స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రత


Sat,April 13, 2019 06:28 AM

మహబూబ్‌నగర్, తెలంగాణ చౌరస్తా : మహబూబ్‌నగర్ పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చడం జరిగిందని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీ జేపీఎన్‌ఈఎస్ కళాశాలలో ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ఫాం-17ఏ, డెయిరీలు, మైక్రో అబ్జర్వర్ల నివేదికలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంలను స్ట్రాంగ్ రూంల్లో భద్రపర్చి సీల్ చేశామని, ప్రాంగణం మొత్తం సీఆర్‌పీఎఫ్ బలగాలకు అప్పగించామని తెలిపారు. కౌంటింగ్ జరిగే మే 23వ తేదీ ఉదయం 5 గంటలకు పరిశీలకులు, అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూంలను తెరుస్తామని తెలిపారు. కౌంటింగ్ నిర్వహించే సిబ్బందిని ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయిస్తామని, స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేసిన కళాశాల ప్రాంగణంలో మూడంచెల భధ్రత ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతం మొత్తం సీసీ నిఘాలో ఉంటుందని, అభ్యర్థులు తమ ప్రతినిధులను సీసీ టీవీ రూంలో కౌంటింగ్ తేదీ వరకు నియమించుకోవచ్చని పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తామన్నారు. ఒక్కో రౌండ్‌కు 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో అభ్యర్థి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 మంది చొప్పున 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు తమ ఏజెంట్ల పేర్లను 48 గంటల ముందుగా సూచించాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు మరో ఏజెంట్‌ను నియమించుకోవాలని, వీరందరికి పోలీస్ వెరిఫికేషన్ పిదప కౌంటింగ్ పాస్‌లను జారీ చేస్తామన్నారు. ఏజెంట్లుగా సూచించే వారికి ఎలాంటి నేర చరిత్ర ఉండరాదని తెలిపారు. కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ఎన్నికల సాధారణ పరిశీలకుడు సంజయ్ గుప్తా, ఎస్పీ రెమా రాజేశ్వరి, ఎన్నికల ప్రత్యేకాధికారిణి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...