తెలంగాణ అమర్‌నాథ్


Tue,April 16, 2019 02:55 AM

- నల్లమల ప్రకృతి ఒడిలో వెలిసిన సలేశ్వర లింగమయ్య క్షేత్రం
- ఈ నెల 17 నుంచి 21 వరకు ఉత్సవాలు
- లింగమయ్య నామసర్మణతో మార్మోగనున్న కొండలు
- కొండలు, గుట్టల మధ్యన కొలువైన స్వామి..
- జైనులు, బుద్ధులు, శైవులు ఏలిన నేల
- మూడు కిలోమీటర్ల కాలినడకన ప్రయాణం
- 280 అడుగుల పైనుంచి జాలువారే జలపాతం

అమ్రాబాద్, రూరల్ : నల్లమల అడవుల్లో సాగించే ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరం.. ఎత్తైన కొండలు.. ఆ వెంటనే లోయలు.. పక్షుల కిలకిలరావాలు.. దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటుకుంటూ సాగించే ప్రయాణంలో అనేక అనుభూతులుంటాయి. నల్లమలలో చెంచులే పూజారులుగా జరిపే సలేశ్వరం ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దారిపొడవునా అటవీ అందాలు, ప్రముఖ శైవ క్షేత్రాలు, కనువిందు చేసే జలపాతాలు, అనేక రకాల వన్యప్రాణులు యాత్రికులను ఇట్టే కట్టిపడేస్తాయి. దాదాపు 35 కి.మీ. పొడవునా దట్టమైన అడవిలో సాగే యాత్రలో 3 కి.మీ. కాలినడకనే కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ అమర్‌నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం సాహసయాత్ర విశేషాలు నమస్తే తెలంగాణ ప్రత్యేకం.

ప్రకృతి అందాలకు నిలయమైన ప్రాంతం నల్లమల. ఈ అడవుల్లో అనేక శివాలయాలకు కేంద్రంగా ప్రకృతి సోయగాల మధ్య ప్రతి ఏడాది సలేశ్వరం ఉత్సవాలు ఆదివాసీలు వారి సంస్కృతి సాంప్రదాయలతో వైభవంగా జరుపుకుంటారు. అటవీ ప్రాంతంలో కాలినడకతో వచ్చే భక్తులకు ప్రకృతి రమణీయంతో పాటు జలపాతాలు భక్తులను ఇట్టే ఆకట్టుకుంటాయి. సహజంగా ఆదివాసీలు సలేశ్వర జాతర వేడుకలను ప్రతి ఏడాది 11రోజుల పాటు నిర్వహిస్తారు. కొన్ని సాంకేతిక కారణాలచేత అటవీశాఖ అధికారులు ఐదు రోజులు జరిపేందుకు మాత్రమే వీలు కల్పిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 17 నుంచి 21 వరకు సలేశ్వరం జాతర ఉత్సవాలు జరుగనున్నాయి. ఏడాది ఒక్కసారి మాత్రమే భక్తులకు సలేశ్వర లింగమయ్య దర్శనం ఇవ్వడం వల్ల రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్ర మరియు తదితర ప్రాంతాలనుండి భక్తులు లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.

ప్రదేశం ..ప్రాశస్త్యం..
ఈ అడవుల్లో చెట్లు, పక్షుల రాగాలు, వాగులు, వంకలు కొండలు గుట్టల మధ్యనుండి ఆకట్టుకునే జాలువారే జలపాతంలో వీటన్నిటితో మమేకమైన దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో సలేశ్వరం ఉత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. 280 అడుగులపైనుండి జాలువారే చల్లని జలపాతం పర్యాటకులను మైమరిపించేలా కనువిందు చేస్తుంది. దాని పక్కనే మరో గుహలో శనేశ్వరుని ఆలయం పూర్వం చాళిక్యులు, చోళులు, పాండ్యులు జైనులు, బుద్ధులు, శైవస్తులు మరియు వైష్ణవుల కాలంలో చెక్కిన రాతి విగ్రహాలు ఉన్నాయి. ఆ గుడిలో శివలింగం, దానికి ఇరువైపులా నాలుగు నాగపడిగెల గుడికి కుడివైన వీరభద్రుడు, ఎడుమ వైపున సిద్ధుడు, దక్షుడు, త్రివేణి, నంది విగ్రహాలు ఉన్నాయి.

