 మండలాల్లో 427 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 2563 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. 427 మంది పోలింగ్ అధికారులు, 427 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులు 1709 మంది ఏపీవోలు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఎండలో ఓటర్లకు ఇబ్బందులు లేకుండా టెంట్లు సమకూర్చుతున్నారు. తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఏఎన్‌ఎమ్‌లు, బీఎల్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద విధులు నిర్వహించనున్నారు. వికలాంగులు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ట్రై సైకిళ్లను ఏర్పాటు చేశారు. 8 మండలాల్లో జరుగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 1,67,514 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో మహిళలు 86,002, పురుషులు 81,510 మంది ఓటర్లు, తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 356 పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి భోజన వసతితో పాటు అల్పహారాన్ని అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. 61 ఎంపీటీసీ స్థానాలకు గాను రామాయంపేట మండలం దామరచెర్వు, రాయిలాపూర్ ఎంపీటీసీ స్థానంతో పాటు నిజంపేట మండలం నందగోకుల్ ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా 58 ఎంపీటీసీ స్థానాలకు 8 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 58 ఎంపీటీసీ స్థానాలకు 197 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 8 జెడ్పీటీసీ స్థ్ధానాలకు 34 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2563 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తుండగా అందులో 38 మంది జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహిస్తున్నారు.
పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది..
సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకే మండల కేంద్రాల్లో బ్యాలెట్ బాక్స్‌ల పంపిణీ కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బస్సులలో తరలివెళ్లారు. మండల కేంద్రాల్లో పీవోలు, ఏపీవోలు, పోలింగ్ సిబ్బందికి భోజన వసతిని ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్స్‌లు, ఎంపీటీసీ , జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల బ్యాలెట్ పత్రాలను సరి చూసుకొని పోలింగ్ సామగ్రితో పాటు బ్యాలెట్ బాక్స్‌లను సిబ్బంది తమకు కేటాయించిన బస్సుల్లో రూట్ వైస్‌గా పోలీస్ ఎస్‌కార్ట్‌తో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలివెళ్లారు. తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, మెదక్, మండలాలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది మధ్యాహ్నం 3 గంటల వరకే రూట్‌ల వారీగా బస్సులలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
కలెక్టరేట్‌లో కాల్ సెంటర్ : కలెక్టర్ ధర్మారెడ్డి
మూడో విడుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్‌లో ఫిర్యాదులు, సలహాలు, సూచనల కోసం కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. ఏదైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే 08452-223362 నంబర్‌కు కాల్ చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లు తమ వెంట ఒక ఐడీకార్డును తప్పనిసరిగా పెట్టుకోవాలని డీపీవో హనోక్ కోరారు. అన్ని రాజకీయ పార్టీలు, ఓటర్లు, తమ పోలింగ్ సిబ్బందికి సహకరించి ప్రశాంతంగా పోలింగ్ జరుగడానికి సహకరించాలని డీపీవో కోరారు.
ఓటుహక్కు వినియోగించుకోనున్న ప్రముఖులు..
రామాయంపేట మండలం కోనాపూర్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మనోహరాబాద్ మండలం రామాయపల్లిలో ఎలక్షన్‌రెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
భారీ బందోబస్తు...
తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో 8 మండలాల్లో పోలింగ్ సందర్భంగా సీఐలు, ఎస్‌ఐలు, బందోబస్తు నిర్వహించనున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ చందనదీప్తి ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...