పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం


Fri,April 19, 2019 03:30 AM

- సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశ రాజకీయాల్లో కీలకం
- ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు
- నాలుగు శాఖల ప్రక్షాళనతో ప్రజలకు న్యాయం
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- పరిషత్ ఎన్నికలపై ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశం

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: రాబోయే పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలోని జిల్లా పరిషత్ అన్నింటిలో విజయం సాధిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. పరిషత్ ఎన్నికల నేపథ్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల ఆశీర్వాదాలు టీఆర్‌ఎస్ పార్టీకే ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లి, పంచాయతి ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శమన్నారు. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేశారన్నారు. త్వరలో జరుగబోయే పరిషత్ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని జెడ్పీ పీఠాలను టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాలోని ఎంపిటిసి, జెడ్పిటిసి స్థానాలతో పాటు మూడు జెడ్పి చైర్మన్ పదవులను గెల్చుకోవడం ఖాయమన్నారు. తెలంగాణలోని ప్రజలంతా టీఆర్‌ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు ఇప్పటికి నమ్ముతున్నారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ సహా ప్రతిపక్షాల అడ్రస్‌లు గల్లంతవుతాయని జోష్యం చెప్పారు. ఇటీవలి జరిగిన వరుస ఎన్నికల్లో ప్రజలు ఆయా పార్టీలకు గుణపాఠం చెబుతారన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాలకు పోటి చేసేందుకు అభ్యర్థులే లేరన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను నిలబెడితేనే ప్రజలు గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించబోతున్నారన్నారు. మే 23న పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ద్వారా దేశంలో రాజకీయ మార్పులకు టీఆర్‌ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుందన్నారు. కేసీఆర్ లాంటి నాయకుని అవసరం దేశానికి ఉందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు స్వంతంగా అధికారం చేపట్టే సీట్లు వచ్చే పరిస్థితులు లేవన్నారు.

కేసీఆర్ నాయకత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ ద్వారా దేశ రాజకీయాలతో సరికొత్త అర్థం చెప్పేలా సీఎం కేసీఆర్ ముందుకు సాగబోతున్నారన్నారు. రాష్ట్రంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ ఫథకాలు దేశానికి దిక్సూచిలా మారాయన్నారు. దేశం మరింత అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఒక్క రూపాయి ఇవ్వకుండా పనులు చేయించుకునే విధంగా సీఎం కేసీఆర్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలక, పంచాయతిరాజ్ శాఖలను ప్రక్షాళన చేయబోతున్నారన్నారు. దీని వల్ల ప్రజలకు ఎంతో న్యాయం జరుగుతుందన్నారు. దేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన తెలంగాణలో ఈ విధానం కూడా విజయవంతమవుతుందన్నారు. ప్రజలందరు కూడా సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలకు మద్దతు పలుకుతున్నారన్నారు. వేలాది మంది నిత్యం సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారని తెలిపారు. దశాబ్ధాల నుంచి అమలవుతున్న చట్టాలతో నాలుగు శాఖల్లో పనితీరు ప్రజలకు నష్టం, అసహ్యం కల్గిస్తుందన్నారు. దీనిని గుర్తించిన సీఎం కేసీఆర్ త్వరలో నూతన మునిసిపల్, రెవెన్యూ చట్టాలను తీసుకువస్తున్నారని పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులతో సహా అన్ని వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ తీసుకోబోతున్న ఈ విధాన నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు పలకాలన్నారు. పరిషత్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ముక్య నాయకులు కీలకంగా వ్యవహరించి అత్యధిక స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
స్థానిక సంస్థల బలోపేతానికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు విజయవంతం కావాలంటే టీఆర్‌ఎస్ అభ్యర్థులు పాగా వేశారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ విధేయులుగా ఉన్నారని, తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. క్రమశిక్షణ, అంకితభావంతో పని చేసిన సామాన్య కార్యకర్తలు సైతం తగిన ప్రాధాన్యత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాథ్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, భీరం హర్షవర్ధన్‌రెడ్డి, అబ్రహం, జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పి చైర్మన్ బండారి భాస్కర్, స్థానిక సంస్థల ఇంచార్జి, టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి పి. రాములు, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...