60.30శాతం పోలింగ్


Fri,April 12, 2019 02:02 AM

- 2014 పార్లమెంట్ ఎన్నికల్లో 71.3శాతం పోలింగ్
- గతంతో పోలిస్తే 5.91 శాతం తగ్గిన పోలింగ్
- ఉదయం పూటే అధికంగా
- చక్కని ఏర్పాట్లు చేసిన అధికారులు
- ఫలితం కోసం మే 23 వరకు వేచి ఉండాల్సిందే..
- అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూంలో పదిలం

మహబూబ్ నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 1871పోలింగ్ కేం ద్రాల్లో 15,05190 మంది ఓటర్లకు గాను 65.39 పోలింగ్ శాతం నమోదైంది. అత్యధికంగా షాద్‌నగర్- 74.28, అత్యల్పంగా కొడంగల్- 59.91 పోలింగ్ శాతం నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 71.3 శాతం పోలింగ్ నమోదవ్వగా ఈసారి 5.91 శాతం పోలింగ్ తగ్గింది. ఉద యం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఎండ ప్రభావం ఉండటంతో మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ బాగా సాగింది. 1 గంట నుంచి 3 గంటల వరకు పోలింగ్ మందగించినా... తర్వాత పుంజుకుంది. పార్లమెంట్ సెగ్మెం ట్ పరిధిలో అక్కడక్కడా పలు కారణాలతో కొద్ది సేపు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. అయి తే అధికారులు స్పందించి పోలింగ్ కొనసాగేలా చూసారు. ఓటర్లను చైతన్యం చేస్తూ ఎన్నికల సంఘం చేపట్టిన పలు కార్యక్రమాలు విజయవం తం అయ్యాయని భావిస్తున్న తరుణంలో.. పోలింగ్ శాతం కొద్ది మేర తగ్గడం గమనార్హం. అ యితే మండు వేసవిలోనూ ఓటేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పట్టణ ప్రాం తాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ ఎక్కువగా నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. పలు చోట్ల ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రాలకు మంచి స్పందన వచ్చింది. పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు బాగున్నాయని ఓటర్లు పేర్కొనడం గమనార్హం.

స్ట్రాంగ్ రూముల్లో భవితవ్యం..
మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఈవీఎంలను పట్టణంలోని భగీరథ కాలనీలోని జేపీఎన్‌ఈఎస్ కళాశాలలో భద్రపర్చారు. స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం దాగుంది. మే 23వ తేదీన కౌంటింగ్ జరుగనుంది. 42 రోజుల పాటు పోటీ చేసిన అభ్యర్థులు ఫలితం కోసం సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వస్తోంది. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, కాంగ్రెస్ నుంచి వంశీచంద్‌రెడ్డితో పాటు మొత్తం 12 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఎవరు మహబూబ్‌నగర్ నుంచి గెలుస్తారో తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.

మహబూబ్‌నగర్ పార్లమెంట్
పరిధిలో పోలింగ్ కొనసాగిన తీరు..
ఉదయం 9 గంటలకు- 15 శాతం
ఉదయం 11 గంటలకు- 27శాతం
మధ్యాహ్నం 3 గంటలకు- 56.2
సాయంత్రం 5గంటలకు- 64.99

నియోజకవర్గం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు శాతం

కోడంగల్ 215817 131612 60.98
నారాయణపేట 214329 129382 60.37
యం.నగర్ 226399 140437 62.03
జడ్చర్ల 202849 143663 70.82
దేవరకద్ర 217214 143300 65.97
మఖ్తల్ 222715 141518 63.54
షాద్‌నగర్ 104343 152978 74.31

