ఓటేసిన ప్రముఖులు


Fri,April 12, 2019 02:01 AM

- మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- నవాబ్‌పేట్ మండలం గురుకుంటలో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి
- జడ్చర్లలో మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి

మహబూబ్ నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పోలింగ్ జరుగుతున్న తీరును తెలుసుకున్నారు.

- టీఆర్‌ఎస్ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నవాబ్ పేట మండలం గురుకుంటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం కేసీఆర్ తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చిందుకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం అధికారులు చక్కని ఏర్పాట్లు చేశారని తెలిపారు. యువత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించడం సంతోషించదగ్గ పరిణామమన్నారు.
- బాదేపల్లి ఉన్నత పాఠశాలలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి, ఆయన భార్య శ్వేత, కుమారుడు స్వరణ్‌తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం జడ్చర్ల నియోజకవర్గంలో పోలింగ్ సరళిని పరిశీలించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బాలానగర్ మండల కేంద్రంలో పోలింగ్ కొనసాగుతున్న తీరును గమనించారు. గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని లకా్ష్మరెడ్డి అన్నారు. ఓటు హక్కు ద్వారా దేశగతిని మార్చవచ్చని ఆయన పేర్కొన్నారు.

- దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఆయన భార్య మంజుల, కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం భూత్ పూర్ మండలం అన్నాసాగర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విపరీతమైన ఎండలున్నా ఓటర్లు శ్రద్ధగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని ఆల అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రక్రియలో ఎన్నికలు ఓ కీలక ఘట్టమని ఆయన అన్నారు. అనంతరం నియోజకవర్గంలో కొనసాగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు.
- మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ ముదిరాజ్ కమ్యూనిటీ హాల్‌లో ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్ గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈ సారి కూడా అదే స్థాయిలో పోలింగ్‌కు తరలివచ్చారని ఆయన అన్నారు. యువత, విద్యావంతులు, మేధావులు, వ్యాపారులు, ఉద్యోగులు... ఇలా అన్ని వర్గాల వారు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించారని మంత్రి వివరించారు. మహబూబ్ నగర్ పట్టణంలో పోలింగ్ సరళిని స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు.

- వికారాబాద్ జిల్లా షాబాద్ మండలంలోని గొల్లూరుగూడ గ్రామంలొ కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి గురువారం తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకొని టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
- మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్, తన భార్య విశాలాచ్చితో కలిసి ఓటు హక్కును కలెక్టర్ బంగ్లా బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన 218 పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయని తెలిపారు.
- జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమారాజేశ్వర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకునడం పౌరుల ప్రాథమిక బాధ్యతగా ఆమె తెలిపారు. ఓటు వేయడమంటే దేశాన్ని గెలిపించినట్లేనని ఆమె అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాతంగా కొనసాగాయన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...