ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం!


Sat,April 13, 2019 06:33 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : పోలింగ్ ముగిసింది.. ఈవీఎంలు స్ట్రాంగ్ రూంకు చేరిపోయాయి. స్ట్రాంగ్ రూంల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. ఓటర్లు తమ బాధ్యత నెరవేర్చారు. కానీ ఇన్నాళ్లు ఓటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేసిన అభ్యర్థుల్లో మాత్రం అదే టెన్షన్ కొనసాగుతోంది. ఫలితాలు వెలువడే మే 23వ తేదీ కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితాలకు మరో 41 రోజుల గడువు ఉండటంతో పార్లమెంట్ బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపును ఊహించుకుంటూ సుదీర్ఘంగా నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమై ఉన్నది.

స్ట్రాంగ్ రూంలో నిక్షిప్తం..
మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం కోసం 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల తరఫున.. టీఆర్‌ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, కాంగ్రెస్ నుంచి వంశీచంద్‌రెడ్డి పోటీ పడ్డారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల పరిధిలో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేశారు. తమ అదృష్టం పరీక్షించుకునేందుకు అభ్యర్థులంతా చెమడోడ్చారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా ఊహించిన స్థాయిలో ప్రచారం చేయలేకపోయాయి. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే.. పార్లమెంట్ ఎన్నికలపై గ్రామాల్లో అంత ఉత్సాహం కనిపించలేదు. ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ భారీగా జరుగుతుందని ఊహించినా గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే సుమారు 6 శాతం పోలింగ్ తక్కువగా నమోదవడం కోసం అభ్యర్థులను కాస్త కలవరపాటుకు గురి చేసింది. పోలింగ్ తమకు అనుకూలంగా జరిగిందంటే తమకు అనుకూలంగా జరిగిందని అభ్యర్థులు డాంభికాలకు పోతున్నారు. పోలింగ్ ముగియగానే అభ్యర్థుల్లో ఎక్కడలేని టెన్షన్ ప్రారంభమైంది. అయితే ఎవరు గెలుస్తారు.. ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్‌లో గళం వినిపించే అవకాశం ఎవరికి వస్తుంది.. అనేది మరో 41 రోజుల్లో తేలిపోనున్నది.