స్వచ్ఛంద సేవలు
భక్తులకు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల వారు ఉచితంగా భోజనం, అల్పాహారాలు అందిస్తూ సేవభావాన్ని చాటుకుంటారు. దారిపొడవునా కొంతమంది నీళ్ల ప్యాకెట్లు అందజేస్తుంటారు. సలేశ్వర జాతరకు ప్రతి ఏడాది భక్తుల ద్వారా వచ్చే కానుకల సాయంతోనే ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది సుమారు 6లక్షలకు పైగా భక్తులు లింగమయ్యను దర్శించుకున్నారు.

లింగాకారంలో గుండం
సలేశ్వరం వద్ద జాలువారే జలపాతం రెండు కొండల మధ్య సహజసిద్ధ్దంగా లింగాకారంలో గుండంగా ఏర్పడింది. దీని లోతు సుమారు వంద అడుగులు ఉన్నట్లు ఆదివాసీ పెద్దలు చెబుతారు. జలపాతం చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఉత్సాహంగా తరలివస్తుంటారు. అలాగే భక్తుల నిండు పౌర్ణమి రోజున భక్తుల తాకిడి అధికంగా ఉండనుండడంతో జాతరకు వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వహకులు సూచిస్తున్నారు.

కొండల్లో కొలువైన లింగమయ్య
ప్రకృతి అందాలకు నిలయమైన నల్లమల అడవుల్లో ఎత్తైన కొండ మరియు లోయ మధ్యన పూర్వం ఐదారు శతాబ్దాల కిందట నుంచి లింగమయ్య పూజలు అందుకుంటున్నట్లు ప్రసిద్ధి. ఆది నుండి నుంచి ఇక్కడ శివుడికి పూజలు చేసేవారు. కాలక్రమేనా బయటి ప్రపంచానికి సలేశ్వరంలో వెలసిన లింగమయ్య పవిత్రత గురించి సుమారు ఎనిమిది దశాబ్దలుగా సలేశ్వరం ఉత్సవాలకు భక్తులు లక్షలాదిగా దర్శించుకుంటున్నారు. ఇక్కడ వెలసిన శివుడు సలేశ్వరం వెళ్లే మార్గంలో ఉన్న ఇప్పచెట్టుబండ దిగువన ఉన్న పెద్ద కొండ దిగువన కేవలం పది అడుగుల స్థలంలో వెలిశాడు.

వాహనాలకు అటవీశాఖ టోల్‌గేట్ వసూళ్లు..
సలేశ్వరం జాతరకు వచ్చే వేలాది వాహనాలకు అటవీశాఖ ఐదారు సంవత్సరాలుగా టోల్‌గేట్ వసూలు చేస్తుంది. ద్విచక్ర వాహనాల నుంచి అన్ని రకాల వాహనాలు మరియు ఆర్టీసీ బస్సులకు సైతం ఇలా రూ.50-200 వరకు వసూలు చేయడంతో ప్రతి ఏటా సుమారు పది లక్షల ఆదాయం సమకూరుతుంది.

ప్లాస్టిక్ కవర్లు పూర్తిగా నిషేధం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సలేశ్వరం ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తున్నందున ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించరాదని అటవీశాఖ అధికారులు భక్తులను కోరుతున్నారు. అలాగే మార్గమధ్యలో భక్తులకు అవగాహన కల్పించేందుకు ప్లాస్టిక్ నిషేధం వంటి బ్యానర్లును ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ కవర్లతో పాటు కాలుష్యం పెరుగడంతో పాటు వేసవిలో అడవి జంతువులు ప్లాస్టిక్ కవర్లు తిని మృత్యువాత పడుతున్నందున ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నారు.

