31న ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం


Mon,March 18, 2019 11:56 PM

గద్వాల, నమస్తే తెలంగాణ : ఈ నెల 31వ తేదీన అలంపూర్ చౌరస్తాలోని విశ్వభారతి జూనియర్ కళాశాల ఆవరణలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, ఇండియా రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ వారి సౌజన్యంతో ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శశాంక తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మెగా వైద్య శిబిరం నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ మెగా వైద్య శిబిరం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందున వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య భద్రత-సామాజిక బాధ్యత అనే ఉద్దేశంతో పవర్‌గ్రిడ్ ఇండియన్ రెడ్‌క్రాస్ వారు ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ ఆసుపత్రులైన కిమ్స్, మరియు రైయిన్‌బో హైదరాబాద్ నుంచి జనరల్ సర్జన్, ఫిజీషియన్, గుండె వ్యాధి, గైనకాలజిస్ట్, నరాల వ్యాధి, చర్మ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు వంటి వివిధ రకాల వ్యాధులకు సంబంధించి స్పెషలిస్ట్ డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తారన్నారు.

పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉచిత మందులు అందజేస్తారని తెలిపారు. 31వ తేదీన ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం వరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఇది సదరం క్యాంప్ కాదనిక రోగులకు మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. వైద్య శిబిరానికి తరలించడానికి అవసరమైన బస్సులు ఏర్పాటు చేశామన్నారు. రోగులను వైద్య శిబిరానికి ఉచితంగా తరలిస్తామన్నారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్‌టీవోను కలెక్టర్ ఆదేశించారు. వచ్చే రోగులకు మధ్యాహ్నన భోజనం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో రాములు, వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజేంద్రకుమార్, డీఆర్‌డీవో జ్యోతి, డీడబ్ల్యూవో పద్మావతి, ఆర్‌టీవో చక్రవర్తిగౌడ్, డీపీవో కృష్ణ, అడిషనల్ ఎస్పీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజల కోసం కలెక్టరేట్ ఆవరణలో చలివేంద్రాన్ని కలెక్టర్ శశాంక ప్రారంభించారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...