పులకించిన మన్యంకొండ


Wed,February 20, 2019 11:22 PM

మహబూబ్‌నగర్, తెలంగాణ చౌరస్తా : మన్యంకొండలోని వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం తెల్లవారు జామున నిర్వహించిన రథోత్సవ వేడుకలు కన్నుల పండువగా, శోభాయామానంగా జరిగాయి. పేదల తిరుపతిగా పేరు గాంచిన మన్యంకొండ ఆలయాన్ని సందర్శించుకొని బ్రహ్మోత్సవాలలో భాగస్వాములు అయితే తమకు అన్నివిధాలా కలిసి వస్తుందన్న నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి చేరుకోవడం ఆనవాయితీ. అందుకే వెంకన్న స్వామి రథోత్సవ వేడుకలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని విద్యుద్దీపాలంకరణలో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మంగళవారం ఉదయం నుంచే భక్తులు భారీగా తరలిరాగా.. మధ్యరాత్రి 12 గంటల నుంచే రథోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలతో ముస్తాబు చేసిన రథంపై వెంకన్న స్వామిని ఊరేగించారు. అర్చకులు వేదమంత్రాలను ఉచ్చరిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు స్వామి రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ వేడుకను తిలకించి భక్తులు పరశించిపోయారు. అంతకుముందు స్వామి వారిని ఆలయం నుంచి పల్లకీలో మెట్ల మార్గం ద్వారా తేరు మైదానం వద్దకు స్వామిని తీసుకువచ్చారు.

50 వేల మంది రాక..
మన్యంకొండ బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం తెల్లవారుజామున నిర్వహించిన వెంకన్న స్వామి రథోత్సవానికి దాదాపు 50 వేల మంది భక్తులు హాజరయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచే కాకుండా కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అశేష భక్తజన సందోహం మధ్య రథోత్సవ కార్యక్రమాలు ఆరంభమయ్యాయి.

అలరించిన భజన, సన్నాయి, వాయిద్యాలు
స్వామి వారి రథోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు, కళాకారులు నిర్వహించిన భజనలు, కీర్తనలు, వాయిద్యాల హోరు భక్తులను అమితంగా అలరింపజేశాయి. సంప్రదాయ నృత్యాలు, డప్పుల వాయిద్యాలు, విద్యుత్ కాంతుల వెలుగులు, పటాకుల మోతలు, రథోత్సవ వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భక్తులకు అత్యవసర సేవలను అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక పూజలు
వెంకన్న స్వామి రథోత్సవానికి హాజరైన రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. తేరు మైదానంలో ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి వారిని ఉంచి మరోమారు పూజలు చేశారు. భక్తులు గోవింద నామస్మరణలు చేస్తుండగా రథాన్ని మంత్రి లాగి వేడుకలను ప్రారంభించారు. భక్తులందరూ కలిసి రథాన్ని ప్రధాన దారి మీదుగా ఊరేగించారు. తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు ఈ వేడుకలు వైభవంగా కొనసాగాయి.

పేదల తిరుపతి మన్యంకొండ : మంత్రి
మన్యంకొండ రథోత్సవ వేడుకలకు హాజరైన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విలేకరులతో మాట్లాడారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ జిల్లాలోని పురాతన దేవాలయాలలో ప్రధానమైందన్నారు. తిరుపతికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్న భక్తులు ఇక్కడి స్వామిని దర్శించుకుంటే అన్నివిధాలా శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకమన్నారు. అందుకే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివస్తారని పేర్కొన్నారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే భక్తుల సౌకర్యార్థ్యం అనేక ఏర్పాట్లు చేశామని, మరిన్ని ఏర్పాట్లు చేసి మన్యంకొండను ప్రధాన పర్యాటక స్థలంగా రూపొందిస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, ప్రతాప్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ఆలయ ధర్మకర్త అళహరి మధుసూదన్ కుమార్, మహబూబ్‌నగర్ సింగిల్‌విండో అధ్యక్షులు వెంకటయ్య, పాలక మండలి సభ్యులు, పీవో వెంకటాచారి, పాలక మండలి సభ్యులు గంగాధర్‌గౌడ్, దేవేందర్‌రెడ్డి, అపర్ణరెడ్డి, మహాలక్ష్మి, గండెన్న, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, బాలమ్మ, చంద్రమౌళి, లక్ష్మీదేవీ, వెంకట్రావు, నర్సిములు, సర్పంచ్ శ్రీకాంత్‌గౌడ్, ఫత్తేపూర్ ఎంపీటీసీ కృష్ణయ్యగౌడ్, భక్తులు పాల్గొన్నారు.

182
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...