అభివృద్ధే గెలిపిస్తుందని టీఆర్‌ఎస్ ధీమా..
మహబూబ్‌నగర్ నుంచి బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో అధికార పార్టీకి చెందిన టీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పేరు చెబితే చాలు, కారు గుర్తు కనిపిస్తే చాలు ఓటర్లు కళ్లు మూసుకుని ఓటేస్తారని టీఆర్‌ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ సర్కారు చేపట్టిన అభివృద్ధి పథకాలే తమను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని టీఆర్‌ఎస్ నేతలు పేర్కొంటున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వీరంతా మంచి మెజార్టీగతో విజయం సాధించారు. ఎమ్మెల్యేలు సైతం పార్లమెంట్ అభ్యర్థి గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్య యాదవ్, కార్పొరేషన్ చైర్మన్లు, సెగ్మెంట్ ఇన్‌చార్జిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు అభ్యర్థి మన్నె గెలుపునకు నిర్విరామంగా పని చేశారు. కాంగ్రెస్, బీజేపీతో పోలిస్తే టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నాన్ లోకల్ కాగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి స్థానికుడు కావడం సైతం గులాబీ నేతలకు కలిసి వచ్చే అంశం. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరే పార్లమెంట్ ఎన్నికల్లోనూ సులభంగా గెలుస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. గతంలో వచ్చిన 2 లక్షల మెజార్టీ కంటే ఎక్కువగానే ఈసారి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మూడంచెల విధానంలో పటిష్ట భద్రత..
మహబూబ్‌నగర్ పట్టణంలోని భగీరథ కాలనీ సమీపంలోని జేపీఎన్‌ఈఎస్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 1871 ఈవీఎంలను భద్రపరిచారు. ఈవీఎంలను భద్రపర్చి సమయంలో అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలోనే స్ట్రాంగ్ రూములకు సీజ్ చేశారు. స్ట్రాంగ్ రూంల వద్ద మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలకు సంబంధించిన కంట్రోల్ రూం నుంచి స్ట్రాంగ్ రూంలోని దృశ్యాలను చూసేందుకు అవకాశం ఉంది. స్ట్రాంగ్ రూంలో పరిస్థితిని చూడాలనుకునే అభ్యర్థులు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుని కంట్రోల్ రూంలో నుంచి పరిశీలించవచ్చు. మరోవైపు స్ట్రాంగ్ రూంల వద్ద గతంలో ఎప్పుడు లేనంత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. త్రీ లేయర్ సిస్టం ద్వారా ఏర్పాటు చేసిన భద్రతలో లోపలి వైపున్న లేయర్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఆయుధాలతో విధులు నిర్వర్తిస్తారు. రెండో లైన్‌లో ఆర్మ్‌డ్ ఫోర్స్, 3వ దశలో స్థానిక సివిల్ పోలీసులు ఉంటారు. మొత్తం 55 మంది పోలీసులు తుపాకులు ధరించి విధులు నిర్వహిస్తారు. నిత్యం ఓ డీఎస్పీ స్థాయి అధికారి 24 గంటల పాటు ఇక్కడ ఇన్‌చార్జిగా ఉంటారు. ప్రతి 8 గంటలకు ఓసారి ఒక ఎస్సై పెట్రోలింగ్ నిర్వహిస్తారు. స్ట్రాంగ్ రూంలో సీసీ కెమెరాలను పర్యవేక్షించే కంట్రోల్ రూంలో కలెక్టర్ తరఫున ఒకరు, ఎస్పీ తరఫున ఒకరు విధుల్లో ఉంటారు. ఇక నిత్యం కలెక్టర్, ఎస్పీ వీలును బట్టి వెళ్లి స్ట్రాంగ్ రూంల వద్ద పరిస్థితిని సమీక్షిస్తారు. అడిషనల్ ఎస్పీ నోడల్ ఇన్‌చార్జిగా ఉండి భద్రతను పర్యవేక్షిస్తారు. మరో 41 రోజులపాటు పోలీసులు సవాల్‌గా తీసుకుని ఇక్కడ భద్రతను పర్యవేక్షిస్తారు. స్ట్రాంగ్ రూం వద్ద చీమ చిటుక్కు మనేందుకు కూడా అవకాశం ఉండదు. అంతటి భద్రత ఉంటుంది.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత
భగీరథ కాలనీ సమీపంలోని జేపీఎన్‌ఈఎస్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 1871 ఈవీఎంలను భద్రపరిచాం. ఇక్కడ అత్యంత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాం. త్రీ లేయర్ విధానంలో సీఆర్‌పీఎఫ్, ఆర్మ్‌డ్ ఫోర్సెస్, లోకల్ సివిల్ పోలీస్ సాయుధులై కాపలా కాస్తారు. 24 గంటలపాటు ఓ డీఎస్పీ ఇన్‌చార్జిగా ఉంటారు. ఎస్సైలు పెట్రోలింగ్ చేపడతారు. అడిషనల్ ఎస్పీ నోడల్ ఇన్‌చార్జీగా ఉంటారు. స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత మధ్య బందోబస్తు ఏర్పాటు చేశాం.. మే 23న కౌంటింగ్ జరిగే వరకు ఈ భద్రత కొనసాగుతుంది. పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలోనే స్ట్రాంగ్ రూంలకు సీల్ వేశాం. జిల్లా కలెక్టర్, నేను క్రమం తప్పకుండా స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత పర్యవేక్షిస్తాం.
- రెమా రాజేశ్వరి, ఎస్పీ, మహబూబ్‌నగర్

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...