శాసించే స్థాయికి టీఆర్‌ఎస్ ఎదగాలి


Mon,March 25, 2019 03:00 AM

నారాయణపేట, నమస్తే తెలంగాణ ప్రతినిధి : మన బలమే ... మన అభివృద్ధికి ఆధారం..తెలంగాణను సాధించుకొని మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకొని రాష్ర్టాన్ని, జిల్లాను అభివృద్ధి చేసుకుంటున్నామని రాష్ట్ర మంత్రులు డాక్టర్ వీ.శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లకా్ష్మరెడ్డిలు అన్నారు. ఆదివారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండల కేంద్రంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశాలకు వారు హాజరై ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డిల అధ్యక్షతన నిర్వహించిన సమావేశాలలో మాట్లాడారు. రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ 67 సంవత్సరాల పరిపాలన కాలంలో మన రాష్ర్టాన్ని, జిల్లాను పాలకులు అథోగతి పాలుజేశారన్నారు. పక్కనే ఉన్న నదీ జలాలను సైతం వాడుకోలేని స్థితిలో ఈ జిల్లాను మిగిల్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ర్టాన్ని, జిల్లాను అభివృద్ధి చేసుకునే అవకాశాలు మనకు కలిగాయన్నారు.

తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పటి నుంచి పుట్టే వరకు, వృద్ధులు, అనాథలకు, ఆడ పడుచులకు అండగా ఉండే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. రైతుల సంక్షేమం కోసం 24 గంటల విద్యుత్ సరఫరా, రైతుబంధు, బీమా పథకాలను అమలు చేసి దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగాను మన రాష్ర్టానికి గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చే పరిస్థితులు లేవన్నారు. మనం సాధించే 16 లోక్‌సభ స్థానాలు కేంద్రంలో ముఖ్యపాత్రను పోషించేవిగా మారనున్నాయని తెలిపారు. మన ఎంపీలను మనం గెలిపించుకుంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కావడమో లేదా మనం సూచించిన వ్యక్తే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి మన సత్తాను చాటుదామన్నారు.

శాసించే స్థాయికి ఎదగాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
జాతీయ స్థాయి పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మన రాష్ట్ర అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదు.. నిధుల కోసం,ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వాలను యాచించుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి..ఇప్పుడు మనం శాసించే స్థాయికి ఎదగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. అందరూ ఎంపీలలా కాకుండా తెలంగాణ ఎంపీలంటే ప్రత్యేక గుర్తింపు ఉండేలా ఇప్పుడు మనకు అవకాశాలు ఉన్నాయని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేలా కాంగ్రెస్, బీజేపీల నాయకులు కేసులు వేయడంతో సకాలంలో పనులు పూర్తికాక నారాయణపేట, కొడంగల్, మక్తల్ తదితర నియోజకవర్గాలకు సాగునీరు అందని పరిస్థితులు నెలకొన్నాయన్నారు.ప్రాజెక్టు అంచనాలు కూడా భారీగా పెరిగాయని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో ప్రతి ఏటా మన రాష్ట్రం నుంచి 50వేల కోట్ల రూపాయలను పొంది మనకు మాత్రం రూ.23 వేల కోట్ల లోపే నిధులను కేటాయిస్తుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు మనమంతా కలిసి కట్టుగా కృషి చేసి కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యపాత్రను పోషిద్దామన్నారు. కృష్ణా, వికారాబాద్ మధ్య రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయడంలో గత కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ ప్రాంతంలో కంది పరిశోధనా కేంద్రాన్ని, దౌల్తాబాద్ బొంరాస్‌పేటలలో జూనియర్ కళాశాలల ఏర్పాటు, డబుల్ బెడ్‌రూంల నిర్మాణాలు చేస్తామన్నారు.

పార్లమెంట్‌లో బలం పెంచుకుందాం జడ్చర్ల ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి
ఇటీవల జరిగిన అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికలలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారని, ఇదే ఉత్సాహంతో పార్లమెంట్‌లో బలం పెంచుకుందామని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రం నుంచి నిధులను సాధించుకుంటేనే మన ప్రాంతాలను అన్నివిధాలా అభివృద్ధి చేసుకోగలుగుతామని చెప్పారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ టీఆర్‌ఎస్ పార్లమెంటు అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాలలో రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, ట్రేడ్ కార్పొరేషన్ ఛైర్మన్ దేవర మల్లప్ప, కొడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యురాలు చిట్టెం సుచరిత, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్, మక్తల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్సింహులుగౌడ్, టీఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్యా, నారాయణపేట మున్సిపల్ చైర్మన్ అనసూయ చంద్రకాంత్, గులాం మొహియొద్దీన్, ఏఎంసీ చైర్మన్ సర్రాఫ్ నాగరాజు, వైస్ ఛైర్మన్ చెన్నారెడ్డి, ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, జెడ్పీటీసీ రాస్నం అనితా బాల్‌రాజ్, ఎంపీటీసీ రాజేశ్, కోస్గి మండల రైతు సమన్వయ సంఘం అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి రామకృష్ణ, నీలప్ప, సలీం, ఓం ప్రకాశ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...