మొత్తం 15,05190 9,82890 65.30

పార్లమెంట్ ఎన్నికలు జరిగాయిలా..
మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జి ల్లాల పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో జరిగిన ఎన్నికలకు సంబంధించి పోలీసులు పూర్తి స్థా యి బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ కారణా ల వల్ల పలుచోట్ల పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినా అదనపు ఈవీఎంలను ఏర్పాటు చేయడం వల్ల వెంటనే సమస్యను పరిష్కరించేందుకు వీలైం ది. 38బ్యాలెట్ యూనిట్లు, 26 కంట్రోల్ యూ ని ట్లు, 52 వీవీప్యాట్లు మొరాయించగా అధికారులు మార్చి ఓటర్లకు ఇబ్బంది లేకుండా చేశారు.
- జడ్చర్ల మండలం ఉదండాపూర్‌లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిహారం పెంపు కోసం ముంపు బాధితులు పోలింగ్‌ను బహిష్కరించారు. అయితే ఆర్డీవో శ్రీనివాసులు అక్కడికి వెళ్లి వారితో చర్చించారు. వారి సమస్యను సావధానంగా విన్నారు. ఈ నెల 16వ తేదీన కలెక్టరేట్‌కు రావాలని వారికి వివరించారు. పరిహారం పెంపు, ఇంటి స్థలాల కేటాయింపు, త్వరగా చెక్కులను అందచేయడం వంటి అంశాలపై కలెక్టర్‌తో సమావేశంలో పరిష్కారం అయ్యే లా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో పోలింగ్ ప్రారంభమైంది.

- జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లిని బాదేపల్లి మునిసిపాలిటీ నుంచి తొలగించి గతంలోలాగా గ్రామ పంచాయతీ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. బూరెడ్డిపల్లి చేరుకున్న పురపాలక అధికారులు గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితిని వివరించారు. పోలింగ్ ఆపటం సరైన విధానం కాదని స్పష్టం చేశారు. సుమారు గంటన్నర సేపు ఆగిపోయిన పోలింగ్... అధికారుల రాకతో తిరిగి ప్రారంభమైంది
- నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో గురువారం నాడు 10 మంది ఉపాధి హామీ కూలీలు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటనతో స్థానికంగా అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. ఈ ఘటనలో మృతులకు పరిహారం అందించాలనే డిమాండ్‌తో పోలింగ్‌ను గ్రామస్తులు బహిష్కరించారు. అయితే గ్రామంలో 23 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2456 మంది ఓటర్లకు గాను కేవలం 23 మంది మాత్రమే ఓట్లు వేశారు. అయితే గ్రామంలో విషాదకరమైన పరిస్థితులు ఉన్నందున ఈ అంశంపై అధికారులు సున్నితంగా వ్యవహరించాల్సి వచ్చిం ది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో మృతు ల కు టుంబాలకు పరిహారాన్ని ప్రకటించేందుకు ఇబ్బందులు ఉన్నాయని ఇప్పటికే మంత్రి బాధితులకు వివరించారు. ప్రభుత్వం అన్ని విధాలా వారి కుటుంబాలను ఆదుకుంటుందని తెలిపిన విష యం విదితమే.

తీలేరుపై నేడు నిర్ణయం
తీలేరు గ్రామంలో అన్ని గ్రామాలలో మాదిరిగానే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసి సిబ్బందిని నియమించాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు సిబ్బంది విధుల్లోనే ఉన్నారు. ఎన్నికల నిర్వహణ సిబ్బంది మాత్రమే తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ గ్రామంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలా? లేదా? అన్న విషయా న్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులతో చర్చించి నిర్ణ యం తీసుకుంటామని కలెక్టర్ రోనాల్డ్ రోస్ వివరించారు.
- మహబూబ్ నగర్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు జడ్చర్ల నుంచి తమ ఇద్దు రు కూతుళ్లతో కలిసి బైక్‌పై వస్తోన్న మల్లేశ్, జ్యోతి ఎస్వీఎస్ మెడికల్ కళాశాల వద్ద టోయింగ్ వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రి మల్లేశ్, చిన్న కూతురు బిందు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తర లిం చారు. ఓటేసేందుకు వచ్చి కుటుంబ పెద్ద, కూతురు చనిపోవడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఘటన స్థలంలో పరిస్థితి హృదయవిదారకంగా కనిపించింది. పాపం... ఓటేసేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయారని పలువురు ఆవేదన చెందారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...