ఎలా వెళ్లాలి..?
నలమల్ల కీకారణ్యంలో వెలసిన లింగమయ్య సలేశ్వర ఉత్సవాలకు వెళ్లేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. 1.హైదరాబాద్ నుంచి వచ్చేవారు.. 130కి.మీ, ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రం నుంచి 100కిలో మీటర్లు, నల్లగొండ జిల్లా నుంచి 150 కి.మీ. దూరం ప్రయాణం చేసిన తరువాత నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ గ్రామానికి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడనుండి శ్రీశైలం- హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారి మీదుగా మన్ననూర్ నుంచి 15 కి.మీ. దూరంలో ఉన్న ఫరహాబాద్ చౌరస్తాకు చేరుకోవాలి. అక్కడ నుంచి పూర్తిగా దట్టమైన అడవుల్లో ఉన్న సలేశ్వరం వెళ్లే మార్గంలో 30 కి.మీ. దూరంలో ఉన్న రాంపూర్ పెంటకు చేరుకోవాలి. అక్కడి నుంచి మరో 2 కి.మీ. దూరం ఆటోల ద్వారా వెళ్తే ప్రధాన మార్గం వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుండి మరో 3 కి.మీ. దూరం కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం గుడి వద్దకు సాహసయాత్ర చేయాల్సి ఉంటుంది. 2.రెండో మార్గం నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అప్పాయిపల్లి గ్రామం మీదుగా కాలినడకతో పాటు ట్రాక్టర్ల ద్వారా కొండల, గుట్టల పైనుంచి సాహసంగా సలేశ్వరం చేరుకోవాల్సి ఉంటుంది.

ఆదివాసీ చెంచులే పూజారులు
నల్లమలలోని వెలసిన అనేక శివాలయాల వద్ద ఆదివాసీ చెంచులే పూజారులుగా ఉంటున్నారు. సలేశ్వరం జాతర ఉత్సవాల్లోనూ చెంచులే పూజారులు. ఇక్కడికి చేరుకున్న భక్తులకు ఆలయ ట్రస్టు వారు లడ్డు, పులిహోర ప్రసాదం అందుబాటులో ఉంచుతున్నారు. గుడివద్ద పూర్తిగా చెంచులే చిరు వ్యాపారాలు చేసుకుంటారు.

లింగమయ్య నామస్మరణం
నల్లమల అడవుల్లో జరుగే సలేశ్వరం జాతర ఉత్సవాలకు వచ్చే భక్తులు వస్తున్నాం లింగమయ్య.. పోయివస్తాం లింగమయ్య అంటూ భక్తి పారవశ్యంతో సాహసయాత్రను సాగిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు మరో అమరనాథ్ యాత్ర మాదిరిగా భావిస్తారు. కొండలు, గుట్టలు, చెట్టు, పుట్టలను దాటుకుంటూ మార్గమధ్యలో సేదతీరుతూ కాలినడకన సాగించాల్సి ఉంటుంది.

పోలీస్ భద్రత
సలేశ్వరం జాతరకు లక్షలాదిగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో పోలీసుల శాఖ గట్టి భదత్రా ఏర్పాట్లు చేయనుంది. పౌర్ణమి రోజుకు ముందు తరువాత రోజుల్లో భక్తుల ఎక్కువగా ఉంటుంది. ఆయా రోజుల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయనున్నారు.

280 అడుగులపై నుంచి జాలువారే జలపాతం
నల్లమల అటవీ మార్గంలో కాలినడకన చేరుకున్న భక్తులకు సుమారు 280 అడుగుల పైనుంచి జాలువారే జలపాతం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. అయితే జలపాతం ఎక్కడనుంచి పారుతుందో ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఇక్కడ అన్ని కాలల్లోనే నీరు పైనుండి జాలువారుతూనే ఉంటుంది. ఇదిలా ఉండగా మండు వేసవిలో నెమ్మదిగా జాలువారే జలపాతం.. భక్తులు పెరుగుతున్న కొద్దీ జలపాతం మరింతగా పెరుగుతుందని ఇక్కడి ఆదివాసీల నమ్మకం.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...