వైద్యాధికారుల పనితీరును మెరుగుపర్చుకోవాలి


Sat,March 23, 2019 02:45 AM

నారాయణపేట టౌన్ : నారాయణపేట జిల్లా పరిధిలో గల ఆయా పీహెచ్‌సీల, దవాఖానల వైద్యాధికారులు తమ పనితీరును మరింత మెరుగుపర్చుకొని రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించి నారాయణపేటను వైద్య సేవల పరంగా నెంబర్‌వన్‌గా నిలపాలని కలెక్టర్ వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ వెంకట్రావు నారాయణపేట జిల్లా పరిధిలోని వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రావు ఆయా పీహెచ్‌సీల పనితీరు, అందుతున్న వైద్య సేవలు, ఇతరత్రా వివరాలను గురించి ప్రస్తుత పురోగతి తదితర విషయాలను అడిగారు. అందుకు సమాధానం ఇవ్వలేక ఆయా పీహెచ్‌సీల సిబ్బంది తచ్చాడుతూ నీళ్లు నమిలారు. నారాయణపేట కలెక్టర్‌కు జిల్లా పరిధిలోని ఆయా పీహెచ్‌ల వారీగా అందజేసిన వైద్య సేవల నివేదికలో ఒకలా, అధికారులు కలెక్టర్‌కు చెప్పిన వివరాలు పొంతనలేకుండా ఉండడంతో కలెక్టర్ వెంకట్రావు అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అందించిన నివేదికలో ఒకలా.. మీరు మాటల్లో చెప్పేది మరోలా ఉండటమేమని కలెక్టర్ ప్రశ్నించారు. ఏదైనా సమావేశం నిర్వహిస్తే సమావేశానికి ఆయా పీహెచ్‌ల పరిధిలో అందించిన వైద్య సేవల నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని, అంతేకానీ సమావేశం అంటే ఏదో వచ్చాము పోయాము అనే విధంగా ఉండకూడదని సిబ్బంది తీరును ఘాటుగా కలెక్టర్ తప్పుబట్టారు. ప్రతి ఒక్కరూ సమయపాలన తప్పకపాటించాలన్నారు. అనంతరం ఆయా పీహెచ్‌సీల వారీగా అందుతున్న వైద్య సేవల రిపోర్టును అడిగి తెలుసుకున్నారు. నారాయణపేట జిల్లా పరిధిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఇంకా కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించిన లబ్ధిదారులకు కంటి అద్దాల పంపిణీని ఎందుకు పెండింగ్‌లో ఉంచారని అందుకు గల కారణాలను వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ప్రతి పీహెచ్‌సీకి ఎంతమంది గర్భిణులు వస్తున్నారు ఎంతమందికి వైద్య సేవలు అందుతున్నాయనే తదితర వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఏ స్త్రీకి కూడా రక్తహీనత సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత పీహెచ్‌సీల నిర్వహకులదేనన్నారు. కేసీఆర్ కిట్టు అర్హులైన వారందరికీ అందేలా చూడాలన్నారు. ప్రతి మంగళవారం సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు తాను స్వయంగా జిల్లా పరిధిలోని పీహెచ్‌సీలను స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. కాగా కలెక్టర్‌తో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి కొంతమంది పీహెచ్‌సీల నిర్వాహకులు గైర్హాజరుకావడంతో కలెక్టర్ సంబందిత అధికారులపై అసహానం వ్యక్తం చేశారు. కలెక్టర్‌తో మీటింగ్ అంటే కూడా ఇంత నిర్లక్ష్యమా అంటూ స్వయంగా డీఎంఅండ్‌హెచ్‌వో సౌభాగ్యలక్షీతో కలెక్టర్ అన్నారు. జిల్లాలోని 14 పీహెచ్‌సీల్లో చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని త్వరిగతిన పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లా పరిధిలోని మరికల్ పీహెచ్‌సీ పనితీరు నివేదిక పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డా.మల్లికార్జున్, వైద్యులు డా.రంజిత్‌కుమార్, చక్రాధర్, వెంకట్, బాలాజీరావు, శైలజ, నర్సింగ్‌రావు సగరి, ఆయా పీహెచ్‌సీల నిర్వాహకులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...